దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా అభిమానించే తెలుగు వంటకాలు ఏవి?
నేను చెన్నైలో పనిచేసినప్పుడు నా తమిళ సహోద్యులకు బాగా నచ్చిన తెలుగు స్వీటు పూతరేకులు.
తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం గ్రామం పూతరేకుల తయారీకి ప్రసిద్ధి చెందింది. కానీ ఈ మధ్యకాలంలో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని మంచిలి తయారీ పూతరేకులకు కూడా మంచి పేరు వచ్చింది.
ఒకసారి పండక్కి ఇంటికొచ్చి మా అన్నయ్యని చూద్దామని మంచిలి వెళితే చెన్నై తీసుకెళ్లమని వద్దంటున్నా వినకుండా ముప్పై పూతరేకులు నా బ్యాగ్లో పెట్టేసాడు. అన్ని పూతరేకులు నేనేం చేసుకుంటానని నా సహోద్యుగుల కోసం కొన్ని ఆఫీసుకి తీసుకువెళ్లా. నా టీంలో నాతోపాటు ఇంకొక తెలుగాయనా, ముగ్గురు తమిళులు ఉన్నారు. తెలుగయనకి పూతరేకులు తెలుసు గనుక ఎగబడి ఒక రెండు తీసుకున్నారు. మిగిలిన ముగ్గురికి దాన్ని ప్రయత్నించడానికి కూడా ధైర్యం చెయ్యలేదు. పైగా టిష్యూ పేపర్ లా ఉంది అని జోకులు కూడా వేసుకున్నారు. తర్వాతి రోజు కూడా ఆ డబ్బా అక్కడే అలాగే ఉంది. మా లీడర్ నాగరాజ్ గారు నేను నొచ్చుకుంటానేమోనని ఒకటి తీస్కుని ఎలా తినాలని అడిగి తెలుసుకుని ఒక ముక్క కొరికారు. "మనం అనుకున్నట్లైతే లేదు" అని మిగిలిన ఇద్దరికీ చెప్పారు. వాళ్ళు నా ముందు తినడానికి ఇబ్బంది పడ్డారు కానీ నేను లేనప్పుడు తిని చూసి నచ్చిందని చెప్పారు. సాయంత్రానికి పది పూతరేకులు అయిపోయాయి, ఖాళీ డబ్బా ఇంటికి తీసుకెళ్లా. తరువాతి రోజు ఇంకా ఉంటే పట్టుకురమ్మని ఫోన్ చేసారు. నాకోసం ఉంచుకున్నవి కూడా తీస్కెళ్లిపోయా. ఈసారి పక్క టీం వాళ్ళు కూడా తిన్నారు. ఆ తర్వాతి నుండి నేనెప్పుడు రాజమండ్రి వెళ్లినా పూతరేకులు తీసుకురావడం ఒక ఆనవాయితీగా మారింది.
రెండేళ్ల క్రితం మా మాజీ టీంలీడర్ నాగరాజ్ గారి నుండి ఒక సందేశం వచ్చింది. "రాజ్! నువ్వు మీ ఊరినుండి తీసుకొచ్చే టిష్యూ పేపర్ స్వీట్ ఉంది కదా! దాని పేరేంటి?" అని.
Comments
Post a Comment