మీ జీవితంలో మీ మొదటి సంపాదన ఏమిటి?

 నేను చిన్నప్పుడు ప్రతి వేసవికాలం సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళుతుండేవాడిని. నా జీవితంలో మర్చిపోలేని ఎన్నో మధురానుభూతులు ఇచ్చిన ఊరది. నా మొదటి సంపాదన కూడా అక్కడే సంపాదించాను. కానీ ఎంత సంపాదించానో తెలీదు.

మా మేనమామ కి రొయ్యల చెరువుండేది. వేసవికాలం ప్రారంభం లో చెరువు పట్టుబడి జరిగేది. ముందుగా చెరువులోని నీటిని తోడేసి పెద్ద పెద్ద వలలతో, కొబ్బరి ఆకులు, మట్టలతో చేసిన దిమ్మలాంటి దానితో చాలావరకు రొయ్యలను పట్టుకునేవాళ్ళు. కానీ అక్కడక్కడ గుంటలలో, బురదలో కొన్ని రొయ్యలు మిగిలిపోయేవి. అటువంటి వాటి విలువ మొత్తం చెరువు ఉత్పత్తి లో చాల తక్కువ ఉండడం చేత, వాటిని సేకరించడానికి ఎక్కువ సమయం పట్టడం చేత వాటిని మా లాంటి పిల్లలకి వదిలేసేవారు. మా బావ, అన్నయ్యలు వెళ్లి తెచ్చుకుంటున్నారని నేను కూడా వాళ్ళతో వెళ్ళేవాడిని ఆ నీళ్లు, బురదలో ఆడుకోవడానికి. అలా దొరికిన వాటిని పక్క ఊరిలో ఉండే చిన్న వ్యాపారులు కొనేవారు. వాళ్ళు ఇలా చుట్టుపక్కల ఊళ్ళ నుండి సేకరించిన సరుకు ఏరోజుకారోజు ప్రాసెసింగ్ కంపెనీలకు అమ్మేవాళ్ళు. నాకు దొరికిన రొయ్యలని మా బావ గాని, అన్నయ్యగాని అమ్మి డబ్బులు తీసుకువచ్చి మా తాతగారికి ఇచ్చేవాళ్ళు. సెలవులు అయిపోయిన తర్వాత నన్ను తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చిన మా అమ్మకి ఆ డబ్బులు అప్పగించేటప్పుడు నా చాలా గర్వంగా అనిపించేది. వాటితోనే నా స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, బట్టలు కొనుక్కుంటా అని చెప్పేవాడిని. బహుశా నా డబ్బులు ఒక పుస్తకం కొనడానికి కూడా సరిపోవేమో. కానీ నేను చెప్పినవన్నీ నా డబ్బులతోనే కొన్నానని మా నాన్నగారు చెప్పేవారు.

నాకు గుర్తున్న నా మొదటి సంపాదన 250 రూపాయలు. ఒక వేసవి కాలం సెలవులకి మా అమ్మమ్మూరు వెళ్ళలేదు. నా స్నేహితుడొకడు మెడికల్ షాపులో వేసవికాలమంతా సహాయకుడిగా పనిచేస్తున్నాడు. వాడిని చూసి నేను కూడా చేస్తాను అని చెప్తే వాళ్ళ చిన్నాన్న గారిని గాని, కిరాణా కొట్టు నూకయ్యని గాని అడిగి చూస్తా అన్నాడు. నేను ఒక రెండు రోజులు కూడా వేచిఉండలేక నూకయ్యని కలిసి వేసవికాలంలో మీ షాపులో పని చేస్తా అని అడిగా. 250 ఇస్తానన్నాడు. ముందు వెనక ఆలోచించకుండా మొత్తం సెలవులు అన్ని రోజులా అని అడిగితే, అదే అలుసుగా తీస్కుని అవును అన్నాడు. ఒప్పేసుకుని రేపటినుండే వచ్చేస్తా అని చెప్పి ఇంటికెళ్లి చెప్పా. ముందు చెప్పకుండా అలా చేసినందుకు మా అమ్మ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.సాయంత్రం మా నాన్నకి చెప్పి రాడని చెప్పమని చెప్పింది. వాడికి కష్టం అంటే ఏమిటి, డబ్బు అంటే ఏమిటి అని తెలియాలి, వెళ్లనివ్వు , పైగా మాట ఇచొచ్చాడు అని నవ్వుకున్నారు. 50 రోజులు, ప్రతిరోజూ పొద్దున్న 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు. రోజుకు పది సార్లు నూకయ్య ఇంటికి, కొట్టుకి తిరగలేక చచ్చేవాడిని. ఆ అనుభవంతోనే నాకు కష్టం విలువ తెలిసొచ్చింది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?