కాలేజ్ రోజుల్లో మీకొక బ్యాచ్ ఉండేదా? అందులో ఎవరెవరు ఉండేవారు? ఏమేం చేసేవారు?

 మొదటిరోజు క్లాసులో అడుగుపెట్టి అక్కడున్న 120 మందిలో తెలిసినవాళ్ళెవరైనా ఉన్నారేమోనని వెతుక్కునేలోపు క్లాసులోకి సీనియర్లు వచ్చేసారు. వాళ్ళ సీనియర్ల దగ్గర నేర్చుకున్న ట్రిక్కులతో పాటూ సొంత సృజనాత్మకతని వాడి మాచేత డాన్సులు కట్టించి, భౌభౌ ఎక్కాలు చెప్పించారు. తెలుగు సినిమాల్లో పోలీసు ఎంట్రీలా రోజు చివరికి ఒక జూనియర్ అధ్యాపకుడు వచ్చి వాళ్ళను బయటకు గెంటడంతో మొదటిరోజు పూర్తయ్యింది.

రెండోరోజు సెక్షన్లు విడగొట్టడంతో క్లాసులో 60 మంది విద్యార్థులు మిగిలారు. చేటలో మినుములు చెరిగితే రాళ్ళూ, మినుములు పోగుబడ్డట్లు ఆ తర్వాతి వారంరోజులూ విద్యార్థులందరూ రకరకాల బ్యాచులుగా ఏర్పడ్డారు. పీకే అభిమానులు, మహేష్ అభిమానులు, బాలయ్య అభిమాని, హాస్టల్లో ఉండేవారు, బ్యాచిలర్ రూముల్లో ఉండేవారు, మోటార్ సైకిళ్ళు ఉండేవారు, ఎంపీగారి కొడుకు వెనక తిరిగేవారు వంటి సమూహాల వెన్ డయాగ్రమ్లో ఏ వర్గానికీ పూర్తిగా చెందని వాళ్ళందరూ కలిసి రెండూ, మూడు వరసల్లో కూర్చునేవారు. ఆవిధంగా నేనూ, సాయి కిషోర్, మురళి బెంచిమేట్స్ అయ్యాము. కిషోర్, మురళి ఆరోతరగతి నుండి కలిసే చదువుకున్నారు. వాళ్లకూ నాకూ ఇంటర్లో పరిచయం, ఇంజనీరింగ్లో స్నేహితులమయ్యాం.

మా ముగ్గురికీ ఒక విషయంలో పోలిక ఉండేది. మేం ముగ్గురం కామెడీ అఫ్ ఎర్రర్స్ ని బాగా గుర్తించేవాళ్ళం. మేము చేసిన వెర్రిపనులు చూసుకుని మాకే నవ్వొచ్చేసేది. ఈ విషయంలో నాకు బడి రోజుల్లోనే ఇబ్బందులెదురయ్యేవి, కాలేజీలో నాకు మరో ఇద్దరు తోడయ్యారు. ఏదైనా ఒక సందర్భంలో మాలో ఒకడు చిన్నగా నవ్వితే అది కార్చిచ్చులాగా మిగిలిన ఇద్దరికీ అంటుకుని నవ్వుని ఎంత అదుపు చెయ్యాలని ప్రయత్నిస్తే అది మరింత ఎక్కువయ్యేది. అది చూసిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు మేమేదో వారిమీద జోకులేసుకుంటున్నామేమోనని మమ్మల్ని అపార్ధం చేసుకునేవాళ్ళు. ఒక్క సంవత్సరంలోనే నవ్వుతూ దొరికేసి డజను సార్లు క్లాసు బయట నిలబడ్డాం. ఇద్దరు అధ్యాపకులు మాత్రం మా పరిస్థితిని అర్ధం చేసుకుని ఏం జరిగిందో తెలుసుకుని మాతోపాటు నవ్వుకునేవారు. ఒకదశలో మమ్మల్ని వేరే బెంచీల్లో కూర్చోబెడితే ఆ నవ్వు జబ్బు వాళ్లకు కూడా అంటుకుంటుందని గ్రహించి మా మానాన మమ్మల్ని వదిలేసారు. చివరికి మాకు లాఫింగ్ బెంచ్ అనే పేరు స్థిరపడింది.

