మీ చిన్నతనంలో వేసవి సెలవులు ఎలా గడిపేవారు? ఏమేమి చేసేవారు?
నా చిన్నతనంలో నా వేసవి సెలవులను భీమవరం దగ్గర్లోని దారితిప్ప అనే కుగ్రామంలో గడిపేవాడిని. నాకు ఊహ తెలిసే వరకు ఆ ఊరిపేరు అమ్మమ్మూరు అనుకునేవాడిని. ఇప్పటికీ అలాగే పిలుస్తాను కూడా. ఎటుచూసినా వరిచేలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులతో చాలా ఆహ్లాదంగా అనిపించేది నాకు ఆ ఊరు. రోడ్డు సదుపాయం లేని రోజుల్లో భీమవరం నుండి నాగిడిపాలెం వరకు లాంచీలో ప్రయాణించి అక్కడి నుండి సైకిలు గాని నడిచి గాని వెళ్లాల్సొచ్చేది. విజయవాడలో బయలుదేరి దారితిప్ప చేరుకునేవరకు నాకు యుగాలు గడిచినట్లుండేది. రోడ్డు సదుపాయం ఏర్పడి ఇరవైఏళ్లయిఉంటుంది.
మా ఇంటిదగ్గర కంటే అక్కడ నాకు ఎక్కువ స్వేచ్ఛ ఉండేది. ఆ ఊళ్ళో అందరికి అందరు పరిచయస్తులే. నేనక్కడికి వెళ్ళేది సంవత్సరానికి ఒకసారైనా నాకు అక్కడ చాలామంది స్నేహితులుండేవారు. పోతురాజు, యేసు, లీల, రామకృష్ణ, రాము, వినోద్ అందరం కలసి పొద్దున్న మొదలు రాత్రి వరకు ఎదో ఒక ఆట ఆడుతూనే ఉండేవాళ్ళం.మేనత్త పెరట్లో ఉసిరిచెట్టుండేది. తినడానికి నేను ఉసిరికాయలు తీసుకువస్తే, ఇంకొకరు మామిడి ముక్కలు తెచ్చేవారు. ఇంకొకరు ఉప్పూకారం తెచ్చేవాళ్ళు. మధ్యమధ్యలో అమ్మమ్మ వచ్చి అన్నం తినమని బ్రతిమాలి తీస్కెళ్ళేది.
చేపలు పట్టడం రావడంలేదని ఏడుస్తుంటే గంగమ్మతల్లికి దణ్ణం పెట్టుకుంటే ఎక్కువ చేపలు పడతాయని రాము నాకు సలహా ఇచ్చి ఎత్తొల, గేలం వాడడం నేర్పించాడు. మేనమామ రొయ్యల చెరువు దగ్గర ఉండే పంటబోదెలో ఎత్తొలతో చేపలు పట్టి ఇంటిదగ్గర చిన్న చెరువు తవ్వి అందులో వేసేవాడిని (తెల్లారేసరికి సగం చనిపోయేవిలేండి). కాలవలో గేలమేసి జెల్లలు, గొరసలు, గడ్డి చేపలు పట్టేవాడిని. ఒకసారి మా మేనమామ చెరువులో ఎవరికీ తెలియకుండా అడ్డొల వేస్తే ఆరు పెద్ద చేపలు పడ్డాయి. తెలిస్తే కాళ్ళిరగ్గొడతారని భయమేసి యేసు, లీల, నేను కలసి ఇసుకలో పాతిపెట్టేశాం. నాకోసం చేసిన పూర్ణంబూరెలు, జంతికలు ఇంటెదురుగా ఉండే నల్లక్రిష్ణంరాజుగారి చెరువులో చేపలకి మేతగా విసిరేసేవాడిని.
మేనత్త వాళ్ళ గేదెకు తుమ్మకాయలు అంటే చాలా ఇష్టం. తోటకి వెళ్ళినప్పుడు ఒక గంప తుమ్మకాయలు ఏరుకుని తెచ్చేవాడిని. మా మేనమామ గేదెను కాలవలో కడగడానికి తీస్కెళ్ళేటపుడు కాలవవరకు గేదెసవారి చేసేవాడిని. పాలు పితకడం నేర్చుకోవడానికి ప్రయత్నించాను కానీ వెంట్రుకవాసిలో దాని తన్ను నుండి తప్పించుకోవడంతో మళ్ళి దాని జోలికెళ్ళలేదు. మా బావతో కలిసి గేదెని, దూడని చెరువు గట్టుమీదకి మేతకి తీస్కెళ్ళేవాడిని.
టైరు ఆటలు, నత్తగుల్లలాటలు, ముంజుకాయల బండి, బంక మట్టి బళ్ళు, కొబ్బరాకు పంకా, బూరలు, తుమ్మబద్ద విల్లు, జమ్ము బాణాలు, బొంగరాలు వెయ్యడం, సైకిలు తొక్కడం కూడా ఇక్కడే నేర్చుకున్నా.
నన్ను చాలాకాలం శాకాహారిగా ఉంచిన ఊరది. నా చిన్నవయసులో మా పెద్దమ్మ నాకు చేపలకూర తినిపిస్తుండగా గొంతులో ముల్లు ఇరుక్కుపోవడంతో భయమేసి పదేళ్లు పూర్తిగా మాంసాహారం మానేసాను. చివరికి కోడిగుడ్డులో కూడా ముళ్లుంటాయేమో అనుకునేంతలా భయపెట్టిందా సంఘటన. నాతో మాంసాహారం తినిపించడానికి మా తల్లిదండ్రులు చేయని పనంటూ లేదు. మళ్ళీ తిరిగి మొదలుపెట్టడానికి చాలా సమయమే పట్టింది.
మా అమ్మానాన్న వారి బాల్యస్మృతులు చెప్పేటప్పుడు ఆసక్తిగా వినేవాళ్ళం. నేను దారితిప్పలో గడిపిన కాలం తక్కువైనప్పటికీ అలా నా కూతురికి నేను చెప్పాల్సిన విషయాలలో సగానికి పైగా ఆ ఊరిలోనే జరిగాయి. ఈ సమాధానంతో అవన్నీ మరోసారి నా కళ్ళముందుకొచ్చాయి. ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు.
Comments
Post a Comment