స్వీడన్, నార్వే వంటి స్కాండినేవియన్ దేశాల మానవ అభివృద్ధి సూచికలు (హ్యూమన్ డవలప్మెంట్ ఇండెక్స్) మెరుగ్గా ఉంటాయి అంటారు. అక్కడి జీవితం, మానవ హక్కులు, ప్రభుత్వం, ప్రవర్తన నిజంగా అందుకు తగ్గట్టు ఉంటాయా? మీ అనుభవం ఏమిటి?
మానవ అభివృద్ధి సూచికలో స్కాండినేవియన్ దేశాలు (ఉత్తర ఐరోపాలోని చాలామట్టుకు దేశాలు) మెరుగైన స్థానంలోనే ఉన్నాయి. నిజానికి ఆ పట్టికలో కొన్ని తూర్పుమధ్య దేశాలు స్కాండినేవియన్ దేశాలకు మరీ ఎక్కువ దూరంలో ఏంలేవు. కానీ ప్రజాజీవితంబట్టి స్కాండినేవియన్ దేశాలను ముందు వరసలో నిలబెట్టే ప్రధాన అంశాలు అక్కడి మానవహక్కులు, ప్రభుత్వ పరిపాలన.
నా అనుభవంలోని కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేస్తాను.
పౌరసత్వం లేనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కు పొందవచ్చు. దీని వలన వలసదారులను సైతం రాజకీయపార్టీలు నిర్లక్ష్యం చేసే అవకాశం తక్కువ. పైగా పార్లమెంట్లో రాజకీయపార్టీల ప్రాతినిధ్యం వారికి వచ్చిన ఓట్ల నిష్పత్తితో నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు ఒక పార్టీకి 30 శాతం ఓట్లు వస్తే పార్లమెంట్లో వారికి దాదాపు 30 శాతం సభాస్థానాలను కేటాయిస్తారు. దీనివలన నా ఓటు వృధా అనే మాటే ఉండదు. ఎన్నికల తర్వాత పార్టీలు వాటి సిద్ధాంతాలను, ఎజెండాను మార్చుకోవు. అలా చేస్తే తరువాతి ఎన్నికలలో మనుగడ సాధించలేవు. ప్రభుత్వ పనులలో పాల్గొనేటప్పుడు ఉపయోగించడానికి శాసన సభ్యులకు ప్రభుత్వం క్రెడిట్ కార్డు ఇస్తుంది. దానిని దుర్వినియోగపరిచి (చిన్న మొత్తంలో ఐనా సరే) పదవులు పోగొట్టుకున్న ఉదాహరణలు ఉన్నాయి.
ప్రజలకు విశేషమైన మతస్వేచ్చ, వాక్స్వాతంత్య్రాన్ని ఇక్కడి రాజ్యాంగం కల్పిస్తుంది. తోటి వారి నమ్మకాలను అందరు గౌరవిస్తారు. అదే విధంగా మానవ హక్కులని ఉల్లంఘించే మతాచారాలను విమర్శించడానికి పత్రికలూ ప్రజలు వెనుకాడరు. సంపాదనపై పన్ను చాల ఎక్కువగా ఉంటుంది. పన్ను ఎగ్గొట్టడం నేరం, లంచగొండితనం శూన్యం. వీటిని సామాజికంగా కూడా తీవ్రంగా పరిగణిస్తారు. పన్ను రేటుకు తగినట్లు నిరుద్యోగ భృతి, విశ్రాంతోద్యోగులకు పింఛను, పిల్లల పెంపకం భృతి చాలా ఉదారంగా ఉంటుంది. ప్రజల మధ్య ఆర్థిక అసమానత చాలా తక్కువ. ఉద్యోగస్తులకు దాదాపు సమానంగా జీతం ఉంటుంది. అందుకే అందరు ఎవరి పనులు వారు సొంతగా చేసుకుంటారు. విద్య, వైద్యం నామ మాత్రపు ఖర్చుతో దాదాపుగా ఉచితం. పిల్లలని జాగ్రత్తగా పెంచకపోతే వారు ప్రభుత్వ సంరక్షణలో ఉంచబడతారు.
ప్రజలు తోటి వారితో ప్రాంత, భాష, ఆర్థిక, స్థాయి భేషజాలు లేకుండా మర్యాదగా ప్రవర్తిస్తారు. మూడువేలమందికి యజమాని అయిన మా ఎండీ మా ఆఫీసు ఆవరణ శుభ్రపరచడం నేను చూసాను. ఈ దేశ ప్రజలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ ఐదేళ్ళలో ఒక్కసారి కూడా నేను నా పొరుగింటివారితో మాట్లాడలేదు.
అయితే ప్రతి విధానంలో ఏదో ఒక లోపం ఉన్నట్లు ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం యుద్ధ సమయాలలో తప్ప మరే సమయంలోనూ నిషేధాజ్ఞలు విధించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. కరోనా వైరస్ ని నియంత్రించడానికి లాక్ డౌన్ విధించలేకపోవడానికి అదికూడా ఒక కారణం. అరవైఏళ్ల పైబడినవారిలో ఒంటరితనంతో బాధపడేవారి శాతం ఈ దేశాలలో ఎక్కువ. ఈ దేశాల ఏకాంత జీవనశైలి కూడా అందుకు కారణం అయుండొచ్చు. తమకిచ్చిన వాక్స్వాతంత్య్రంతో అతివాదులు చేసే దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఆపలేకపోతుంది.
మొత్తానికి ఇక్కడి పరిస్థితులు వివిధ అభివృద్ధి సూచికలలో చూపినట్లు మెరుగ్గానే ఉంటాయి.
Comments
Post a Comment