డాల్ఫిన్ అత్యంత తెలివైన జంతువని ఎందుకు అంటారు?

 లేని సమస్యలను కొనితెచ్చుకునే దిక్కుమాలిన అలవాటు పక్కన పెట్టేస్తే మనిషిని మించిన తెలివైన జంతువు ప్రాణి ప్రపంచంలో లేదు. ఆ తరువాతి స్థానంలో వివిధ కొలమానాల ప్రకారం డాల్ఫిన్, కాకి, కుక్క, ఆక్టోపస్, చింపాంజీ, ఏనుగు, పంది వంటి జంతువుల తెలివితేటలను పోల్చుతారు. పరిశోధకులు, ఔత్సాహికులు వీటిపై పరిశోధన చేసి కనుగొన్న విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మిగతా జీవ జాతులతో పోల్చినప్పుడు ఈ జంతు సమూహాలకు సమస్యలను పరిష్కరించే తెలివితేటలు ఎక్కువగానే ఉన్నప్పటికీ మనిషి తెలివితేటలకు ఇంకా చాలా దూరంగానే ఉన్నాయి.

ఇక డాల్ఫిన్ల విషయానికి వస్తే శరీర బరువుతో పోల్చినప్పుడు అతి పెద్ద మెదడు గల జీవుల్లో మనిషి తర్వాత రెండో స్థానంలో ఉంది. అద్దంలో తనను తాను గుర్తుపట్టగలిగే అతి తక్కువ జీవుల్లో డాల్ఫిన్ కూడా ఒకటి. డాల్ఫిన్లకు తమ శిక్షకులను, తోటి డాల్ఫిన్లను ఏళ్ళ తర్వాత కలిసినా గుర్తుపట్టగల సామర్ధ్యం ఉంది. సందర్శన ఆక్వేరియాల్లో, సంరక్షణ కేంద్రాల్లో ఉంచబడిన డాల్ఫిన్లలపై చేసిన పరిశీలనలలో ఈ ప్రత్యేకతను గమనించారు.

తన చుట్టుపక్కలవాటిని పనిముట్లుగా వాడుకునే తెలివితేటలు కూడా డాల్ఫిన్లకు ఉన్నాయి. వేటాడేటప్పుడు చేపలను తికమక పెట్టడానికి నీళ్ల అడుగున ఉన్న బురదను ఉపయోగించి లేని అడ్డుగోడలను సృష్టించడం లాంటి పద్దతులను కూడా ఉపయోగిస్తాయి. సముద్రంలో దొరికే స్పాంజి లాంటి జీవిని కూడా వాడుతాయని కనుగొన్నారు కానీ అందుకు గల కారణాలకు ఆధారాలు లేవు.

ఇక ఒక డాల్ఫిన్ నేర్చుకున్న విన్యాసాన్ని చూసి కొత్త డాల్ఫిన్లు తేలికగా అనుకరించడం, అంకెల క్రమాన్ని గుర్తుపెట్టుకోవడం లాంటి విజ్ఞాన ప్రదర్శనలు కూడా చేస్తుంటాయి.

ఇవి కాక ఎకో లొకేషన్ శబ్దాలు, సంజ్ఞలను ఉపయోగించి చేసే వీటి సంభాషణలు మనుషుల స్థాయిలో కాకపోయినా ఇతర జీవులతో పోల్చి చూస్తే చాలా సంక్లిష్టంగా, వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునే స్థితిలో ఉందని కొందరి శాస్త్రవేత్తల అంచనా.

ఇవన్నీ చూస్తుంటే మనుషులు తర్వాత మరో పది ఇరవై వేల ఏళ్లకు డాల్ఫిన్లు రాజ్యమేలతాయేమో అనిపిస్తుంటుంది.


Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?