ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ విజయవంతం అయినట్టు తెలుగునాట జయప్రకాష్‌ నారాయణ్ లోక్‌సత్తా విజయవంతం కాకపోవడానికి కారణాలు ఏమిటి? కేవలం ఢిల్లీ ఓటర్లకూ, తెలుగు ఓటర్లకూ ఉన్న భేదమేనా? రెండు పార్టీల వ్యవహారశైలిలోనూ ఏమైనా తేడాలున్నాయా?

 రాజకీయాల్లోకి రాకముందు జయప్రకాశ్ నారాయణ గారు, కేజ్రీవాల్ గారి నేపధ్యాల్లో కొద్దిగా పోలికలున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలను నడపడంలో వీరిద్దరి మార్గాల్లో చాలా తేడా ఉంది. జయప్రకాశ్ గారు దేశ రాజకీయ పార్టీల విధానాలు మారాలి అనే లక్ష్యంతో పార్టీని నడిపిస్తే, కేజ్రీవాల్ ప్రస్తుత రాజకీయపార్టీల పంథాను అందిపుచ్చుకుని విజయాలు సాధిస్తున్నారు.

వీరిద్దరిలో విరుద్ధంగా ఉన్నాయి అని నాకనిపించిన అంశాలు ఇవే.

నాయకుని పబ్లిక్ ఇమేజ్:

జయప్రకాశ్ గారు నిజాయితీపరులు, సమస్యలు పరిష్కరించగల సామర్ధ్యం ఉన్నవారు అయినప్పటికీ ఆయన కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమయ్యారనే ఆరోపణ ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే లోక్సత్తా క్లాస్ సినిమా ప్రేక్షకుల పార్టీ అనే ముద్ర పడిపోయింది. జేపీ గారి ప్రసంగాలు కూడా యూపీఎస్సీ పరీక్ష సమాధానాల్లాగా ఉండేవి. ఈ భాష చాలా మందికి అర్ధంకాలేదు.

కేజ్రీవాల్ ప్రసంగాలు దీనికి పూర్తి విరుద్ధంగా, సరళంగా ఉంటాయి. ఆయన తన పార్టీ ప్రచారం మొదలుపెట్టిందే ఆటో డ్రైవర్లలతో. ఢిల్లీ మురికివాడల్లో ఈయన దంచిన ప్రసంగాలు హిందీలో మిడిమిడి జ్ఞానమున్న నాక్కూడా అర్ధమయ్యాయి. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లారో లేదో ఆయనకే తెలియాలి.

పార్టీ హామీలు:

లోక్ సత్తా ఏ ఎన్నికలలోనూ అడ్డగోలుగా ఉచిత పధకాలు ఆశ చూపలేదు. ఉచిత కరెంటుకు వ్యతిరేకమని ప్రకటించారు, రైతులతో ముఖాముఖిలో మాత్రం కరెంటు బిల్లులో సబ్సిడీని పరిశీలిస్తామని చెప్పారు. లోక్ సత్తా ఉపాధి హామీ పధకాలు అమలు జరిగి ఫలితాలు కనిపించాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. సంక్షేమ పథకాలు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కల్పన వరకే ఉన్నాయి.

ఇక ఆప్ ఉచిత కరెంటు హామీ గురించి చెప్పనవసరం లేదు. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో ఆప్ హామీలు చూస్తే కాంగ్రెస్, బీజేపీలకు పోటీ వచ్చే పరిస్థితి దాటేసి టీడీపీ, వైస్సార్సీపీ స్థాయికి వచ్చేసింది. చివరికి అన్ని మతాలవారికీ వారి తీర్థయాత్రలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం ఈ ఉచిత హామీలలో పరాకాష్ట.

ప్రచారం:

యూపీ, పంజాబ్ ఎన్నికల కోసం ఇతర రాష్టాల్లో కూడా ప్రజాధనంతో పార్టీ హోర్డింగ్లు ఏర్పాటు చెయ్యగల ధైర్యం లోక్ సత్తాకు లేదు. సోషల్ మీడియాలో పార్టీకి ప్రచారం చేసే కార్యకర్తలు, ఐటీ సెల్ విభాగాల అంశంలో దేశంలోని ఇతర పెద్ద పార్టీలతో ఆప్ పోటీ పడే స్థాయికి వచ్చేసింది. కేజ్రీవాల్ ని విమర్శిస్తే ఆన్లైన్ లో మీద పడి కరిచేసే వాళ్లకు కొదవ లేదు.

సభ్యులు & స్వచ్చంద కార్యకర్తలు:

లోక్ సత్తాలో కార్యకర్తగా పని చేయాలనుకునేవారు ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ తమ ఖాళీ సమయాల్లో మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలనేది ఒక రాయబడని నియమం. ఆప్ లో అటువంటి నిబంధన ఏమీ లేదు. కార్యకర్తగా పనిచేస్తానంటే ఉద్యోగం పక్కన పెట్టేసి వచ్చినా సంతోషంగా ఆహ్వానిస్తారు.

దీనికి తోడు తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీలోని సామజిక పరిస్థితులలోని వ్యత్యాసాలు కూడా లోక్ సత్తా విజయవంతం కాకపోవడానికి, ఆప్ గెలవడానికి ఒక ముఖ్య కారణం. ఈ కోణంలో రాసిన ఇతర సమాధానాలతో నేను ఏకీభవిస్తున్నాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?