వివిధ దేశాలలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కదా ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకీ ఓట్లు సమానంగా వస్తే అప్పుడు ఏం జరుగుతుంది ?

 స్వీడన్లో అటువంటి సందర్భం వచ్చే అవకాశమే లేదు. ఆ దేశంలో ఎన్నికలు ప్రధానంగా పార్టీల మధ్య జరుగుతాయి కానీ అభ్యర్థుల మధ్య కాదు. పార్టీలు తమకొచ్చిన ఓట్లను బట్టి కమ్యూన్(పురపాలక సంఘం), ల్యాన్(రాష్ట్రము లాంటిది), పార్లమెంట్ స్థాయిలో సీట్లను పంచుకుంటారు. ఒకవేళ రెండు పార్టీలకు సమానమైన ఓట్లు వస్తే వారికి వచ్చే సీట్లు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి.

స్వీడన్ ఎన్నికల విధానాన్ని కమ్యూన్ స్థాయిలో ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తాను. ఎరిక్పాడు అనే ఒక కమ్యూన్లో 100 సీట్లు, 1,00,000 మంది లెక్కించగల ఓటు వేశారు. కమ్యూన్ ఎన్నికలలో కాగాచాజా అనే నాలుగు పార్టీలు పోటీ పడుతున్నాయి. కా పార్టీకి 59100, గా పార్టీకి 34100, చా పార్టీకి 4900, జా పార్టీకి 1900 ఓట్లు వచ్చాయి. కమ్యూన్లో సీట్లు పంచుకోవాలంటే కనీసం 3% (పార్లమెంట్ ఎన్నికలలో 4%) రావాలనే నిబంధన ఉంది. దానితో జా పార్టీకి 1900 ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం రావు. ఇక తమకొచ్చిన ఓట్ల శాతం బట్టి కా పార్టీ 61 సీట్లు, గా పార్టీ 34 సీట్లు, చా పార్టీ 5 సీట్లు తీసుకుంటాయి. ఒక పార్టీకి వచ్చే సీట్లలో ఎవరిని ఎన్నుకోవాలో ఆ పార్టీకి ఓటు వేసేవారు నిర్ణయించే అవకాశం ఉంది.

స్వీడన్లో ఎన్నికలు బ్యాలెట్ కాగితంతో జరుగుతాయి. పోటీ చేసే పార్టీకి ప్రత్యేకంగా రెండు రకాల బ్యాలెట్ కాగితాలు ఉంటాయి. ఒకదానిలో కేవలం పార్టీ పేరు మాత్రమే ఉంటుంది. ఓటరు కేవలం పార్టీకి మాత్రమే ఓటెయ్యాలనుకుంటే ఆ పార్టీ పేరున్న బ్యాలెట్ కాగితం తీసుకుని డబ్బాలో వేస్తే సరిపోతుంది. ఒకవేళ ఓటరు ఆ పార్టీలో తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలంటే అభ్యర్థుల పేర్లున్న రెండోరకం కాగితం తీసుకోవాలి. ఓటు వేసేముందు దానిలో ఒక అభ్యర్థి పేరును పెన్నుతో మార్కు చెయ్యాలి. ఇక్కడ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.

పార్లమెంట్ ఎన్నికలలో వాడే బ్యాలెట్ కాగితం:

పై రెండూ కాక పార్టీ పేరు లేని మూడోరకం బ్యాలెట్ కాగితం కూడా ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలకు ప్రత్యేకమైన బ్యాలెట్ కాగితాలు ఉండవు. అలాంటి పార్టీలకు ఈ మూడోరకం పనిచేస్తుంది. ఆ కాగితం తీసుకుని దానిమీద మనకు నచ్చిన పార్టీ పేరు రాసి ఓటు వెయ్యొచ్చు.

ఇక కౌంటీ, పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు పంచుకునేందుకు నిష్పత్తి నియమంతో పాటూ శాశ్వత సీట్లు, సర్దుబాటు సీట్లు అనే మరొక నియమం ఉంది. కానీ దానిగురించి చెప్పి తికమక పెట్టాలనుకోవడంలేదు.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?