మీరు మీ ఇల్లు ఎలా కట్టారు? ఆ క్రమంలో మీరు సవ్యంగా చేసినవీ, చేసిన పొరబాట్లు ఏమిటి?

 నేను ఇల్లు కట్టించలేదుకానీ ఒక అపార్టుమెంట్ కొన్నాను. కాబట్టి ఈ సమాధానం రాయడానికి సరిపోతానననుకుంటున్నాను.

నాకు ఊహతెలిసినప్పటినుండి అద్దెఇళ్లల్లోనే ఉన్నప్పటికీ అద్దిల్లు వెదకడానికి కష్టపడ్డ సందర్భం ఏమి లేదు. కానీ దేశంకాని దేశంలో కొత్త కాపురం మొదలుపెట్టాల్సినప్పుడు ఆ కష్టాలన్నీ కూడబలుక్కుని నా తలపై డాన్సులు కట్టేసాయేమోననిపించింది. రెండుమూడునెలలకొకసారి నెత్తిన కుండలేసుకుని తిరగడమే సరిపోయేది. అప్పటికి ఐదిళ్ళు మారి ఆఖరికి ఊరికి చివర్లో ఒక శాశ్వత ఒప్పందంమీద ఇల్లు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నాము. అప్పుడే నా భార్య గర్భవతని తెలియడంతో అంతదూరంలో ఉండడం మాకు సరిపడదనిపించింది. దానితో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాం.

ఇల్లు ఎంత చిన్నదైనా అది సిటీ సెంటర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదని తీర్మానించుకుని దానికి తగ్గట్లు ప్రణాళిక వేసుకున్నాం. కానీ నా బ్యాంకువాడు ఇచ్చే లోనుకి, మేము కొనాలనుకున్న ఏరియాకి పొంతన కుదరకపోవడంతో మేము కట్టాల్సిన డౌన్ పేమెంట్ ఇంకా పెరిగిపోయింది. మరోపక్క డెలివరీ డేట్ కూడా దగ్గరికొస్తుంది. బిడ్డ పుడితే నాకొచ్చే లోను ఇంకా తగ్గుతుందని బ్యాంకు వాళ్ళు చెప్పడంతో ఆ డౌన్ పేమెంట్ డబ్బులు పూడ్చడానికి అనవసరమనిపించిన ఖర్చులన్నీ తగ్గించేసాము. చివరికి దాచినదంతా లెక్కేసినా ఇంకా 40% తక్కువవుతుంది. ఇక వేరే గత్యంతరం లేక మా బావ దగ్గర, మరో స్నేహితుని దగ్గర చేబదులు తీసుకున్నాను. ఆవిధంగా అకౌంట్లో పైసా కూడా దులిపేసి చివరికి మా అమ్మాయి పుట్టడానికి ముందే ఒక ఇల్లు చూసుకుని అగ్రిమెంట్ రాసేసుకున్నాం.

ఇక ఇల్లు కొనేటప్పుడు మేము సవ్యంగా చేసినది ఒకే ఒక్కటి. అదే సెంట్రమ్ కి దగ్గర్లో ఇల్లు కొనడం. మేము ఇల్లు కొనే సమయానికి పాత ఇంటికి చుట్టుపక్కల సరసమైన ధరల్లో ఇళ్ళు అమ్మకానికి వచ్చేవికాని మేము ఇల్లు కొనాలనుకునేది సొంతింటి కల నిజం చేసుకోవడానికి కాదు కాబట్టి మా నిర్ణయం మార్చుకోలేదు.

ఆ ఒక్క విషయం తప్ప చేసిన మిగిలినవన్నీ పొరపాట్లే.

  • బడ్జెట్: నేను కొన్న ఇల్లు నా బడ్జెట్ కంటే ఎక్కువని గ్రహించలేకపోయాను. ఆ డౌన్ పేమెంట్ పూడ్చడానికి నా తలప్రాణం తోకకొచ్చింది. ఇల్లు కొనడానికి ఒక రెండేళ్ల ముందు నుండే పొదుపు చేసుంటే బాగుండేదనిపించింది.
  • కొనాలనుకున్న సమయం: అప్పటికి నా భార్య గర్భవతి. కానీ సమీప భవిష్యత్తులో ఉండబోయే ఖర్చులను నేను కనీసపరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇల్లు కొన్న తర్వాత వచ్చిన జీతం వచ్చినట్లు చేబదుళ్లకి కట్టెయ్యడంతో నెలాఖరుకి చాలా కష్టంగా అనిపించేది. ఇరవైఅయిదో తారీకు కోసం ఎదురుచూపులు చూసేవాడిని. మనమరాలిని వెంటనే చూడాలని ఉందని మా అమ్మ అడిగినా ప్రయాణ ఏర్పాట్లు చెయ్యలేక 4 నెలలు వాయిదా వేసాను. నాకు ఇప్పటికీ గుర్తు, మా అమ్మ వచ్చిన మొదటి నెల చివరికి నా అకౌంట్లో 175 క్రోనా ఉన్నాయి. అక్కడ ఒక మామూలు రెస్టారెంట్లో పిజ్జా 80 క్రోనా. ఆ పరిస్థితులు దాటేసాను కాబట్టి గుర్తొచ్చినప్పుడు నవ్వుకుంటానుగాని ఆ వారంరోజులూ నాకు సరిగా నిద్రకూడా పట్టలేదు.

నా అనుభవం బట్టి నేను చెప్పేది ఆ రెండు పాయింట్లే. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేకంటే ముందు మదుపు చెయ్యడం మొదలుపెట్టి అన్నీ సమకూరినప్పుడు ఇల్లు కొనడం మంచిది. కొనే సమయంలో ఇంటికంటే అధిక ప్రాధాన్యత ఉండే అవసరాలు వచ్చే అవకాశం ఉందనిపిస్తే ఇంటిజోలికి వెళ్ళకపోవడం ఉత్తమం.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?