మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మరా? నమ్మితే ఎందుకు నమ్ముతారు? నమ్మకపోతే ఎందుకు నమ్మరు? మీరు నమ్మేవాళ్ళైతే నమ్మని వాళ్ళని దేవుడున్నాడు అని ఎలా ఒప్పిస్తారు? ఒక వేళ నమ్మని వాళ్ళైతే నమ్మే వాళ్ళ నమ్మకాలు తప్పు అని ఎలా ఒప్పించగలరు?
నేను అజ్ఞేయవాదిని.
నేను పాఠశాలలో చదివే రోజుల్లోనుండే నాకు దైవం, మతాలమీద అనాసక్తి కలిగింది. ముఖ్యంగా నా ఎడమచేతివాటం వల్ల దేవాలయాలు, పూజ కార్యక్రమాల్లో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను అజ్ఞేయవాదిగా మార్చాయి.
దైవం మీద నా ఉద్దేశాలను చెప్పినపుడు మా అమ్మగారు లెంపలేసుకున్నారు, మా నాన్నగారు నాకు లెంపలు వేశారు. అందుకే ఈ అంశం గురించి నేను ఎవరితోనూ చర్చించను. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నా తల్లిదండ్రుల, వారి తల్లిదండ్రుల ఇష్టం మేరకు హైందవ సంప్రదాయంలోనే జరిగాయి. దానివలన నాకొచ్చిన నష్టంలేదు కనుక నేను అడ్డు చెప్పలేదు. నా భార్యకు దైవం మీద విశిష్టమైన నమ్మకం. కానీ మేము ఒకరి నమ్మకాలలో మరొకరు తల దూర్చము. తనకి నచ్చిన దేవాలయాలకు, పూజ కార్యక్రమాలకు నేనే స్వయంగా తీసుకెళ్తా. ఎందుకంటే అది నా బాధ్యత. మా అమ్మాయి అన్నప్రాసన, పుట్టినరోజు దైవప్రార్ధనలతోనే ప్రారంభం అయ్యాయి. తన నమ్మకాన్ని తన కూతురికి చెప్పే హక్కు నా భార్యకి ఉంది కనుక నాకు అభ్యంతరం లేదు. నా కుటుంబ సభ్యుల మతస్వేచ్ఛకే భంగం కలిగించని వాణ్ణి ఇక బయటి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను.
కానీ మతం పేరుతో మూఢనమ్మకాలను ప్రచారం చేసినా, నా మతానికి అంతా తెలుసు అని నమ్మబలికినా, ఆత్మనూన్యతాభావంతో మతాల్లో లేనివాటిని నకిలీ శాస్త్రాన్ని పుట్టించి ప్రజలమీదకి వదిలినా వాటిని వ్యతిరేకిస్తూ నా అభిప్రాయాన్ని వెల్లడించడానికి వెనకాడను.
Comments
Post a Comment