కుల,జాతి,రంగు, మత,లింగ వివక్ష గురించి చాలా మంది పోరాడుతారు. కానీ డబ్బు తో వివక్ష ఉంది కదా మరి డబ్బును నిర్మూలించడాన్ని ఎందుకు ఎవరూ కోరుకోరు?
నేను పుట్టినప్పుడు నా ప్రమేయం లేకుండానే నాదని చెప్పబడ్డ కులం నా గుర్తింపులో భాగమైపోయింది. నా దేశంలో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా దానితోనే నన్ను గుర్తించేవాళ్ళు ఎక్కువ. గత ఆరేళ్లలో నా రంగు నా గుర్తింపైపోయింది. దీన్ బ్రూనా స్వెన్స్క్ (గోధుమ వర్ణపు స్వీడిష్) అనే బిరుదు కూడా ఇచ్చేసారు నా స్వీడిష్ స్నేహితులు. మనదేశంలో మా ఊళ్ళో, నా స్నేహితుల మధ్య, ఇక్కడ ఈ దేశంలో నా స్నేహితుల మధ్య నా కులం, రంగే గుర్తింపు. వాటిని మార్చుకుందామన్నా నా వల్ల కానీ పని అది. అదృష్టవశాత్తు వాటివల్ల నేను వివక్షను ఎదుర్కొనలేదు. కానీ అలా వారి ప్రమేయం లేకుండా వివక్ష ఎదుర్కొన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్షంగా చూసాను.
ఇక నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు పేదవాళ్ళు. ఆ తర్వాత ఐదేళ్లకు ఎగువమధ్యతరగతికి చేరుకున్నారు. మరో రెండేళ్లకు మరో మెట్టేక్కేసారు. మరో రెండేళ్లకు దిగువమధ్యతరగతికొచ్చిపడ్డారు. నా ఉద్యోగం వచ్చాక మధ్యతరగతికొచ్చి ప్రస్తుతం ఎగువ మధ్యతరగతిలో ఉన్నారు. అంటే కులం, రంగు, జెండర్ లాగా కాకుండా ఆర్ధిక పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ పరిస్థితులు కొంత వరకూ ఆ వ్యక్తి చేతుల్లో ఉండే అవకాశం ఉంది. పైగా ఈ విషయంలో జరిగే అవమానాలు, చేసే అవమానాలు ఒక్కోసారి తిరగబడొచ్చు కూడా. అందుకే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అనే సామెత పుట్టుకొచ్చింది.
ఈ ఉదాహరణ బట్టే అర్ధమవుతుంది కదా డబ్బు వల్ల వచ్చే వివక్షతతో పోలిస్తే కుల,లింగ వివక్షలాంటి వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో.
Comments
Post a Comment