మీ పేరు సాధారణంగా ఉండకపోవడం వల్ల, విచిత్రంగానో, తమాషాగానో ఉండడం వల్ల మీరు ఎదుర్కున్న అనుభవాలు ఏమిటి?

 నాకు మనదేశంలో అటువంటి విచిత్రానుభవాలు ఏమి కలగలేదు కానీ నేను స్వీడనుకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నా పేరు మార్చేశారు. స్వీడిష్ భాషలో J అక్షరానికి యా శబ్దం వస్తుంది, జ శబ్దం లేకపోవడం వలన వారికి ఆ అక్షరం పలకడం కష్టం. ఆఖరికి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా జ ఉండాల్సిన చోట య అని పలుకుతారు. యోక్(joke), యోహాన్(johan), యపాన్(japan) అలా అన్నమాట. అలా నా పేరుని వీళ్లు రాయాగా మార్చేశారు. కార్యాలయం, బడి, వైద్యం ప్రతి చోటా అదే పలుకు. మొదట్లో సవరించడానికి ప్రయత్నించాను. కొంతకాలానికి ఇది యరిగే(జరిగే) పనికాదనిపించి ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

ఇక్కడ ఒక తమాషా అనుభవం మా మామగారి పేరువలన కలిగింది. పోయిన సంవత్సరం నా భార్య మొదటి కాన్పుకి మా అత్తామామలు మా ఇంటికి వచ్చారు. వారికి మేముంటున్న ఊరు చూపిస్తుంటే నా సహోద్యోగి డాన్ నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. తను కొనుక్కున్న పెద్ద టీవీని గోడకి బిగించడానికి సహాయం చెయ్యమని పిలిచాడు. మిమ్మల్ని ఇంటిదగ్గర దించేసి ఇలా నా స్నేహితుడి ఇంటికి వెళ్లాల్సిఉందండీ అని చెప్తే ఆయన కూడా నాతో వస్తానన్నారు. పది నిమిషాల్లో డాన్ ఇంటికి చేరుకోగానే అప్పటికే బస్టాప్ లో మాకోసం ఎదురుచూస్తున్నాడు. డాన్ కి మా మామగారని చెప్పాను. ఇంగ్లీషులో "నా పేరు డాన్" అని చెప్పి మా మామగారికి చెయ్యిచ్చాడు. మా మామగారు ఏమన్నాడు అని నా వైపు చూస్తే, తన పేరు డాన్ అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు, మీరు మీ పేరు చెప్పండి అన్నాను. ఆయన సూర్యనారాయణరెడ్డి అని చెప్పి చెయ్యందుకున్నారు.

డాన్ మొహం చూస్తే అర్ధమైపోయింది వాడికి పేరు నోరు తిరగట్లేదని. ఒక అయిదు సెకండ్లు సమయం తీస్కుని హలో సూనానరెడి అని చెయ్యూపాడు. నాకు నవ్వాగలేదు. బలవంతంగా నోటికి చెయ్యదిమిపెట్టాను. అప్పటికీ ఆపుకోలేక పక్కకి తిరిగాను. మరోపక్క మా మామగారు వాడికి తనపేరెలా పలకాలో ఒక్కొక్క అక్షరం విడమర్చి చెప్తున్నారు. కొన్ని ప్రయత్నాలతర్వాత సూరియనరయనరెడి దగ్గర ఇద్దరూ రాజీపడ్డారు. తర్వాతి రోజు ఆఫీసులో మా మామగారిపేరుతో వాడు పడ్డ కష్టాలు మిగిలిన వారికీ చెప్తే ఆ పేరేంటో చెప్పమని వాళ్ళు నన్ను బలవంతపెట్టారు. ఒక వారంరోజులపాటు ఆ పేరు నా స్వీడిష్ సహోద్యోగులందరికీ ఒక టంగ్ ట్విస్టర్ ఐపోయింది.


Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?