కిషోర్ మంచి డాన్సర్ అవ్వడంచేత వాడికి క్లాసులో మంచి ఫాలోయింగ్ ఉండేది. కానీ వాడేమో అసలు తనవైపు కన్నెత్తి చూడని మూన్లైట్ అనే(వాడు పెట్టుకున్న పేరు) అమ్మాయిని ఇష్టపడేవాడు. ఎంతో కష్టపడి ఆ అమ్మాయి నంబర్ సంపాదించాడుకానీ మాట్లాడడానికి భయపడేవాడు. ఈ మంచు ఫలకాన్ని పగలగొట్టడానికి నేను నా ఫోన్లో మురళిగాడి కాంటాక్ట్ కి మూన్లైట్ నంబర్ను పేరుగా పెట్టి మురళితో చాట్ చేసి ఆ అమ్మాయి నా స్నేహితురాలని కటింగ్ ఇచ్చాను. అది నమ్మేసిన కిషోర్ తన గురించి ఆ అమ్మాయి దగ్గర మంచిగా చెప్పమని వేడుకున్నాడు. అదెంతపని అని "మా కిషోర్ కి నువ్వంటే చాలా ఇష్టమంట" అని మెసేజ్ పెట్టాను. దానికి మురళి "Whaaaat?" అని రిప్లై ఇచ్చాడు. బెదిరిపోయిన కిశోరుగాడు ఒక్క ఉదుటున ఆ అమ్మాయిదగ్గరికి పరిగెత్తి "రాజా చెప్పేదేమీ నమ్మొద్దు, నీ మీద నాకటువంటి అభిప్రాయం లేదు" అని చెబితే విషయం అర్ధంకాని ఆ అమ్మాయి "దేనిగురించి మాట్లాడుతున్నావ్?" అని తిరిగి ప్రశ్నించింది. అసలు సంగతి గ్రహించి మా మీద పిడిగుద్దులు కురిపించాడు. ఎలాగూ అవకాశం దొరికింది కాబట్టి చాటింగ్ చెయ్యడం మొదలెట్టినప్పటికీ చివరికి అమావాస్య చంద్రుడిలా మిగిలిపోయాడు. వాడికి ఈ మధ్యే పెళ్లయ్యింది. ఈ కధ మొత్తం వాడి అత్తమామల కుటుంబం చదవాలని నా ప్రగాఢమైన కోరిక.

ఇక మేంముగ్గురం క్లాసులు ఎగ్గొట్టడం చాలా తక్కువ. అలా చేసిన రెండుసార్లలో ఒకసారి కాలేజి పక్కనుండే మామడితోట రైతు పరిగెట్టిస్తే, మరోసారి గజదొంగలమని మా ఊరిప్రజలు అడ్డగించేసారు. చివరికి వాళ్ళిద్దరినీ కాపాడి నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణలాగా ఫీలైపోయాను.

క్లాసులో మిగిలిన వాళ్ళలాగా మేము పేపర్ ప్రెసెంటేషన్లు ఇచ్చేవాళ్ళం కాదు, టెక్ ఈవెంట్లకి వెళ్ళేవాళ్ళం కాదు. need for speed, vice city, half life లాంటి వీడియో గేములు మాత్రం ఎక్కువగా ఆడేవాళ్ళం. చివరి సెమెస్టర్లో చెయ్యాల్సిన ప్రాజెక్టులో కూడా మేం ముగ్గురం కలసి 15-పజిల్ ఆటను స్వతంత్రంగా పూర్తిచేసే అల్గారిధం తయారుచేస్తే మా అధ్యాపకులు మమ్మల్ని ఎగాదిగా చూసి బయటకి పొమ్మన్నారు. ప్రస్తుతం ముగ్గురం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనే స్థిరపడ్డాం. అప్పుడప్పుడూ ఫోన్ మాట్లాడుకున్నా మాట్లాడేది తక్కువ, నవ్వుకునేది ఎక్కువ.

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఇలా!

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?