రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం ఇప్పటివరకూ రష్యా పక్షం వహించినట్టే కనిపిస్తోంది. కనీసం రష్యాకు వ్యతిరేకత అయితే చూపట్లేదు. మరి భారతీయులుగా మీ భావనలు ఎటువైపు ఉన్నాయి?
"అమెరికాకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం స్వప్రయోజనాలే ఉంటాయి. "
-హెన్రీ కిస్సింజర్
శాంతి స్థాపన కోసం ఏం చేసాడో తెలియకుండానే నోబెల్ శాంతి బహుమతి తీసుకున్న కిస్సింజర్ చెప్పిన ఈ అక్షర సత్యానికి మాత్రం ఎదో ఒక అవార్డు ఇచ్చేయొచ్చు. నిజానికి ఈ మాటలు కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతీ దేశానికి వర్తిస్తాయి.
నాటోను విస్తరించే క్రమంలో ఉక్రెయిన్ ను సభ్యదేశంగా చెయ్యాలని అమెరికా, దాని మిత్రదేశాలు చేసిన ప్రయత్నాలు ఉక్రెయిన్ ప్రజల జీవితాలను ఉద్దరించడానికి కాదన్న సంగతి వారికీ తెలుసు. అలాగే ఉక్రెయిన్ లోని రష్యన్ ప్రజలకోసం సైనిక చర్యకు పాల్పడుతున్నామని చెబుతున్న పుతిన్ మాటల్లో అది ఎత్నిక్ రష్యన్ ప్రజల మీద అభిమానమో లేక స్వప్రయోజనాలో అర్ధంకానంత రహస్యం కూడా ఏమి లేదు.
మొహమాటం లేకుండా మాట్లాడాలంటే ఈ పరిస్థితులలో మన దేశం తటస్థ వైఖరి తీసుకున్నా, లేక భవిష్యత్తులో ఎదో ఒక పక్షం వహించినా ఆ నిర్ణయానికి కారణం కూడా అంతర్జాతీయంగా మన దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే.
వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని అసలు ఏ పక్షం తీసుకోకూడదనే వారితో నేను ఏకీభవిస్తున్నాను.
Comments
Post a Comment