ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?

 ఇప్పటికే మిగిలిన సమాధానాలు చాలా కూలంకషంగా ఎడమచేతివాటంవారు ఎదుర్కునే సమస్యలను వివరించారు. నాది కూడా అదే క(వ్య)ధ.

కత్తెర్లు, పెన్సిల్ మరలు, వాచీలు వంటివి రోజువారీ వాడకంవల్లో, లేక ఎడమచేతిని వంకరగా తిప్పి వాడడం అలవాటు చేసేస్కోవడంవల్లో వాటి ఇబ్బందిని పెద్దగా గమనించలేదు. ఎక్కువగా ఇబ్బంది పెట్టినవి, బాధ పెట్టినవి మాత్రం ఎడమచెయ్యంటే సమాజంలో ఉన్న చిన్న చూపు.

పూజా కార్యక్రమాల్లో వస్తువులు ఎడమచేత్తో అందించినా, దీపం కోసం ఎడమచేత్తో అగ్గిపుల్ల వెలిగించినా ఇంట్లో తిట్లు పడిపోయేవి. చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు టేబుల్ మీద పెట్టిన స్వీటూ హాటు ప్లేటు చేత్తో తీసుకోగానే చెంచా కుడిచేత్తో పట్టుకోమని కంటి చూపుతో ఆర్డర్లు పడిపోయేవి.

నేను ఏడవ తరగతి పరీక్షలకి వెళ్తున్నప్పుడు వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టి వెళ్ళమని ఇంటి నుండి రామాజ్ఞ. సమయం లేక గుడి మెట్ల దగ్గరే దణ్ణం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టడానికి చెయ్యత్తబోతే చెయ్యి దింపేలోపే నా డిప్ప మీద వేరొక చెయ్యి బలంగా పడింది. ఏం జరిగిందో తెలిసేలోపే నా పక్కన ఉన్న స్నేహితుల క్లోసప్ యాడ్లు మొదలైపోయాయి. వెనక్కి తిరిగిచూస్తే పంతులుగారు "కుడి చేత్తో కొట్టి చావు" అని గద్దించారు. ఉడుకుమోత్తనంతో "నేనేమన్నా అడిగానా ఎడమచేతివాటం ఇమ్మని" అని అడిగినందుకు మరో రెండు అక్షింతలతో దీవించేసారు.

నా స్నేహితురాలి పెళ్ళికి మా ఇంట్లో పెళ్లిలాగా చక్కబెట్టేద్దామని బంతి భోజనాలదగ్గర సాంబారు బకెట్తో హడావిడి చేస్తుంటే మా మాస్టారు ఈ కింది విధంగా నా మీద అభిమానం చూపించేసారు.

కిక్ సినిమాలో బ్రహ్మానందం వెనక వయోలిన్ వాయించేవాళ్ళలాగా నాక్కూడా స్నేహితుల బ్యాచ్ ఒకటి తగులుకుంది. మా మాస్టారు తిట్టిన దానికంటే వీళ్ళు నవ్వినప్పుడే చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ వడ్డన జోలికి వెళ్ళలేదు.


Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?