మీ జీవితంలో మరువలేని రైలు ప్రయాణం ఏది? ఎందుకు?
"రైలు ఐదింటికి. నేను ఇప్పుడే ఆఫీసునుండి స్టేషనుకి బయలుదేరా". అమ్మతో ఫోన్లో మాట్లాడి ఎగ్మోర్ స్టేషన్కి బయల్దేరాను.
నేను ఎక్కాల్సిన రైలు సర్కార్ ఎక్స్ప్రెస్ ఐదూ ఇరవైకి బయల్దేరుతుంది. అలవాటైన బండే కదా ప్లాటుఫారం చూసుకోవడంలాంటివేపుడో మానేశా. ఎప్పుడు కనీసం ఒక గంట ముందు స్టేషన్కి వచ్చే వాడిని కానీ ఆ రోజు లోకల్ బస్సు తప్పిపోవడంతో కొంచెం ఆలస్యం అయింది. రెండు చేతుల్లో ఉతకాల్సిన దుప్పట్లు, బట్టలు కుక్కిన రెండు బ్యాగులు పట్టుకుని బ్రిడ్జిమీద నా ప్లాటుఫారంకి వెళ్తుంటే కింద రైలు నెమ్మదిగా మొదలయ్యింది. అప్పుడే టైమైపోయిందని గ్రహించి వెంటనే పరుగున వెళ్లి కొద్దిగా నెమ్మదిగా వెళ్తున్న రైలుని పట్టుకుని ఎక్కేసి ఎదో విన్యాసం చేసిన సినిమాహీరోలా ఉప్పొంగిపోయి నా సీట్లో కూర్చున్నా. నా ఎదురుగా ఒక విద్యార్థి బృందం వాళ్ళ మాస్టారు కలిసి ఎక్కడికో ఆటలపోటీకి వెళ్తున్నట్టున్నారు. రైలు మొదలైన పది నిమిషాలకే పై బెర్తులో సంచులు పడేసి నేను కూడా ఎక్కేసి ఫోన్లో ఎదో చదువుకుంటున్నాను.
ఏడింటికి నేను తెచ్చుకున్న బిర్యానీ తినేసి ఇక నిద్రపోవడమే అనుకుంటున్న తరుణంలో విద్యార్థి బృందంలో ఒక కుర్రాడు "క్షమించండి, ఈ బెర్తు మాది" అని మర్యాదగానే చెప్పాడు. కొంపదీసి వేరే బోగీ ఎక్కేసానేమోఅని నా టికెట్ మరోసారి చూసుకుని ఇది S5 ఏనా అని అడిగితే అవునన్నారు. అయితే నాకు కూడా ఇదే బెర్తు వచ్చిందని వాళ్ళకి టికెట్ చూపించాను. మాకు విషయం అర్ధం కాక టికెట్ కలెక్టర్ని తీసుకొచ్చారు. అయన మా ఇద్దరి టిక్కెట్లు చూసి నిదానంగా నాకు అసలు సంగతి చెప్పారు. నేను ఎక్కాల్సింది సర్కార్ ఎక్సప్రెస్ కానీ పొరపాటున కాచిగూడ ఎక్కేసానని. వెర్రిమొహం వేసి తింగరి చూపులు చూస్తుంటే తర్వాత వచ్చే స్టేషన్లో దిగిపోతే అక్కడినుండి విజయవాడ వైపుకి రైళ్లుంటాయని హితబోధ చేసారు. తప్పు తెలిసి పై బెర్తు ఖాళీ చేస్తుంటే తరువాతి స్టేషన్ వచ్చేవరకు ఉండమని ఆ మాస్టారు చెప్పారు.
కనీసం నా టికెట్ని కాన్సల్ చేస్తే ఏమైనా డబ్బులు తిరిగొస్తాయేమో అని నా స్నేహితులకి ఫోన్ చేస్తే అంతర్జాలం ఉన్న ఒక్కడు కూడా ఎత్తలేదు. చివరికి ఒక స్నేహితురాలు స్పందిస్తే నా టికెట్ కాన్సల్ చెయ్యమని చెప్పి రేణిగుంట నుండి రాజముండ్రికి రైళ్ళుంటే చూడమని అడిగాను. ఒక గంటలో తిరుమల ఎక్సప్రెస్ ఉందని కానీ టికెట్ బుకింగ్ లేదని చెప్పింది. చివరికి రేణిగుంటలో దిగి జనరల్ టికెట్ తీసుకుని తిరుమల ఎక్కితే రైలు ఖాళీగా ఉండడంతో అపరాధ రుసుము కట్టించుకుని టికెట్ కలెక్టర్ బెర్తు ఇచ్చారు.
పొద్దున్న ఆరింటికి రాజమండ్రిలో దిగుతానని తమ్ముడికి సందేశం పంపి నిద్రపోయాను. చెప్పినట్లుగానే ఆరింటికి సర్కారుకంటే గంటన్నర ముందే రాజమండ్రి వచ్చేసాను. నా కోసం వేచిచూస్తున్న మా తమ్ముడు "సర్కారుకి కదా వస్తున్నానన్నావ్, తిరుమలలో వచ్చావేంటి?" అని అడిగితే జరిగింది చెప్పాను. ఇంటికి వెళ్లి అమ్మకి చెబితే వాళ్లిద్దరూ నన్ను చూసి నవ్వుకున్నారు. ఎందుకు అని అడిగితే వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా చూడమని చెప్పారు.
Comments
Post a Comment