మీరు చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏది?

 అమ్మోరు.

రమారమి ఒక యాభై సార్లు చూసుంటా. బడి ఉన్న రోజుల్లో రోజుకి ఒకటి రెండు సార్లు. బడి లేని రోజుల్లో రెండు మూడు సార్లు.

ఇరవై ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక సినిమా థియేటర్నీ అద్దెకు తీస్కుని నడిపేవారు. కానీ ఇప్పటి థియేటర్లలా దానిలో కొత్త సినిమాలు ఆడేవి కాదు. అప్పటికే విడుదలయ్యి విజయం సాధించిన సినిమాలు, లేకపోతే బాగా తక్కువ రేటుకు వచ్చే పాత సినిమాలు ఆడేవి. అప్పట్లో వచ్చిన అమ్మోరు సినిమా విడుదలయిన ప్రతిచోటా రికార్డులు తిరగరాస్తుండడంతో మా నాన్నగారు కొంచెం ఎక్కువ రేటు పెట్టే తీసుకొచ్చారు.

ఆ సినిమా వచ్చిన రోజు మా థియేటర్కి అప్పటివరకు నేనెప్పుడూ చూడనంత జనం వచ్చారు. ఎప్పుడూ నాకు నచ్చిన సీట్లో కూర్చునే నేను ఆ రోజు ప్రొజెక్షన్ రూంలో నుండి బల్ల వేసుకుని నిలబడి చూడాల్సొచ్చింది. అంత సేపు నిలబడలేక కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. తర్వాతి రోజు నుండి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ, అసలెక్కడా ఖాళీ లేకపోతే ఎంట్రన్స్ దగ్గర మెట్ల మీద కూర్చుని కూడా చూసేవాడిని. కొన్ని సన్నివేశాల దగ్గర సినిమా చూస్తున్న ప్రేక్షకులలో ఉన్నట్టుండి ఎవరోఒకరికి పూనకం వచ్చేసేది. అలాంటివాళ్ల కోసం షో మొదలవ్వడానికి ముందే మా అమ్మ రెండు బిందెల్లో పసుపు నీళ్లు కలిపివుంచేది. టికెట్ కౌంటర్లో టిక్కెట్టుతో పాటు ఒక ప్లాస్టిక్ కుంకుమ భరిణె కూడా ఇచ్చేవాళ్ళు. ఆ సినిమా మా థియేటర్లో తీసేసిన తర్వాత మిగిలిపోయిన డబ్బాలతో నేనూ మా తమ్ముడు భరిణ మేడలు కట్టేవాళ్ళం.

మా థియేటర్లో నాకు తెలిసి ఎక్కువ రోజులు ఆడిన సినిమా అదే. అది ఎంత వసూలు చేసిందో తెలీదుగాని మా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టింది.(కిందకి లాగేసిన సినిమాలు కూడా ఉన్నాయిలెండి). అటువంటి సినిమాని ఇచ్చిన దర్శకులు కోడి రామకృష్ణగారికి ప్రేక్షకుడిగా, ఒక సినిమా థియేటర్ మీద ఆధారపడిన వ్యక్తిగా నా కృతజ్ఞతలు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?