మనదేశము వాళ్ళు విదేశాలలో క్రమశిక్షణ పాటిస్తారు కాని ఇక్కడ ఎందుకు పాటించరు?
అందరూ పాటిస్తారని చెప్పలేంగాని చాలామంది క్రమశిక్షణగా ఉంటారు. నాకు తెలిసినవి మూడు కారణాలు.
వారు అప్పటికే క్రమశిక్షణ కలవారు:
మన సినిమాల్లో బూతద్దంలో చూపించినట్లుగా భారతీయులందరూ క్రమశిక్షణ లేనివారు, నియమాలు పాటించనివారు కాదు. అలాగే విదేశీయులందరూ మరమనుషుల్లాగా ప్రవర్తించరు. క్రమశిక్షణ ఉన్నవారూ, లేనివారు మనదేశంలోనూ ఉన్నారు, విదేశాల్లోనూ ఉన్నారు. కానీ చుట్టుపక్కల ఎక్కువమంది ఎలా ప్రవర్తిస్తున్నారో అదే మనమీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వరుసలో వెనుక నిలబడ్డవాళ్లు తోస్తుంటే మధ్యలో నిలబడ్డ సంస్కారికి రెండే అవకాశాలుంటాయి. ఒకటి పక్కకెళ్లి కూర్చుని అందరూ వెళ్ళిపోయాక తనపని చేసుకోవాలి. లేకపోతే అతను కూడా కలబడి తొయ్యలి. మొదటిదానికి మనదేశంలో అవకాశం తక్కువ కాబట్టి ఎక్కువమంది రెండోదానికే మొగ్గుచూపుతారు. ఇటువంటివారు విదేశాలకి వెళ్ళినప్పుడు స్వతహాగా వారి క్రమశిక్షణ అక్కడున్న పరిస్థితులకు సరిపోలితే సంతోషంగా అలవాటుపడిపోతారు.
అపరాధ రుసుములు:
రోడ్లపై, బహిరంగప్రదేశాల్లో నియమాలను ఉల్లంఘించడానికి ఏ దేశమూ ఒప్పుకోదు. వాటిని అరికట్టడానికే అపరాధరుసుములు, శిక్షలు విధిస్తారు. అటువంటి శిక్షలు పడడానికి ఎంత అవకాశం ఉంది అనే దానిపై జనాలు వాటిని ఉల్లంఘించడానికి రిస్క్ తీసుకుంటారు. కొన్ని దేశాల్లో ఆ రుసుములు చాలా దారుణంగా ఉంటాయి. కేవలం కొన్ని సిగ్నళ్లు దాటడం వల్ల సగం జీతం సమర్పించిన మహానుభావుణ్ణి చూసాను నేను. ఒకవేళ విదేశీయులైతే వాళ్ళ వీసాల మీద కూడా ప్రభావం చూపుతుంది. అందుకే విదేశీయులు పరాయిదేశం వెళ్ళినప్పుడు రోడ్లపై చాలా జాగ్రత్తగా ఉంటారు. దేశంకాని దేశంలో కష్టాలు పడటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా.
గౌరవం:
క్రమశిక్షణ మీరేవారిపై ముందు విరుచుకుపడేది ప్రజలే అయితే అలా చెయ్యాలనుకునేవారికి భయమేస్తుంది. వచ్చిన కొత్తలో ఒక తెలుగు కుటుంబం వాళ్ళమ్మాయి ఏడుస్తుందని రోడ్డుపై మున్సిపాలిటీవాళ్ళు వేసిన మొక్కనుండి ఒక పువ్వు కోసిచ్చింది. అది చూసిన ఒకావిడ మొహం ఎర్రబడి మొత్తం మా అందరిమీద కంప్లైంట్ పెడతానని హడలగొట్టింది. చంటిపిల్లకోసం తెలియక అలాచేసాం, తప్పైపోయిందని బ్రతిమాలితే ఇంకెప్పుడు చెయ్యొద్దని చెప్పి వెళ్ళింది. ఆ దెబ్బకి రోడ్డు మీద కాదు కదా, అడవిలో పువ్వులు కొయ్యాలన్నా నాకు దడ, నాకు తెలిసిన వాళ్ళు చూసి నా గురించి ఏమనుకుంటారేమోనని.
Comments
Post a Comment