మీరు ఎదుర్కొన్న అతి పెద్ద కల్చరల్ షాక్ ఏమిటి? ఎప్పుడు, ఎలా జరిగింది?

 నేను స్టాక్ హోమ్ వచ్చిన కొత్తలో కమ్యూన్ సైకిలు తొక్కడం ప్రోత్సహించడానికి అద్దె సైకిలు కార్యక్రమం ఒకటి తీసుకొచ్చింది. సభ్యత్వం తీసుకుని, ఉన్న రెండు ప్లాన్లలో మనకు అనుకూలమైనది తీస్కోవచ్చు. మొదటిది మూడు రోజులకు 150, రెండోది ఎనిమిది నెలలకు 300. ఇక దొరికిందే సందని నేనూ, నా భార్య చెరొక సభ్యత్వం తీసుకుని వాడకానికి కొత్త అర్ధం చెప్పాలని నిర్ణయించేసుకున్నాం.

ఒకరోజు విదేశీయులకు ఉద్యోగావకాశాల గురించి ఒక సెమినార్ జరుగుతుందని తెలిసి అక్కడికి గూగుల్ మాప్స్ లో దారి చూసుకుని సైకిలు వేసుకెళ్ళాను. వాడు స్వీడెన్ ఆఫీసుల్లో కాఫీ ప్రాముఖ్యతని వివరించి పంపించేసాడు. ఇంటికొచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు వెతుక్కుని తిరిగి ప్రయాణం మొదలుపెట్టాను. కొంచెం సేపటి తర్వాత ఒక పెద్ద వంతెన వచ్చింది. ఫోన్లో దారి తిన్నగా చూపిస్తుంది. "ఆహా! ఎంత విశాలమైన రోడ్డు" అనుకుని ముందుకు దూసుకుపోతున్నాను. వంతెన ఎక్కేసిన కాసేపటికి రోడ్డు మీద సొరంగం గుర్తు కనిపించింది. "ఇదో కొత్త అనుభవం" అనుకుని ముందుకు సాగుతూనే ఉన్నాను. నా పక్కన వెళ్తున్న కారు ప్రయాణికులు నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. "సైకిలు తొక్కుతున్న భారతీయుడ్ని అంతకుముందు వీళ్లెవరూ చూడలేదా" అని మనసులోనే ప్రశ్నించుకుని "అయినా గాంధీగారి వస్త్రధారణ చూసినప్పుడు కూడా వీళ్ళు ఇలాగే విస్తుపోయారులే" అని నాలో నేనే సరిపెట్టుకున్నాను. సరిగ్గా అప్పుడే పక్కన వెళుతున్న కారులో ఒక టీనేజి పిల్లాడు నోటిలో ఉన్న కూల్ డ్రింక్ స్ట్రా బయటకి తీసి మరీ నవ్వుతున్నాడు. "ఇదేదో తేడాగా ఉందేంటి?" అనిపించి అటువైపు చూస్తే మరోపక్క రెండో వంతెన మీద నడిచేవాళ్లు నా వైపు "we….. will, we…… will.. rock you" పాటకి డాన్స్ వేస్తున్నట్లు నన్ను చూసి చేతులు ఊపుతున్నారు. ఏదో తేడా కొట్టేసిందని సైకిలుని వంతెనకి వీలైనంత చివరికి లాగేసి "what happened?" అని గట్టిగా అడిగాను. వాళ్ళేదో చెబుతున్నారు కానీ నాకు వినబడట్లేదు. ఇటువైపేమో కార్లలోని వాళ్ళందరూ ఏదో స్పైడర్ మాన్ని చూసినట్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. నాకు వినిపించట్లేదని రెండో వంతెన వాళ్ళకి అర్ధమయ్యి ఫోన్ పైకెత్తి చూపిస్తున్నారు. కాసేపటికి ఆ మూగసైగల అర్ధం తెలుసుకుని, అదొక మోటార్ వే అని, సైకిళ్లకు ప్రవేశం లేదని తప్పు గ్రహించి పోలీసులకి ఫోన్ చేశాను. రెండు నిమిషాల్లో అక్కడుంటామని చెప్పారు. ఏదో మాటవరసకి రెండు నిమిషాలన్నారేమోగాని ఎంతసేపటికివస్తారో తెలియదు, వచ్చేలోపు మంచి బలంగా ఉన్న ట్రక్కోడు నన్ను అప్పడం చేసేస్తాడు అని భయం పట్టుకుంది. ఒకవేళ బతికి బట్టకట్టినా ఈ పోలీసోళ్ళు ఊరుకోరు, ముందు నన్ను అరెస్టు చేసేస్తారు, ఆ తర్వాత నా వీసా, పాస్పోర్ట్ లాగేసుకుంటారు, చివరికి నన్ను ఇండియా తోలేస్తారు, 300 పెట్టి సైకిలు తీసుకున్నాను కానీ ఇంకా నెలైనా తొక్కలేదు కదా అని విచారం పెరిగిపోయింది. వంతెన నుండి కిందకి చూస్తే అలలు లేని బాల్టిక్ సముద్రం కనిపిస్తుంది. అందులో పడ్డానంటే నీళ్లు తగలకముందే గుండాగిపోతదేమో అని ఆలోచిస్తుంటే ఒక పోలీస్ కారు, ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగాయి.

