రైల్లో ఆర్‌ఏసీ టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు ఇద్దరికీ ఒకే సీటు ఇచ్చి సర్దుకొమ్మంటారు కదా. అలాంటప్పుడు న్యాయంగా ఇద్దరికీ సగం టికెట్ డబ్బు వాపస్ ఇవ్వాలిగా? ఎందుకివ్వరు?
న్యాయంగా అయితే సగం టికెట్ ధర తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోవడానికి సరైన కారణం నాక్కూడా తెలీదు, కాకపోతే ఈ క్రింది కారణాల వలన అయ్యుండొచ్చు అనుకుంటున్నాను.
ఆర్‌ఏసీ టికెట్ ఉన్నవారికి ప్రయాణం ప్రయాణం మధ్యలో బెర్తు కేటాయించడానికి అవకాశం ఎక్కువ. ఉదాహరణకి నేను రాజమండ్రి నుండి చెన్నై వెళ్ళడానికి కొన్నిసార్లు ఆర్‌ఏసీ టిక్కెట్టుతో ప్రయాణించాను. కొన్నిసార్లు విజయవాడలో, మరికొన్నిసార్లు ఒంగోలులో, చివరికి నెల్లూరులో కూడా బెర్తు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా స్టేషన్ స్టేషన్ కి వాపసు చెయ్యాల్సిన డబ్బు లెక్కించే సదుపాయాన్ని ఏర్పాటు చెయ్యడం రైల్వేకి సాధ్యం కాకపోవచ్చు లేదా అసలే నష్టాల్లో ఉండే ప్రజా రవాణాకి ఇది అదనపు ఖర్చు అని భావించొచ్చు.
ప్రభుత్వ ప్రజారవాణా ముఖ్యోద్దేశం లాభార్జన కాకూడదు, టికెట్ ధరను నిర్ణయించడానికి సంస్థ కార్యాచరణ ఖర్చులమీద కాక, నష్టమొచ్చినా సరే ప్రజల ఖర్చు సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. రైల్వే ప్రజారవాణాని నష్టాలనుండి బయటపడెయ్యడానికి టికెట్ ధరని విపరీతంగా పెంచలేరు. పెంచితే వ్యతిరేకత వస్తుంది. ఆర్‌ఏసీ టికెట్ విషయంలో డబ్బు వాపసు ఇవ్వకపోయినా వ్యతిరేకత ఏం ఉండదు కాబట్టి వాపసు చేసే అవకాశం ఉన్నప్పటికీ రైల్వేవారు దాన్ని కావాలనే పట్టించుకోవట్లేదేమో.
నిజానికి విమానయాన రంగంలో కూడా ఇటువంటి పద్దతి ఉంది, దానిని ఓవరుబుకింగ్ అంటారు. నా ఉద్దేశ్యంలో ఓవరుబుకింగ్ కంటే ఆర్‌ఏసీ కొంచెం నయమే. విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత చివరి నిమిషంలో "క్షమించండి" అని వినడం కంటే, పడుకుని వెళ్లలేని చోట కనీసం కూర్చుని వెళ్లే అవకాశం ఉంటే మహాప్రసాదమని ఒప్పుకుంటా.
Comments
Post a Comment