శివుని విగ్రహం దొరకగా రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా 28000 పూర్వం విగ్రహమనీ నిర్ధారించారు. దీని ప్రకారం మన నాగరికత 6000 ఏళ్ళు కాదు 28000 ఏళ్లు అని చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
మీరు అడుగుతుంది ఈ విగ్రహం గురించే అనుకుంటున్నాను.
సుమారు మూడేళ్ళ నుండి అనేక సామజిక మాధ్యమాలలో కనిపించినప్పటికీ ప్రభుత్వం నుండి గానీ, పురాతత్వ శాస్త్రవేత్తల నుండి గానీ ఎటువంటి ప్రకటన రాలేదు. పైగా ఈ వార్త మొదలైన సందర్భంలో చూపించిన ఆధారాలు పూర్తిగా అవాస్తవమైనవని తెలుస్తుంది. మనదేశపు ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ గారి ట్విట్టర్ ఖాతా నుండి వచ్చిన ట్వీట్ గా చెప్పబడుతున్న ఈ ఆధారం నకిలీదని తేలింది. ఆయన ఖాతా నుండి ఈ విగ్రహానికి సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కేవలం జనాలను మభ్యపెట్టే ప్రచారాల్లో భాగంగా వచ్చిన అబద్దాలతో ఇదొకటి.
మరి ఈ నిరాధార ప్రచారాలు ఎవరు చేస్తున్నారు?
ఎవరికైతే మన చరిత్ర మీద కనీస అవగాహన లేదో,[1]ఎవరైతే అబద్దాల పునాదులపై ఊహాలోకపు చరిత్రలు రాయాలనుకుంటున్నారో, ఎవరైతే మన అసలు చరిత్రను భూస్థాపితం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆత్మనూన్యతాభావంతో బాధపడుతున్నారో, ఎవరైతే జనాల అమాయకత్వాన్ని వాడుకుని లబ్ది పొందుదామనుకుంటున్నారో వారే ఇటువంటివాటిని ప్రచారంలోకి తెస్తున్నారు.
వీటి వల్ల నష్టమేమిటి?
ఇప్పటికే సింధు నాగరికతలోని నాలుగు-ఐదు వేల యేళ్ళనాటి అనేక కళాఖండాలు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డాయి.[2] దండయాత్రలను తట్టుకుని నిలబడ్డ అద్భుత కట్టడాలు ఇంకా ఉన్నాయి. వీటితోపాటూ ఆశ్చర్యపరిచే శిల్పకళానైపుణ్యం, లోహవిగ్రహ నైపుణ్యం మన పూర్వీకుల సొంతం.[3]వాటన్నింటినీ వదిలేసి ఇలా అబద్దాల వెంటపడి నిజమైన చరిత్రను చులకనగా చూసే అవకాశం ఉంది. అంతేకాక ఇదే కొనసాగితే ఏదో ఒకదశలో మన పోకడను చూసి ప్రపంచం నవ్వుకునే అవకాశం లేకపోలేదు. మీకు అనుమానంగా ఉంటే "oldest idol in indian history" అని గూగుల్ చేసి చూడండి. మొదటి పేజీలో మొత్తం ఈ అబద్దపు విగ్రహం గురించే.
Comments
Post a Comment