పర్యావరణ సంరక్షణకు ఒక సగటు మానవుడుగా మీరు ఏమి చేస్తున్నారు?
ప్రత్యేకించి పర్యావరణ పరిరక్షణ కోసం చేయకపోయినా నేను రోజువారీగా చేసే పనులు పర్యావరణహితమైనవని అనుకుంటున్నాను.
నాకు కారు లేకపోవడం చేత నేను ఆఫీసుకి వెళ్ళడానికి, కూరగాయలు తీసుకురావడానికి, మా అమ్మాయిని బడిలో దింపి తీసుకురావడానికి సైకిలు మీదే వెళ్తాను. చలికాలంలో నడిచి వెళ్తాను. ఒక దశలో ఆఫీసుకి 7 కిలోమీటర్ల దూరంలో ఉండేటప్పుడు కూడా ఎండాకాలంలో సైకిలు వేసుకెళ్ళేవాడిని, చలికాలంలో 4 నెలలు బస్సు ప్రయాణం చేశాను. దూరప్రయాణాలు చేసేటప్పుడు ప్రజారవాణా ఉపయోగిస్తాను.
గత ఆరు సంవత్సరాలలో నాకోసం నేను కేవలం మూడు జతల బట్టలు మాత్రమే కొన్నాను. అంతకు ముందు నా పెళ్ళికి కుట్టించుకున్న బట్టలు ఇప్పటికీ ఆఫీసుకి వేసుకెళతా. నా ఇంటి కరెంటు బిల్లు నేనుంటున్న దేశ జాతీయ సగటు కంటే చాలా తక్కువ వస్తుంది. మా ఇంట్లో సగం వరకు ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్ లో కొన్నాము. మేముంటున్న ప్రదేశంలోని భారతీయులు తమ పిల్లల బొమ్మలు, బట్టలు తమ స్నేహితుల చిన్నపిల్లలకి ఇస్తుంటారు. అలా ఉపయోగపడే వస్తువులు నా స్నేహితులు ఇచ్చినపుడు మొహమాటపడకుండా తీసుకున్న. మేము కూడా మా అమ్మాయికి అవసరంలేని వాటిని ఇచ్చేస్తూఉంటాం.
ఇలా నా దినచర్య కొంత వరకు పర్యావరణానికి ఉపయోగపడేలా ఉన్నాయి. కానీ ఇవేమీ పర్యావరణం ప్రధానోద్దేశ్యంతో చేసినవి కాదు.
Comments
Post a Comment