గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగువారిలో కొందరు ఏ సమస్యా లేకుండా పనిచేయగా, మరికొందరు నానా అగచాట్లు పడుతున్నారు. తేడా ఎక్కడ వస్తోంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

 35 ఏళ్ళ క్రితం నా మేనమామ నుండి ఇప్పుడు నా తమ్ముడి వరకు నాకు బాగా దగ్గరైన వాళ్ళు తొమ్మిది మంది గల్ఫ్ దేశాల్లో పని చేసారు. కొంత మందికి పని వాతావరణం సాఫీగా సాగగా మరికొంతమంది అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.

ముందుగా సమస్య ఇక్కడ ఉన్న ఏజెంట్లతోనే మొదలవుతుంది. ఏజెంట్లపేరుతో పల్లెటూళ్లలో తిరిగేవాళ్ళలో ఎంతమందికి అప్రూవల్ ఉందొ తెలీదు. వాళ్ళ దగ్గర అవకాశం ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఇప్పిస్తామని పాసుపోర్టు తీసుకుని, కమిషన్లో కొంత డబ్బు ముందు కట్టాలని బలవంతపెడతారు. గవర్నమెంట్ నియమాల ప్రకారం ఇరవైవేలకంటే ఎక్కువ రుసుము వసూలు చెయ్యకూడదు. కానీ వీళ్లు కనీసం లక్ష వసూలు చేసేవాళ్ళు. డబ్బులు కట్టించుకుని మొహం చాటెయ్యడం, వర్క్ వీసా బదులు టూరిస్ట్ వీసా ఇచ్చి మోసం చెయ్యడం, చేయాల్సిన పని విషయంలో అబద్దం చెప్పి పంపడం వంటి మోసాలను చూసాను. కాబట్టి కేవలం అప్రూవల్ ఉన్న ఏజెంట్ని మాత్రమే సంప్రదించాలి. వీసా వచ్చేవరకు ఒక్క రూపాయి కూడా కట్టకూడదు. కంపెనీ పేరు, ఉద్యోగుల విషయంలో దాని నిబద్దత వంటివి ఇంటర్నెట్లో గాని, గల్ఫ్ లో పనిచేస్తున్నవాళ్ళనిగాని అడిగి తెలుసుకోవాలి. జీతాలు ఖచ్చితంగా ఇస్తున్నాయా, నివాస సదుపాయం ఎలా ఉంది, పాస్పోర్ట్ మనదగ్గరే ఉంచుకునే అవకాశం ఉందా అనే విషయాలు ముందే తెలుసుకోవాలి. ప్రభుత్వాధిన (ఆరామ్కో లాంటివి), బహుళజాతి కంపెనీల్లో (మారియట్, సెక్యూరిటాస్ లాంటివి) ఈ సదుపాయాలన్నీ ఉంటాయి. మీకు చెప్పిన కంపనీపేరుతోనే వీసా, అది కూడా వర్క్ వీసా అయితేనే గల్ఫ్ కి వెళ్ళండి. జాబ్ పోర్టళ్లల్లో వచ్చే ఉద్యోగాలకి అప్లై చేసినప్పుడు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.

ఏజెంట్ బాలారిష్టాలు దాటి గల్ఫ్ లో అడుగుపెట్టాక మీరు పని చేస్తున్న కంపెనీ పరిస్థితులు మీకు చెప్పినవిధంగా లేకపోతే ఇండియాకి వచ్చేయడానికి ప్రయత్నించండి. కట్టిన డబ్బులు వృధా అవుతాయనో, ఇండియాలో జనాలు ఏమనుకుంటారనో దేశంకాని దేశంలో ఇబ్బందులు పడొద్దు. అక్కడ పని నచ్చక ఇండియాకి తిరిగొచ్చి వ్యాపారం, వ్యవసాయం, ఇతర పనులు చేసి సంతోషంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని గుర్తుపెట్టుకోండి.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?