ఎడమచేతి వాటాన్ని నిరసించే చులకన చేసే సంస్కృతిలో మీరు లేదా మీకు తెలిసిన వారు పెరిగితే మీ అనుభవాలు చెప్పగలరా?
ఎడమ చేతివాటం వలన దైనందిక జీవితంలో, సామాజిక కార్యకలాపాలలో నేను పడిన ఇబ్బందులను గురించి నేను ఈ క్రింది సమాధానంలో వివరించాను.
ఒక మనిషికి కేవలం ఎడమ చేతివాటం ఉండడంచేతే ఆ వ్యక్తి ప్రతిభను తక్కువచేసి చులకనగా మాట్లాడేవాళ్ళను కొంతమందిని చూసాను.
మా క్లాసులో నాతో కలిపి ముగ్గురు ఎడమ చేతివాటం వారు ఉన్నారు. అందులో నా స్నేహితుడు కిరణ్ కూడా ఒకడు. తను చాలా అద్భుతంగా క్రికెట్ ఆడతాడు. బాడ్మింటన్లో కూడా మంచి ప్రతిభ కనబరిచేవాడు. కానీ వాడు బాగా ఆడతాడు అనే మాట కంటే ఎడమ చేతివాటం వల్ల వాడికి అడ్వాంటేజ్ అవుతుంది అనే మాట ఎక్కువ వినబడేది. ఇక్కడ పోటిలేదుగాని అంతర్-పాఠశాల పోటీలలో దొరికేస్తాడు అనేవారు. కానీ అక్కడ కూడా పోటీలో ఉన్న వేరే ఎడమచేతివాటం ఉన్నవాళ్ళని ఓడించి పతకాలు తీసుకొచ్చాడు. వాళ్ళ మాటే నిజమైతే నేను కూడా కనీసం రెండో స్థానంలో ఉండాలి. కానీ ఈ విషయం ఎవరు మాట్లాడరు.
ఇక చదువు విషయానికొస్తే నాకు లెక్కల్లో ఎప్పుడు మంచి మార్కులొచ్చినా అది నా చేతివాటం(దొంగతనం కాదులేండి) వల్ల మాత్రమే వచ్చిందనే వాదించే మనిషొకడుండేవాడు. అతని వాదన ప్రకారం నా మెదడులోని ఎడమపక్క భాగం మిగిలిన వాళ్ళకంటే చురుగ్గా పనిచెయ్యడం వలన నేను లెక్కలు బాగా చేయగలుగుతున్నాను, కానీ తరగతిలో నా కంటే ఎక్కువ మార్కులొచ్చిన వాళ్ళది మాత్రం ప్రతిభ, కృషి.
మన సమాజంలో ఎక్కువమంది ఎడమ చేతివాటం ఉన్న వారికి ఉండే ఎటువంటి ప్రతిభ అయినా అది కేవలం వారి ఎడమచేతివల్ల వారికి వచ్చిన అదృష్టం అని భావిస్తారు కానీ వారి కృషి, శ్రమను గుర్తించరు.
Comments
Post a Comment