మాంసాహారులతో శాకాహారులుగా జీవించడం అంటే ఎలా ఉంటుంది? ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? దాని విషయంలో శాంతి నెలకొల్పడానికి మీరు ఏమి చేస్తారు? ఇది మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఐదేళ్ల వయసులో భయంతో శాకాహారిగా మారిన నేను తిరిగి మాంసాహారం అలవాటు చేసుకోవడానికి పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో నేనూ, నావల్ల నా కుటుంబం పడిన బాధలు అన్నీఇన్నీ కావు.
చిన్నప్పుడు నా పెద్దమ్మ నాకు చేపలకురతో గోరుముద్దలు తినిపిస్తుంటే నా గొంతులో చేపముల్లు ఇరుక్కుని నరకయాతన పడ్డాను. ఇంట్లోవాళ్ల ఉరుకులుపరుగులు, తిట్లు, సోకండాళ్ల మధ్య వంటింటి చిట్కాలన్నీ ప్రయోగించేసి చివరికి డాక్టరుగారిని తీసుకొచ్చి నాకు ముల్లువిముక్తి కలిగించి అప్పటికి హమ్మయ్య అనుకున్నారు కానీ అసలు సమస్య ఆ తర్వాత మొదలయ్యింది. ఆరోజు నుండి నాకు మాంసాహారం అంటే భయం మొదలయ్యింది. చేప, కోడి, చివరికి కోడిగుడ్డులో కూడా ముళ్ళుంటాయేమో అనుకుడేవాడిని.
మా ఇంట్లో మిగిలిన ముగ్గురికి మాంసాహారం అంటే మహాఇష్టం. ఇంట్లో మాంసాహారం వండిన ప్రతిసారీ నా కోసం ఇంకొక కూర వండాల్సివచ్చేది. ఒకట్రెండు సార్లంటే పర్లేదుగాని ప్రతిసారి ఇలాగే అంటే కుదరదని మాంసాహారం తినమని నన్ను బుజ్జగించేవాళ్ళు, ఒక్కోసారి చిరాకు పడేవాళ్ళు కూడా. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వండడానికి ముందు తింటానని చెప్పి భోజనానికి కూర్చున్న తర్వాత పచ్చడి ఇమ్మని అడిగేవాడిని. ఆ తర్వాత ఈ పాచిక పరట్లేదనిపించి ముక్కల్లేకుండా ఒక్క గరిటె కూరతో మొత్తం అన్నం తినేసేవాడిని. బడికి క్యారేజీ తీసుకెళ్తే కూర నా స్నేహితులకిచ్చేసి వాళ్ల కూర తీసుకునేవాడిని. లేకపోతే పెరుగన్నంతో సరిపెట్టేసుకునేవాడిని. అలాఅని కూరగాయలన్నీ తినేవాడినికాదు, వంకాయ, పొట్లకాయ, దొండకాయ, క్యాబేజి అంటే అస్సలిష్టం ఉండేదికాదు. అందుకే మా నాన్నగారు "వీడూ, వీడి కోడి తిండి!" అని తిట్టేవారు. చివరికి పప్పు, బెండకాయ తప్ప మిగిలినవేమైనా దాదాపుగా పొడి ముద్దలు మింగినట్లే తినేవాడిని. ఇలా మాంసాహారుల ఇంట్లో పులితోలు కప్పుకున్న మేకలాగా తిరిగేవాడిని. మళ్ళీ పదేళ్లకు కొంచెంకొంచెం అలవాటు చేస్కుని ఇప్పుడు అన్నీ తింటున్నా.
కానీ నా ఆహారపు అలవాట్లు కొంతవరకు నాకు చెడ్డ చేసిందని నేను అనుకుంటున్నాను. నేను శాకాహార ప్రత్యామ్యాయాలు ఎక్కువగా తీసుకోకపోవడంవల్ల మా తల్లిదండ్రుల తోబుట్టువుల పిల్లలందరిలో నేనే ఐదున్నర అడుగుల దగ్గర ఆగిపోయాను. మిగిలిన వాళ్ళందరూ ఆజానుబాహులే. కాబట్టి మాంసాహారులతో శాకాహారులుగా జీవించడం కొంచెం కష్టమే.
Comments
Post a Comment