ఈ రోజుల్లో కూడా "శాకాహారులకు మాత్రమే" ఇల్లు అద్దెకి ఇస్తామని బోర్డు తగిలించడం ఎలా సబబు ? ఇది వివక్షతో కూడిన అనాగరిక చర్య కాదా ? ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లను బట్టి అతనిని వివక్షకు గురిచెయ్యవచ్చా ? ఇది నేరం కాదా ?
కొన్నేళ్ల క్రితం అద్దిల్లు దొరకక ఇబ్బంది పడుతుంటే ఆఫీసులో వేరొక టీంలో పనిచేసే ఒక తమిళబ్బాయి ఇల్లు ఖాళీ చేస్తున్నానని, కావాలంటే అది తీస్కోవచ్చని చెప్పాడు. వెళ్లి చూస్తే బాగానే అనిపించి దిగడానికి ఒప్పుకున్నాం. కానీ వెళ్ళబోయేముందు పై అంతస్తులో ఉండేవారితో తన అనుభవాలు మాతో చెప్పుకున్నాడు.
ఆ అబ్బాయి దిగిన కొత్తలో పైన ఉన్నవారు వచ్చి తమకి ఘాటైన వాసనలు పడవని, వారు వద్దని చెప్పినా యజమాని భారతీయులకి అద్దెకిచ్చారని, దయచేసి ఘాటైన వంటలు చేయొద్దని చెప్పారు. ఈ అబ్బాయి అసలు వంటే వండుకోడు కాబట్టి ఇబ్బందేమి లేదనుకున్నాడు. రెండ్రోజుల తర్వాత ఈ అబ్బాయి స్టోర్లో కొన్న ముందే వండి ప్యాక్ చేసిన ఇండియన్ చికెన్ కొర్మా వేడి చేస్కుంటుంటే తలుపు బెల్ మోగింది. వెళ్లి చూస్తే పైఇంటాయన. వాళ్ళావిడ ఆ వాసన భరించలేకపోతుందని అది వండడం ఆపమని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఇండియన్ వంటకాలు కొనలేదు.
మళ్ళీ కొన్ని రోజులతర్వాత ఇంట్లో వీడియోగేమ్ ఆడుకుంటుంటే మళ్ళీ తలుపు బెల్ మోగింది. ఈసారి ఏమయ్యిందోనని వెళ్లి చూస్తే మళ్ళీ ఆయనే. "ఒకసారి చెప్పాము కదా, నువ్వు వినవా!" అని మొహం చిట్లిస్తే, అసలు ఆరోజు తను ఇంకా టిఫిన్ కూడా తినలేదని, కనీసం వంటగదిలోకే వెళ్లలేదని, కావాలంటే వెళ్లి చూసుకోమని తిరగబడ్డాడు. అతను వెళ్లి పొయ్యి మీద చెయ్యి పెట్టి చూసి తప్పు గ్రహించి మారుమట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాతిరోజు కనిపించి క్షమాపణలు అడిగాడు. ఒకవేళ మళ్ళీ అతనేమైనా మాకు కూడా ఇబ్బంది కలిగిస్తే నేరుగా యజమానితో మాట్లాడుకోమని చెప్పమని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు.
అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా నా సోదంతా ఎందుకు చెబుతున్నానంటే "ఐరోపావారికి మాత్రమే", "శాకాహారులకు మాత్రమే" వంటి నియమాలు అంతకు ముందు జరిగిన అనుభవాల వల్ల పెట్టుకున్నవయితే అది వివక్ష అవ్వదు. అలాకాక మాంసాహారులవల్ల కష్టాలు ఉంటాయని ఊహించుకునో, లేక తమ వర్గంవారిని తెలుసుకోవడానికి భోజనపు అలవాట్లు నియమాలు పెడితే అది వివక్షే. ఇందులో రెండోరకాన్ని చిన్న లిట్మస్ పరీక్షతో కనిపెట్టడం సులువే. శాకాహారులమే అని చెప్పి చూడండి. ఒకవేళ ఇంటిపేర్లు, కులం, ప్రాంతం తెలుసుకుని అప్పుడు ఇల్లు ఇవ్వనంటే అది మీ అదృష్టం అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. ఇక కుల, ప్రాంత ప్రస్తావన లేకుండా ఇల్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తే నిజం చెప్పి, క్షమాపణలు అడిగి వేరొక ఇల్లు చూస్కోండి. కానీ వారు ఏ ఉద్దేశ్యంతో ఇల్లు ఇవ్వనని చెప్పినా మనం చెయ్యగలిగింది ఏమిలేదు. ఎవరి ఇల్లు వాళ్ళిష్టం.
Comments
Post a Comment