ఇలాంటివి నాకు మాత్రమే ఎందుకు జరుగుతాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ?
- అదేంటో!!! భోజనాల్లో కూర్చున్నప్పుడు సరిగ్గా నాదగ్గరికి వచ్చినప్పుడే డేగిశాలో అన్నం అయిపోతుంది. అరటిపండు పెరుగన్నంలోకీ, పూర్ణంబూరె భోజనం తర్వాత మా తమ్ముణ్ణి ఊరిస్తూ తినాలి కాబట్టి చేసేదేంలేక అన్నం వచ్చేదాకా ఉప్పు రుచిచూస్తూ ఉండడమే.
- ఒక రెండు మూడు యుగాల తర్వాత అన్నం తెచ్చి వడ్డించాక, వెనక బకెట్ నిండా సాంబారుతో చిన్నాన్న వస్తుంటే "పోన్లే! సాంబారు కోసం ఎదురుచూపులక్కర్లేదు" మురిసిపోయేలోపు ముందు వరసలో ఒక పెద్దమనిషి మొదటి రౌండు పూర్తి చేసి "బాబు సాంబార్ ఇలా పట్రామ్మా" అని పిలుస్తాడు. మళ్ళీ సాంబార్ వచ్చేవరకు అన్నంతో డ్యాములు కడుతుంటాను.
- ఇక కిరాణా కొట్లో ఉన్నట్లుండి పక్క వరుస చాల వేగంగా వెళ్ళిపోతుంది.
- ఆఫీసుకి వెళ్ళేటపుడు సరిగ్గా నేను రోడ్డు దాటేటప్పుడే ఎర్రలైట్ పడుతుంది.
- ఒకపక్క ఆఫీసుకి టైం ఐపోతుంటే మా అమ్మాయికి పాపిడి కుడివైపుకు దువ్వాలో ఎడమవైపుకు దువ్వాలో గుర్తొచ్చి చావదు.
- సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి తయారవుతూ నా లాప్టాప్ షట్ డౌన్ చేసిన తర్వాత టైంషీట్ రాయాలన్న సంగతి గుర్తొస్తుంది.
ఇటువంటి అనుభవాలు నాకేకాదు తరచుగా చాలామందికి కలుగుతూ ఉంటాయి. కొంతమంది కొన్నివిషయాల్లో తమకెప్పుడూ ప్రతికూలంగా జరుగుతుంది అనుకుంటే, మరికొంతమంది తమది లక్కీ హ్యాండ్ అని భావిస్తుంటారు. దీనినే ఇల్యూసరీ కోరిలేషన్ అంటారు. ఇది మనిషి మెదడులో సహజంగా జరిగే ప్రక్రియ. మొదట్లో ఒకట్రెండు సందర్భాల్లో వచ్చిన ఫలితాలను గమనించి ఆ ఫలితాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవడం అన్నమాట. అంటే ఒకసారి నిర్ణయించుకున్నాక ఆ పనుల్లో వేరే ఫలితం వచ్చినా మన మెదడు ఆ సందర్భాలను గుర్తుపెట్టుకోదు.
Comments
Post a Comment