బయటినుండి చూడటానికి బాగుండని రెస్టారెంటుకు వెళ్ళి రుచికరమైన ఆహారం తిన్న సందర్భం మీకు ఎదురైందా? అయ్యుంటే ఎక్కడ? ఏమి తిన్నారు?

 నేను చెన్నైలో ఉద్యోగం చేసేటప్పుడు నా మిత్రులతో కలిసి షోలింగనల్లూర్లో ప్లాట్ అద్దెకు తీసుకుని ఉండేవాళ్ళం. మా ఐదుగురిలో ఇద్దరు షోలింగనల్లూర్ కార్యాలయంలో, నాతో కలిపి ముగ్గురం సిరుసెరి కార్యాలయంలో నియమింపబడ్డాము. నా మిత్రుడు వీరబాబు షోలింగనల్లూర్ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతకాలానికి కొంతమంది తమిళ సహోద్యోగులతో స్నేహం ఏర్పడింది. వారు కూడా నా స్నేహితునిలాగే తిండియావ ఉన్నవారవడం చేత చీటికిమాటికి చుట్టుపక్కల ఉన్న ప్రతి రెస్టారెంటుకి వెళ్తుండేవారు. వీరబాబుకి కొంచెం గొప్పలు చెప్పే అలవాటు కూడా ఉండడంతో వాడు ఎక్కడ, ఏమి తిన్నాడో సాయంత్రం ఇంటికి వచ్చాక ఏకరువు పెట్టేవాడు.

ఒకరోజు ఆఫీస్ పక్కనే ఉన్న భాయ్ రెస్టారెంట్లో బిర్యానీ తినొచ్చి సాయంత్రం మా చెవులూదరగొట్టేసాడు. అటువంటి బిర్యాని చెన్నైలో అసలు నేనెప్పుడూ తినలేదు, మీరు కూడా ఒకసారి తిని తీరాల్సిందంతే అని పట్టు పట్టాడు. వీడి గురించి తెలిసిన విషయమే కదా అని, సరేలేరా అంటూ మిగిలిన వాళ్ళందరూ తలూపాము. మీరక్కడ తినలేరు, హోటల్ చూసి లోపల అడుగు పెట్టకుండా వచ్చేసాను అని నాగ వీర అనే మరో స్నేహితుడు హెచ్చరించాడు. దాంతో చాలాకాలం వీరబాబు బలవంతపెట్టినా అక్కడికి వెళ్లే సాహసం చెయ్యలేదు.

ఇలా చాలాసార్లు అడిగాక ఇక తప్పేట్లు లేదనుకుని ఒక శనివారం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కార్యాలయం వెనుక వీధి చివరికి తీసుకువెళ్లాడు. ఇక్కడ హోటల్ ఎక్కడుంది అని ఒకరిమొహాలు ఒకరు చూస్కుంటుంటే, అదిగో అదే అని ఒక ఖాళీస్థలంలో ఒక చిన్న తాటాకు పాకని చూపించాడు.

"అదా!! అయితే నేను రాను. మీరెళ్ళి మీకేం కావాలో అది తినేసి రండి, నేను రూముకి వెళ్లిపోతున్నా!" అని లోకేష్ మొహం చిట్లించాడు.

"పోతే పో. మనం తిందాం రండి" అని మిగిలిన వారిని లాక్కుపోయాడు.

లోపలికి వెళ్లిచూస్తే వాడకంలో లేని కల్లుపాకలాగా అనిపించింది. టేబుళ్లు, కుర్చీలు రోడ్డుపక్క చిన్నచిన్న ధాబాల్లో కంటే దారుణంగా ఉన్నాయి. డైనింగ్ టేబుళ్లు, వంట ప్రదేశం, కౌంటర్ అన్ని పక్కపక్కనే ఉన్నాయి. మధ్యలో అడ్డుగోడ, తెర లాంటివేం లేదు. సన్నగా, ఛామన ఛాయ, పిల్లిగడ్డం, తలమీద తకీయాతో నా తండ్రి వయసులో ఉన్న ఒక వ్యక్తి అక్కడ వంట చేస్తున్నాడు. వీరబాబుని చూడగానే వాంగ తంబీ, ఉకారూంగ అని మమ్మల్ని ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి , కౌంటర్లో కూర్చున్న వాళ్ళమ్మాయిని ఏం కావాలో చూడమని చెప్పాడు. ఇక్కడ చికెన్ బిర్యానీ బాగుంటుంది అదే తిందాం అని మా అందరికి అదే తీసుకురమ్మని వీరబాబు చెప్పాడు. పాక బయటకు వెళ్లి చేతులు కడుకొచ్చి కూర్చున్నాక, ఆ అమ్మాయి డ్రింక్స్ ఏం కావాలని అడిగితే కొంత మంది కూల్డ్రింక్స్ చెప్పారు, నేను నీళ్ల బాటిల్ అడిగాను. అవి తీసుకొచ్చి ఇచ్చింది. కాసేపటికి భాయ్ పెద్ద ప్లేటుల్లో అందరికి బిర్యానీ తీసుకొచ్చాడు. అతని బట్టలు, చేతులు పొడిగా శుభ్రంగానే ఉన్నాయి. వడ్డన కూడా నిదానంగా పద్దతిగానే చేసాడు. బాగా వేడిగా ఉండడంతో ఒక రెండు నిమిషాలాగి ఒక ముద్ద, చికెన్ ముక్కతో కలిపి పెట్టుకోగానే తెలిసింది వీరబాబు చెప్పే గొప్పల్లో అప్పుడప్పడూ కొన్ని నిజాలుంటాయని. చాలా రుచికరంగా, ఇంకా చెప్పాలంటే అద్భుతంగా ఉంది ఆ బిర్యాని. వీరబాబుని నొప్పించడం ఇష్టంలేక రెండు ముద్దలు తినేసి వచ్చేద్దాం అనుకున్న నేను నా ప్లేటు మొత్తం ఖాళీ చేసేసాను. వెంటనే భాయ్ వచ్చి రైస్ అపరిమితం అని మళ్ళీ బిర్యాని పెట్టాడు. మేమెంత సేపటికి బయటకి రాకపోయేసరికి లోకేష్ కూడా లోపలికి వచ్చాడు. పరిసరాలు అన్ని చూసుకుని వాడుకూడా బిర్యానీ ఆర్డర్ చేసాడు. అందరం తృప్తిగా భోంచేశాం. అక్కడికి వాళ్ళ కార్యాలయంలోని డెలివరీ హెడ్లు కూడా వస్తుంటారని రాజేష్ మాకు ఆ తర్వాత చెప్పాడు.

అప్పటినుండి మేము తరచుగా అక్కడ భోజనం చేస్తూండేవాళ్ళం. కొన్నాళ్ళకి వేరొకచోటికి వెళ్లిపోవడం వలన అక్కడికి వెళ్లడం తగ్గించేశాం. ఆ తరువాత భాయ్ కి పక్షవాతం రావడం వలన ఆ హోటల్ మూతపడిందని, వాళ్ళూరు వెళ్లిపోయారని తెలిసి బాధ పడ్డాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?