మిమ్మల్ని అమితంగా నవ్వించిన ఒక జోక్ గురించి వివరించండి ?
మేము పదో తరగతి చదివేటప్పుడు నా స్నేహితుడు చెప్పిన జోక్ ఇది. ఈ జోక్ చెప్పేటప్పుడు ఎదుటివాళ్ళు నవ్వినా నవ్వకపోయినా నాకు నవ్వొస్తుంటుంది.
ఒక రైలు రాజమండ్రి నుండి భీమవరం వెళుతుంది. నిడదవోలు దాటేవరకు ప్రయాణం సాఫీగా సాగింది, కాని ఉన్నట్టుండి రైలు పట్టాలమీదనుండి కింది వెళ్లి పొలాల్లో, చెట్లల్లో, పుట్లల్లో, గుట్టల్లో తిరిగేసి మళ్ళీ పట్టాలు ఎక్కేసి భీమవరం చేరుకుంది. భయపడిపోయిన ప్రయాణికులు డ్రైవర్ మీద ఉన్నతాధికారులకు పిర్యాదు చేసారు.
అధికారి: రైలుని పట్టాలమీదనుండి దింపేసి పొలాల్లో ఎందుకు నడిపావు?
డ్రైవరు: అదికాదు సార్, పట్టాలమీద ఎవడో పడుకున్నాడు. అప్పుడు..
అ: ఒరేయ్ పిచ్చి వెధవా!! వాడు చద్దామనే పడుకున్నాడు. నువ్వు వాడిమీదకి ఎక్కించేయొచ్చు.
డ్రై: ఆ విషయం నాకూ తెలుసు. అందుకే చివర్లో వాడికి భయమేసి పారిపోతుంటే వెనక చేస్ చేసి మరి గుద్దేశాను.
—————————————————————————-
అప్పుడప్పుడూ నేనూ, నా స్నేహితులవల్ల హాస్యం పుట్టిన సందర్భాలు తలుచుకున్నపుడు కూడా నవ్వుకుంటూ ఉంటాము.
క్లాసులో ఒకసారి నా పక్కన కూర్చొనే స్నేహితుడుని నవ్వాడనే కారణంతో మాస్టారు బయటకి పంపేశారు. ఆరోజు సాయంత్రం ఒక స్నేహితురాలు ఫోన్ చేసి ఆ అబ్బాయిని ఎందుకు బయటకి పంపేశారు అని అడిగింది. అప్పుడు మా బెంచ్లో కూర్చున్న ఇంకొకడు జోక్ చెప్పాడని, వీడు నవ్వు ఆపుకోలేకపోయాడని చెప్పాను. ఆ జోక్ ఏంటో తనకి కూడా చెప్పమని అడిగింది. ఆ జోక్ తనకి చెప్పాను( కానీ ఇప్పుడు మర్చిపోయానులేండి). జోక్ చెప్పిన వెంటనే తను కూడా నవ్వడం మొదలుపెట్టింది. ఎంత నవ్విందంటే కనీసం మాట కూడా మాట్లాడలేకపోయింది. ఆ జోకులో అంత నవ్వులున్నాయా అనుకున్నాను. నవ్వు ఆపుకోలేకపోతున్నాను, రేపు మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది.
తర్వాతిరోజు క్లాసులో కలిసినప్పుడు ఎందుకు అంతలా నవ్వావని అడిగితే అసలు సంగతి చెప్పింది. అసలు తనకి ఆ జోక్కి నవ్వే రాలేదంట. ఆ జోక్కి కూడా నవ్వుకున్న మమ్మల్ని తల్చుకుంటే నవ్వొచ్చిందంట.
Comments
Post a Comment