ఈరోజుల్లో కూడా కులవివక్ష ఉందంటారా? మీరు చూసిన అటువంటి అనుభవాలేవి? వాటిపై మీ అభిప్రాయమేమిటి?

 ముమ్మాటికీ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది.

కుల ప్రాతిపదికన అభిమాన నటుల్ని, రాజకీయ నాయకులని ఎంచుకునే వ్యక్తులని నా జీవితం లో చాలా మందినే చూసాను. అటువంటి ప్రవర్తన కేవలం అభిమానం వరకు మాత్రమే ఉంటే భరించొచ్చు. కానీ అది దురభిమానంగా మారి అంతర్జాలంలో ఏ విధంగా తన్నుకుచస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

నేను ఏడవ తరగతి చదివేటప్పుడు (2002) మొట్టమొదటిసారి కుల వివక్ష చూసాను. పక్కవాడి జవాబు పత్రంలో చూసి రాస్తున్నావా అని గద్దించిన మాస్టారుకి నా తోటి విద్యార్థి చెప్పిన సమాధానం ఇక్కడ చెప్పడానికి కూడా నాకు జుగుప్సగా ఉంది. కులం అంటే ఏంటో తెలియని ఆ వయసులో ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆ సంఘటన తలచుకుంటే వాడిని మాస్టారుగారు ఎందుకు శిక్షించలేదో తెలియట్లేదు.

చిన్నప్పుడు స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో పెద్దవాళ్ళు అడిగే ప్రశ్న మీరేం కులం అని. అలా కొంతమంది స్నేహితుల ఇంటికి మరికొంత మంది స్నేహితులని రానివ్వకపోవడం నేను చూసాను.

కళాశాలలో కులం ఆధారంగా విద్యార్థులు జట్లుగా ఏర్పడడం కూడా చూసాను. హాస్టల్ గదులలో, క్యాంటీన్లో ప్రతి చోట కుల వివక్ష ఉండేది. అదృష్టం కొద్దీ నేను పనిచేసిన చోట ఎవరు, ఎప్పుడు కుల సంబంధిత ప్రశ్నలు అడగలేదు.

అసమానతలు తొలగించాల్సిన విద్యాసంస్థల్లోనే కులబీజాలు పడుతున్నాయని నా అభిప్రాయం. అసలు కులవ్యవస్థ ఎలా పుట్టింది, దానిలోని లోపాలు, దానివలన మన సమాజంలో జరిగిన, జరుగుతున్న నష్టాలు గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఇంకా కూలంకషంగా చేర్చాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?