మీకన్నా బాగా పెద్ద వయసువారితో మీకు స్నేహం ఉందా? వారి నుంచి మీరేం నేర్చుకున్నారు? వారితో మీ అనుబంధం ఏమిటి?

 మా తాతగారితో నాకు లేని చనువు ఆయన స్నేహితులు గోవిందరావుగారు, కృష్ణంరాజుగార్ల దగ్గర ఉండేది. ముఖ్యంగా గోవిందరావుగారు మా తాతగారి ఊళ్లోని టీనేజ్ పిల్లలందరికీ స్నేహితులే.

అప్పట్లో ఊరి మొత్తానికి కేవలం రెండు చోట్లకి మాత్రమే వార్తాపత్రిక వచ్చేది. ఒకటి రామాలయం దగ్గర, మరొకటి గోవిందరావుగారింటికి. కానీ రామాలయం దగ్గర రాజకీయచర్చలు చెయ్యడానికి గోవిందరావుగారు కూడా అక్కడే పేపర్ చదివేవారు. నేను సెలవులకి వెళ్ళినప్పుడు నన్నొక్కడినే వదిలేసి మా అన్నయ్య, బావ, మా తమ్ముడు షికార్లకి వెళ్లిపోయేవాళ్లు. పొద్దునే ఏం తోచక మా తాతగారితో నేను కూడా పేపర్ చదవడానికి వెళ్ళేవాడిని. ఆవిధంగా వాళ్లిద్దరూ నాకు పరిచయమయ్యారు. కథల పుస్తకాలు చదవమని నన్ను ప్రోత్సహించిన గోవిందరావుగారు ఆ సంవత్సరమంతా వాళ్ళింటికి వచ్చే చందమామ, బాల రామాయణం పుస్తకాలన్నీ జాగ్రత్తపరిచి ఆ నెలరోజులూ నాకప్పగించేవారు. పార్టీలపరంగా ఆ ముగ్గురు స్నేహితులకి అభిప్రాయబేధాలున్నా, అప్పుడప్పుడూ ఒకరిమీద ఒకరు కోప్పడినా ఆ చిరాకు నా మీద ఎప్పుడూ చూపించేవాళ్ళు కాదు.

మాంచి నాటుభాషలో కృష్ణంరాజుగారు చెప్పే కబుర్లే నాకు ప్రపంచాన్ని పరిచయం చేసాయి. వాళ్ళ చిన్నతనంలో చేసిన పనులన్నీ చెబుతుంటే ఆ మండపం గచ్చుమీదే పడి దొర్లి నవ్వుకునేవాడిని. నేను పెద్దవాణ్ణి అయ్యేకొద్దీ వాళ్ళు నాతో మాట్లాడే మాటల్లో పెద్దరికం తగ్గిపోయి కొంటెతనం వచ్చింది. ఒకానొక సందర్భంలో గోవిందరావుగారు తన పెళ్ళికాకముందు ఆయన చేసిన ఘనకార్యాలన్నీ ఏకరువు పెట్టేసారు. మా తాతగారు వద్దని వారిస్తుంటే "నేను నా మనవళ్ల దగ్గర చెప్పలేను, కనీసం నీ మనవడి దగ్గరైన మాట్లాడనివ్వు" అనేవారు.

పేపర్ చదివి పక్కనపెట్టేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకోని అంశాలు ఉండేవి కాదు. కులాలు, మతాలు, రాజకీయాలు, చరిత్రలు, ప్రేమలు, కుట్రలు, రచ్చబండ కబుర్లు లాంటివన్నీ వారి మాటల చిట్టాలో ఉండేవి. ఆ ముగ్గురి నుండి ప్రత్యేకంగా ఇది నేర్చుకున్నాను అని చెప్పలేను. కానీ నన్ను ప్రభావితం చేసినవారిలో వీరు కచ్చితంగా ఉంటారు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?