ఆన్లైన్లో మీకు జరిగిన లేదా మీరు చూసిన ఫ్రాడ్స్/మోసాలు గురించి తెలపగలరు?
2014 సంవత్సరం. సంక్రాంతికి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకుని సెలవు పెట్టి, ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాను. రిలయన్స్ ట్రెండ్స్లో పండుగ బట్టలు కొనుక్కుని, చెప్పులు ధర నచ్చక ఆన్లైన్లో కొందామని రూంకి వచ్చేసాను. అమెజాన్లో పండగ సేల్ మొదలయిందని చూసి చెప్పుల జాతకోసం వెదికాను. నీలం రంగులో ఒక మంచి జత దొరికింది. రేటు 2500 రూపాయలు, కానీ 50 శాతం తగ్గింపు ధరతో 1250 కే ఇచ్చేస్తున్నాడు. చెప్పులు నచ్చాయి, ధర నచ్చకపోయినా తగ్గింపు ధర నచ్చేసింది. కొనేసి పండగ వరకు ఆగలేక ముందే వాడడం మొదలుపెట్టి ఇంటికి వాటితోనే వెళ్లాను. గుమ్మం ముందు చెప్పులు విడుస్తుంటే అచ్చం అవే చెప్పులు, అదే కంపెనీ ఇంకో జత అక్కడ కనిపించింది. కాళ్ళు కడిగి లోపలికి వెళ్లి చెప్పులు ఎవరివి అని అడిగితే నావేనన్నాడు మా తమ్ముడు. వాడు కూడా పండక్కి అవే చెప్పులు రాజమండ్రిలో కొనడం యాదృచ్చికంగా జరిగింది. ఎంతరా అని అడిగితే ఎనిమిది వందలన్నాడు. దెబ్బకి నా మొహం నీలంగా మారింది. తగ్గింపు ధరా? అని అడిగితే, లేదు మాములు రేటే అన్నాడు. నేను కూడా అవే చెప్పులు కొన్నాను అని చెప్పా. రేటెంత అని అడిగితే నాది కూడా అంతే అని చెప్పాల్సొచ్చింది.
Comments
Post a Comment