విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?

 వినడానికి విచిత్రంగా ఉన్నా మనదేశంలోని ఒక సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగికంటే ఎక్కువసార్లు ఇక్కడ భారతీయ భోజనం తింటున్నాము. కాకపోతే తాజా భారతీయ కూరగాయలతో వండుకునే వంటలు తక్కువ. ఎక్కువగా స్థానిక మార్కెట్లో దొరికే కూరగాయలతోనే మన కూరలు వండుకుంటాం.

మేముంటున్న చిన్న పట్టణంలో రెండు మూడొందలు మించి భారతీయులు ఉండరు. పైగా దేశంలోని మిగతా పెద్ద నగరాలకు ఇది దూరంగా కూడా ఉంటుంది. కాబట్టి మన పచ్చిమిర్చి, ములక్కాయ, బెండకాయ, ఆనబకాయ లాంటి కూరగాయలు దొరకవు. అప్పుడప్పుడూ ఒక అరబ్ కొట్టోడు తీసుకొస్తాడుగాని ఒక ఐదు కేజీలు కూరగాయలు కొంటే ఆ నెల జీతం అక్కడ పెట్టేసి వెళ్ళమంటాడు. జన్మానికో శివరాత్రి అన్నట్లు వాడు తెచ్చేదే ఎప్పుడో ఒకసారికదాఅని కొనేస్తాం. పప్పులు, కారాలు, మసాలాలు కూడా అక్కడే దొరుకుతాయి. ఊళ్లోని భారతీయులందరికీ వాడొక్కడే దిక్కు కాబట్టి వాడేంత చెబితే అంత. బేరం ఆడొచ్చా అనే అనుమానం వస్తే ఇక్కడ మీరు మహేష్ బాబు పంచ్ డైలాగ్ వేస్కొవచ్చు. మన చేపలు, రొయ్యలు ప్యాక్ చేసి ఫ్రోజెన్ చేసిన ప్యాకెట్లలో అమ్ముతారు. పీతలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు వంటివాటిని మర్చిపోవచ్చు.

స్థానిక మార్కెట్లలో వంకాయ, ఉల్లిపాయ, టమాటో, పాలకూర, పుట్టగొడుగులు, గుడ్లు, మాంసం వంటివి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఒక్కోసారి మనదేశంలోకంటే తక్కువధరకే లభిస్తాయి కూడా. ఉప్మారవ్వ అయితే తిన్నోడికి తిన్నంత. విచిత్రం ఏంటంటే ఆ అరబ్ కొట్లో కేజీ అనబకాయ కొనే డబ్బుతో స్థానిక మార్కెట్లలో మూడు కేజీల తాజా కోడిమాంసం దొరుకుతుంది. అయినాగానీ ఇండియాలో అసలు ఆనబకాయే తినని నేను ఇక్కడ అంత రేటున్నా కొంటున్నాను. స్థల మహిత్యం అనుకుంటా. వీళ్ళ సాల్మన్, ట్యూనా చేపలు చాలా బాగుంటాయి కానీ రొయ్యలు మాత్రం హవాయి చెప్పు ముక్కలాగా ఉంటాయి.

మరి అంతంత రెటుపోసి మన కూరగాయలు కొనాలంటే బాధనిపిస్తుంది కాబట్టే మేము ఇండియా నుండి తిరిగొచ్చేటప్పుడు సగం లగేజి కూరగాయలు, పప్పులు, మసాలాలు, కారాలు ఉంటాయి. అమెరికాలా కాకుండా ఇక్కడికి అటువంటివి తెచ్చుకోవచ్చు. ఇంటికి వచ్చిన వెంటనే కూరగాయలన్నీ తీసి కట్ చేసి ఫ్రోజెన్ చేసి పొదుపుగా వాడుకుంటాం. ఒక్కొక్క పచ్చిమిర్చిని ఎంతో అపురూపంగా చూసుకుంటాం. గింజ కూడా పోనిచ్చేది లేదు. ఎప్పుడైనా పెద్ద నగరాలు వెళ్తే తిరిగొచ్చేటపుడు కేజీలు కేజీలు కూరగాయలు తెచ్చేసుకుని అవికూడా అదే విధానంలో దాచుకుంటాం. నార్వేలో విత్తన ఖజానా ఉన్నట్లు మాఊళ్ళో భారతీయులందరి ఫ్రిజ్జుల్లో కూరగాయల ఖజానాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఎవరైనా గర్భవతి అయినప్పుడు ఆడవాళ్లు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ అడిగే రెండో మాట "నీకేమైనా కూరగాయలు తినాలనిపిస్తే నాదగ్గర ఉన్నాయి" అని.

ఆఫీసుకి వెళ్ళేటపుడు ప్రతిరోజూ డబ్బా పట్టుకుపోతాను. లేకపోతే మధ్యాహ్నం ఇంటికే వచ్చేసి తినేసి వెళ్తా. ఇంట్లో ఎక్కువగా తెలుగు భోజనమే. సమయంలేకపోతే పాస్తా, పిజ్జా లాంటివి చేసుకుంటాం. నెలకి రెండు మూడు సార్లు టీం లంచ్ ఉంటే మాకు బాగా నచ్చిన ఒక ఇండియన్ రెస్టారెంట్, ఒక థాయ్ రెస్టౌరెంట్, ఒక జపనీస్ రెస్టారెంట్, ఒక సెర్బియన్ రెస్టారెంట్లలో వోటింగ్ వేసుకుని ఒకటి ఎంచుకుంటాము. మరైన్ మ్యూసియంలో ఉండే స్వీడిష్ వంటలు కూడా బాగుంటాయిగాని కొంతమంది సహోద్యోగులు అక్కడికి రారు. అలా ఒకసారి ఇటాలియన్ రెస్టారెంటుకి వెళ్లి దెబ్బైపోయిన సందర్భం కూడా ఉందిలేండి. ఇక కుటుంబంతో బయటతినే విషయానికొస్తే మావూళ్ళో నాకుటుంబం అంతా కలిసి తినగలిగే రెస్టారెంట్లు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు ఇండియన్ రెస్టారెంట్లు. ఒక స్థానిక పిజ్జా రెస్టారెంట్, చివరిది మెక్ డొనాల్డ్స్. మా అమ్మాయి బడిలో స్వీడిష్ వంటకాలే తింటుంది. ఇంట్లో ఇడ్లీలు, దోసెలు ఇష్టంగా తింటుంది.

కాబట్టి కేవలం భారతీయ వంటకాలే తినడం సాధ్యపడదు. అలాగే స్థానిక వంటకాలే తినాల్సిన అవసరం లేదు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?