తెలుగు ప్రముఖుల్లో ఎవరి జీవితాలను బయోపిక్స్‌గా తీస్తే బావుంటుంది? ఎందుకు?

 అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జీవితాన్నీ సినిమాగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

పొట్టి శ్రీరాములు 1901 సంవత్సరం మద్రాసులో జన్మించారు. వీరి స్వగ్రామం ప్రస్తుత నెల్లూరు జిల్లా, పడమటిపాలెం. మద్రాసులో ప్రాథమిక విద్యాబ్యాసం, బొంబాయిలో శానిటేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసారు. ఆయన వివాహ జీవితం మొదట్లోనే భార్యాబిడ్డల అకాలమరణంతో విషాదాంతం అయ్యింది. ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి గాంధీజీ పిలుపందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.

1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఒకసారి, 1941-42 మధ్య క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మరో మూడు సార్లు ఖైదు చేయబడ్డారు. స్వాతంత్య్రం తర్వాత ఆయన దృష్టి అణిచివేయబడుతున్న వర్గాలమీద పడింది. నిమ్న వర్గాలకు ఆలయ ప్రవేశం జరగాలని నిరాహార దీక్ష చేసి విజయం సాధించారు.

అప్పటికే భాషాప్రాతిపదికన రాష్ట్ర ఏర్పాటుకు మాట ఇచ్చి నిలుపుకోకపోవడంచేత రాష్ట్ర సాధనకోసం నిరాహారదీక్ష మొదలుపెట్టారు. దీక్షకు ఆంధ్ర కాంగ్రెస్ నాయకులనుండి కనీస మద్దతు కూడా రాలేదు. ఆ పరిస్థితులలో బులుసు సాంబమూర్తిగారు తన మద్దతు తెలియచేస్తూ దీక్షాస్థలిగా తన ఇంటిని వాడుకోమని ఇచ్చారు. అలా 1952 అక్టోబర్లో మొదలైన నిరాహారదీక్ష చివరికి శ్రీరాములు గారి బలిదానంతో ముగిసి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పుకునేలా చేసింది.

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం సినిమాగా తీస్తే ఆయన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారు నప్పుతారని అనుకుంటున్నాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?