జీవితంలో నిజంగా జాతక ప్రభావం ఉంటుందా? అసలు జాతకం మీద మీకున్న అభిప్రాయాలు ఏమిటి?

 జాతకంతో జీవితాల్ని మార్చుకున్న కుటుంబాన్ని నా కళ్లారా చూసాను. కాబట్టి మన జీవితంపై జాతక ప్రభావం ఎదుటి వారికి జాతకంమీద ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని అర్ధం అయ్యింది.

మా చుట్టాలలో ఒకాయన కొన్ని చిల్లర చేష్టలు చేసి చుట్టాలలో గౌరవం కోల్పోయారు. సొంత వాళ్ళు సరిపెట్టుకున్నా చుట్టాలు దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఇంట్లో పిల్లలు పెళ్లీడుకి వచేస్తుండడంతో ఆయనకి ఇమేజ్ మేకోవర్ అవసరం అయ్యింది. దానికి వాళ్లు జాతకం మీద ఉన్న నమ్మకాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. "మా ఆయనకి జాతకంలో ఉన్న దోషం వల్లే ఇలా జరుగుతున్నాయి. 2015 వరకు మాకు ఇటువంటి అపనిందలు తప్పవంట!" అని ఒక వంక ప్రచారంలోకి తెచ్చారు. ఇది ఎంత బాగా పని చేసిందంటే ఆయన ఏంచేసినా జతకమే కారణమని అందరూ నమ్మే అంత. 2015 అయిపోయింది ఆయన చిల్లర చేష్టలు వికృత చేష్టలుగా వృద్ధి చెంది వూళ్ళో ఒకసారి దేహశుద్ధి కూడా జరిగిపోయింది. చేసేదేంలేక ప్రాజెక్ట్ డెడ్లైన్ ముందుకు జరిపినట్లు ఇప్పుడు 2022 అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇది నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు.

ఇక పెళ్లి సంబంధాల విషయంలో జాతకాల ఉపయోగం అంత ఇంత కాదు. వచ్చిన సంబంధం నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో హుందాగా చెప్పలేక అలాగని ముందుకు వెళ్లలేకపోయే సందర్భంలో జాతకం మహగొప్పగా పనిచేస్తుంది. "పిల్లల జాతకాలు సరిపోలేదండి, ఆ సామర్లకోట సంబంధం వద్దని చెప్పేయండి" అని సంబంధం తీసుకొచ్చిన వాళ్ళకి కబురు పంపుతారు.

నా కూతురు పుట్టిన రోజున తనతోపాటు ఆ హాస్పిటల్లో ఆరుగురు పుట్టారు. యాభైవేల జనాభా ఉన్న చిన్న ఊరిలోనే రోజుకి ఆరుగురు పుడితే ప్రపంచంలో ఎంత పుడుతున్నారనే కొంటె ప్రశ్న వేస్కుని గూగుల్ చేస్తే సెకనుకు సరాసరిన ఐదుగురు పుడుతున్నారని రికార్డులు చెబుతున్నాయి. మరి ఈ ఐదుగురి జీవితాలు ఒకేలా ఉంటున్నాయా అని అడిగితే సమాధానం అవునని చెప్పాలా, కాదని చెప్పాలా?

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?