మీ జీవితాన్ని మార్చేసిన సంఘటన ఏది?
మనం చేసే ప్రతీ పనీ ఎదో ఒకరకంగా మన జీవితాన్ని మారుస్తూనే ఉంటుంది, కానీ కొన్ని సంఘటనలూ, నిర్ణయాలు మాత్రం అతి పెద్ద మలుపులు తిప్పుతుంటాయి. అటువంటిదే నా పదో తరగతి తర్వాత నా చదువు కొనసాగించాలని మా నాన్న నిర్ణయం తీసుకున్న క్షణం.
ఏదో డెబ్భైలూ ఎనభైలు అంత ఫ్లాష్ బ్యాక్ చదువుల కష్టాలు కాదు కానీ నా కుటుంబ నేపథ్యం కొంచెం అలాగే ఉండేంది. ఆరుగురు తోబుట్టువులున్న మా అమ్మ తరపు నుండీ, ముగ్గురు తోబుట్టువులున్న మా నాన్న తరపు నుండీ పదో తరగతి పూర్తి చేసిన మూడో వ్యక్తిని నేను. నాకంటే ముందు పుట్టిన తొమ్మిది మంది దాయాదుల్లో మా పెదబావ ఐ.టీ.ఐ పూర్తి చేస్తే, ఇంకొక అన్నయ్య పదితో ఆపేసాడు. మా అమ్మానాన్నలిద్దరూ చదువుకోలేదు. ఇంత పెద్ద బ్యాగ్రౌండ్లో నాకు జరిగిన ఒకే ఒక్క మంచి ఏంటంటే నన్ను అది చదవమని, ఇది చదవమని నా మీద బలవంతం ఏమీ ఉండేది కాదు. కనీసం హోమ్ వర్క్ ఏమిచ్చార్రా అనే ప్రశ్న కూడా పడేది కాదు. నచ్చినంత చదువుకుని వచ్చిన్నన్ని మార్కులు తెచ్చుకోవడమే. నా ముందు తరంలో, మా తరంలోని చాలా మంది మేనమామలు, పెదనాన్నలు, అన్నయ్యలు, బావలు అప్పటికే మధ్య ప్రాచ్యంలో పనిచేస్తుండడంతో కుటుంబంలోని పిల్లలందరికీ దుబాయ్ వెళ్లడమే మొదటి ఎంపికగా ఉండేది.
మా అమ్మానాన్నలు నా భవిష్యత్తు గురించి మనసులో ఏమనుకునేవారో నాకు తెలియదు గాని నాకు చదువుకోవాలనే కోరిక ఉండేది. సరిగ్గా అదే సమయంలో నేను పదో తరగతి మంచి మార్కులతోనే (నా దృష్టిలోనే సుమా) పూర్తి చేశాను. కొన్ని ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులు ఇంటింటికీ వచ్చి పిల్లల్ని తమ కళాశాలల్లోకి లాగడానికి ప్రయత్నిస్తూ మా ఇంటికీ వచ్చి ఎంత ఖర్చవుతుందో చెప్పి వెళ్లారు. ఆ తర్వాత మా నాన్న తన యజమాని అభిప్రాయం తీసుకుందామని వెళితే ఆయన నా ముందే అన్న మాట "ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి చదివిత్తే ఆ తర్వాత ఉజ్జోగం వత్తాదని గ్యారెంట్రీ ఏంటి? మంచిగా ఆడ్ని మీ చుట్టాల్లాగా ఏ దుబాయో పంపి, ఊళ్ళో ఓ వంద గజాలు తలం కొను" అని. ఇద్దరం ఏమి మాట్లాడకుండా ఇంటికి తిరిగొచ్చేసాం. వచ్చిన రెండు కళాశాలలకీ చేరడని చెప్పేసారు. చుట్టాలలో కూడా ఇద్దరు మా నాన్నగారి యజమాని చెప్పిందే సరైన ఆలోచన అని సమర్దించారు. కానీ, ఒక అన్నయ్య, ఒక బావ మాత్రం "మనం ఎలాగూ చదవలేదు, కనీసం చదువుతానంటున్నవాడినైనా చదివించండి" అన్నారు. ఇదే సమయంలో మరో కళాశాల ప్రతినిధి వచ్చి తన కళాశాల డప్పు వాయించి వెళ్ళాడు.
సరిగ్గా ఇక్కడే నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. ఎందుకొప్పుకున్నారో తెలీదుగానీ నన్ను ఆ మూడో కళాశాలలో చేర్చారు. ఆ నిర్ణయంతో ఇంటర్లో చేరి, ఎంసెట్లో ఒక మోస్తరు ర్యాంకుతో ఇంటర్ పూర్తి చేశాను. రెండేళ్లక్రితం ఉన్నంత సందిగ్ధత ఈ సారి లేదు. ఏం చదవాలో నా ఇష్టం, ఎక్కడ చదవాలో మా నాన్నగారి ఇష్టం. ఆ విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి మా ఎనిమిది కుటుంబాల్లో మొట్టమొదటగా ఇంటర్,డిగ్రీ, కంప్యూటర్, ఉద్యోగం, ఐరోపా ప్రయాణం లాంటి మైలురాళ్లు దాటి మా కుటుంబ సూపర్ స్టార్ కృష్ణ అనిపించుకున్నాను.
హీహీహీ. నన్నెవరూ సూపర్ స్టార్ కృష్ణ అనలేదులేండీ. ఆ వాక్యం పూర్తిగా నా సొంత డబ్బా మాత్రమే. ఒకవేళ మా నాన్నగారు తన యజమాని సలహా తీసుకునుండుంటే ఈపాటికి మావూళ్ళో స్థలం, ఇల్లూ ఉండేవి. నేను ఈ ప్రశ్నకి ఏ దుబాయ్ నుండో, సౌదీ నుండో సమాధానం రాసేవాడిని, అది కూడా నాలుగో పేరా నుండి పూర్తి వ్యతిరేకంగా.
Comments
Post a Comment