పరీక్షల్లో మీకు ఎదురైన విచిత్రమైన అనుభవం ఏమిటి?

 పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న రోజులవి. పరీక్షలు జరుగుతున్నన్ని రోజులు అబ్బాయిలందరూ ట్యూషన్ దగ్గరే చదువుకుని నిద్రపోవడానికి మా నాగు మాస్టారు సదుపాయం ఏర్పాటు చేసారు. ఆ రోజు తెలుగు పరీక్ష బాగా రాసి తర్వాత రోజు జరిగే హిందీ పరీక్షకి ఆ సాయంత్రం చదువుకుంటున్నాము. అప్పుడే మేడ కిందనుండి ఎవరో పిలిచినట్లనిపిస్తే కిందకి చూస్తే మా బడిలోనే ఏ -సెక్షన్ లో చదివే కళ్యాణి (పేరు మార్చాను) నాతో మాట్లాడాలని పిలిచింది. కొంచెం భయపడుతూనే కిందికి వెళ్లి ఏంటని అడిగాను.

ఎవరో కొట్టినట్లు భోరున ఏడుస్తూ "మన పరీక్షగదిలో నువ్వు తప్ప నాకెవరు తెలీదు, నాకు నువ్వు తప్ప సాయంచేసేవాళ్ళెవరూ కనిపించట్లేదు" అంటూ వోణీ చెంగుతో కళ్ళు ఒత్తుకుని మరీ ఏడుస్తుంది.

ముందు ఆ ఏడుపాపి విషయం ఏంటో చెప్పమంటే "నాకు హిందీ ఒక్క ముక్క కూడా రాదు, రేపు పరీక్షలో ఖచ్చితంగా ఫెయిలయిపోతా, దయచేసి రేపొక్కరోజు కొంచెం చూపించి పుణ్యం కట్టుకో", అని అడిగింది.

"నీకు నాకు మధ్యలో రెండు బెంచీలున్నాయి, సాయంచేస్తే నేను కూడా దొరికిపోతా. రెండు,మూడు ముఖ్యమైన ప్రశ్నలు చదువుకో, అవి రేపు పరీక్షలో రాకపోతే అప్పుడు ఏదోఒకటి చేద్దాంలే" అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించా.

ఆ అమ్మాయికి నా మాట మీద నమ్మకం కుదర్లేదని అర్ధం అయింది. వెంటనే మళ్ళీ ఏడుపు లంఘిచుకునీ అమ్మా అని పెద్ద దీర్ఘంతో గోడ వెనుక నుంచున్న వాళ్ళమ్మగారిని పిలిచింది. తర్వాత ఆవిడ వంతు ఏడవడంలో. "నా కూతురు పది పాసైతే తప్ప వాళ్ళ బావ పెళ్లి చేసుకోనంటున్నాడమ్మా. నీకు దణ్ణం పెడతా, ఈ ఒక్కపరీక్ష గట్టెక్కించు. కావాలంటే మీ అమ్మగారితో నేను మాట్లాడతా" అని చెంగు సన్నివేశం పునరావృతం చేసింది. ఎక్కడివరకు ఎందుకులెండి, నేను సాయంచేస్తా అని అయిష్టంగానే ఒప్పుకున్నా.

పరీక్ష మొదలయింది. మొదటి గంట చాలా ఉత్సాహంగా రాసాను. తర్వాత నా వెనుక కూర్చున్న మరో పాఠశాల విద్యార్థి నా వీపుమీద పెన్నుతో పొడిచాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి పిలుస్తుందని కళ్యాణి వైపు చూపించాడు. అసలేం తెలియట్లేదని, ఏమి రాయలేదని ఖాళీ పేపర్ చూపించి ఏడుస్తూ చేతులు జోడించేసింది. తప్పక నేను రాసిన ఒక పేపర్ నా వెనక ఉన్నవాడికిచ్చి పాస్ చెయ్యమన్నాను. ఆ పేపర్ ఎక్కించేసి, ఇంకో రెండు పేపర్లు ఇమ్మంది. ఇబ్బంది లేదనిపించి ఇచ్చేసాను. కాసేపటికి "ఆకస్మిక తనిఖీవారు వచ్చారు, జాగ్రత్త" అని బంట్రోతు గబుక్కున చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు చెమటలు పట్టేసాయి. పేపరిచ్చెయ్యమని సైగ చేస్తే కళ్యాణి నావైపుకు విసిరేసింది. ఒక పేపర్ నా వెనక బెంచి కింద, ఇంకొకటి నా కాళ్ళ దగ్గర స్థిరపడ్డాయి. నా దగ్గర పేపర్ తీసుకున్నా కానీ ఇంకో పేపర్ అందలేదు. ఇంక నా పనైపోయిందనుకుని బెంచీమీద తలపెట్టి ఏడవడం మొదలు పెట్టాను. అప్పుడే నా జబ్బ మీద ఎవరో గట్టిగా చరిచారు. తలెత్తి చూస్తే మా గది పర్యవేక్షణాధికారి నా బెంచి మీద ఉన్న నా రెండో పేపర్ ని చూపించి లోపలపెట్టు అని కోపంగా గదిమారు. నేను పేపర్ లోపల పెట్టుకున్న రెండు క్షణాల్లో ఆకస్మిక తనిఖీవారు మా గదికి వచ్చారు. వారిలో ఒకాయన నా ఏడుపు మొహం చూసి ఎందుకేడుస్తున్నావ్ అని అడిగితే, ఏం లేదని చెప్పాను. కాసేపటితర్వాత వారు వెళ్లిపోయారు. ఆ అయిదు నిముషాలు నాకు ప్రాణం పోయినంత పనయ్యింది. ఆ తర్వాత పెన్ను కదలలేదు. అసలేం రాయలేకపోయాను. పరీక్ష అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎం జరిగిందని నా వెనుక కూర్చున్న అబ్బాయిని అడిగితే, ఆ పేపర్ తీసి నాకిమ్మని పర్యవేక్షణాధికారి ఆ అబ్బాయికి చెప్పారంట.

పరీక్ష తర్వాతగానీ, ఫలితాలు వచ్చిన తర్వాతగానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడను కూడా మాట్లాడలేదు. తాను పరీక్షల్లో పాసయిందని మా మాస్టారు చెప్తే తెలిసింది. అయిదేళ్ల తర్వాత బస్టాప్ లో ఇద్దరు పిల్లలతో ఒకావిడ "బాగున్నావా, నన్ను గుర్తుపట్టావా" అని పలకరించింది. గుర్తుపట్టకపోయుంటే ఎవరు? ఏంటని అడిగేవాడినేమో!! గుర్తుపట్టి వెంటనే తల పక్కకి తిప్పాను.


Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?