రెస్టారెంట్లలో మీకు మరచిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
అవి చెన్నైలో ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు. ట్రైనింగ్ పూర్తయ్యేవరకూ ఇంట్లో వంట ప్రోగ్రాములేవి పెట్టకూడదని నిర్ణయించుకుని బయట మంచి హోటళ్లు ఏమైనా ఉన్నాయేమో చూడాలని రూములో ఉన్న ఆరుగురూ నిర్ణయించుకున్నాము. ఒక రెండు రోజులు ఆ చుట్టుపక్కల హోటళ్లు, మెస్సులు చూసుకుని సాయంత్రం ఏది బాగుందో మాట్లాడుకునేవాళ్ళం.
ఆరోజు మా స్నేహితుడు మంచి మహదానందంగా రూముకొచ్చి "నేనొక మంచి మెస్ ఒకటి చూసాను, ఫుడ్డు అదిరిపోయింది" అని ఊదరగొట్టాడు. మాకు అస్సలు తమిళ్ రాదు. మా ఆరుగురిలో నాలుగు తమిళ ముక్కలు వచ్చినోడు (అక్షరాలా తయిర్, మోర్, కుళంబు, ఇరుక్కురదా మాత్రమే) వాడే కనుక వాడు చెప్పిందే వేదవాక్కు. అందుకే ఆ పూట భోజనం అక్కడే చెయ్యాలని తీర్మానం జరిగిపోయింది.
హోటల్కి వెళ్ళాం. రెండు టేబుళ్లు కలిపేసి ఆరుగురూ ఒకటే చోట కూర్చుని వేచిచూస్తున్నాం. ఒక కుర్రాడు వచ్చాడు. వెంటనే మా తమిళ విజ్ఞాన ప్రదర్శన మొదలైపోయింది. మావోడు "పూరి ఇరుక్కురదా?" అని మొదలెట్టాడు. "ఇరుక్కిరదు " అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. వీడు మా వైపు తిరిగి "పూరి ఉందంట రా!" అని చెప్పి మళ్ళీ రెండో ప్రశ్న వేసాడు "దోశ ఇరుక్కురదా?" అని. ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. వీడు మాకు తెలుగులో చెప్పాడు.
ఇలా ఒక నాలుగు ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత ఆ అబ్బాయికి చిరాకొచ్చినట్లుంది. వెంటనే "అన్నా, ఇది ఆంధ్రా మెస్సే, మీరు తెలుగులో మాట్లాడొచ్చు" అని ఒక్క ముక్కతో మావోడి గాలి తీసేసాడు. ఏం చెప్పాలో తెలియక "సర్లే రా! మీరు ఆర్డర్ చెప్పేసుకోండి, తెలుగేనంట కదా" అని చెప్పి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత వారం రోజులూ రూమ్ లో ఎవరు ఏం మాట్లాడినా వాడికి మాత్రం "ఇరుక్కురదా" రీసౌండ్ లో వినిపించింది. ఇప్పటికీ వాట్సాప్లో వాడి కాంటాక్ట్ చూసినప్పుడల్లా వాడి తమిళే గుర్తొస్తుంది.
Comments
Post a Comment