కారులో నుండి దిగిన గెడకర్రల్లాంటి ఇద్దరు పోలీసులు నా దగ్గరికొచ్చి "ఫోన్ చేసి సాయమడిగింది మీరేనా సర్?" అని అడిగారు. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఐడెంటిటీ కార్డు పట్టుకుని నిలబడ్డ నాకు ముందు ఏమని సమాధానమివ్వాలో తెలియలేదు. నా తప్పేం లేదు, అంతా ఈ గూగులోడు చేసాడు అని చెప్పబోతుంటే, "పర్వాలేదు సార్" అని మరోసారి ఆశ్చర్యపరిచి "ముందు మా పోలీస్ కారు వెళ్తుంది, దాని వెనక మీరు సైకిలు తొక్కండి, వెనక మా పోలీస్ వ్యాన్ వస్తుంది. మీకేం భయం లేదు" అని చెప్పారు. ప్రాణం లేచొచ్చిందనిపించింది. అలా పోలీస్ కాన్వాయ్ మధ్యలో సైకిలు తొక్కుతున్న సన్నివేశం పొరపాటున ఏ తెలుగోడైనా చూసుంటే తెలుగు సినిమా హీరో ఇంట్రడక్షన్ సీన్ తీస్తున్నారేమోనని పొరపడతాడనిపించింది. అలా రెండు మూడు కిలోమీటర్లు తొక్కాక మోటార్వే దాటి సోదర్మామ్ చేరుకున్నాం. ఒకచోట ఆపి "మీరిక్కడనుండి క్షేమంగా వెళ్లొచ్చు" అని చెప్పి వెళ్లిపోయారు.

అక్కడి పోలీసుల ప్రవర్తనను నేనస్సలు ఊహించలేదు. కనీసం స్టేషన్కి తీసుకెళ్తారు, చులకనగా మాట్లాడతారేమోనని అనుకున్నాను కానీ అస్సలు ఒక్క మాట కూడా అనలేదు. ముఖ్యంగా ఆ పరిస్థితిలో నన్ను భయపెట్టకుండా ధైర్యం వచ్చేలా మాట్లాడారు.

తర్వాతిరోజు ఆఫీసులో జరిగింది చెబితే "ఆ మహానుభావుడివి నువ్వేనా! లోకల్ రేడియోలో ఒకడు సొరంగం దగ్గర సైకిలు తొక్కుతున్నాడు అని చెప్పారని" అన్నారు. వెంటనే గూగుల్ మ్యాప్ పక్కనబెట్టి స్టాక్ హోమ్ టూరిస్ట్ మ్యాప్ తెచ్చుకున్నాను.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?