భారతదేశంలో రిజర్వేషన్లు తీసివేస్తే ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మంచి,చెడులు రెంటినీ విశ్లేషించగలరు?
ముందసలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ రిజర్వేషన్లు పెట్టకుండా ఉండుంటే ఏమయ్యేదో అని ప్రశ్న వేసుకుని ఆ సమాధానం నుండి ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తే ఎటువంటి మార్పులొస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమెరికా, దక్షిణాఫ్రికా, రువాండా, భారతదేశం. వీటన్నింటికి ఒక విషయంలో పోలిక ఉంది. ఈ దేశాల చరిత్రలో ఎదో ఒక సమయంలో (దురదృష్టవశాత్తూ ప్రస్తుతం కూడా) ఒక వర్గం వారు మరొక వర్గం వారి చేతిలో అణగార్చబడ్డారు. కొన్ని దేశాల్లో తెల్లవారు నల్లవారిపై పెత్తనం చెలాయిస్తే, మరొక దేశంలో నల్లవారే నల్లవారిపై పెత్తనం చెలాయించారు. ఇలా పెత్తనం చెయ్యడానికి, చేయించుకోబడడానికీ ఎంపిక ప్రక్రియకి రకరకాల ప్రమాణాలున్నాయి. కొన్ని చోట్ల చర్మం రంగు చూసారు, కొన్ని చోట్ల జాతి అన్నారు, మరికొన్ని చోట్ల చేసే పని అన్నారు. ఆ ప్రమాణం ఏదైనా ఒక వర్గం మరొక వర్గాన్ని అణగార్చడం అనేది మాత్రం పైన చెప్పిన అన్ని దేశాల్లోనూ జరిగిన సత్యం. అది కొన్ని దేశాల్లో బానిసత్వాన్ని ఏర్పాటు చేస్తే మరికొన్ని దేశాల్లో అంటరానితనాన్ని తయారుచేసింది. దాదాపు ప్రతిదేశంలోనూ ఇటువంటి చరిత్రలే ఉన్నా ఆ నాలుగు దేశాలే ఎంచుకోవడానికి ముఖ్యకారణం ఆ వర్గ విభజన యొక్క స్థాయి వాటిలో చాలా ఎక్కువ.
అమెరికాలో బానిసత్వాన్ని బహిష్కరించిన తర్వాత విముక్తి పొందిన అనేకమంది నల్లవారు అవకాశాలు లేక ఆకలితో, జబ్బులతో చనిపోయారు. మిగిలిన వారిలో కొంతమంది, వారి తరువాతి తరాలు హింస వైపుకి ప్రేరేపించబడ్డారు. దీనికి తోడు సాధారణ జీవితం కొనసాగిద్దామనుకున్న నల్లవారిపై కూడా వివక్ష, అనుమానం కొనసాగింది. 1865 లో అంతర్యుద్ధం ముగిస్తే ఒక నల్లబాలిక తెల్లవాళ్ళ పాఠశాలలో అడుగు పెట్టడానికి వందేళ్లు పట్టింది [1] . వీటన్నింటి ఫలితం ఈ క్రింది గ్రాఫ్. ఇంకా భయపెట్టే నిజం ఏంటంటే ఆ కేసుల్లో 25% అమాయకులకు శిక్ష పడుతుంది. దక్షిణాఫ్రికాలో ఈ విభజన అమెరికా కంటే దారుణం [2] .
ఇక రువాండాలో జరిగిన మారణహోమానికి కారణం కూడా శతాబ్దాల వివక్షే. అప్పటికే ఉన్న విభజనని బెల్జియన్ వలస పాలకులు పెంచి పోషించారు. వాళ్ళు దేశం వదిలివెళ్లిన వెంటనే అల్ప సంఖ్యాకులైన టూట్సి లని, మెజారిటీ హుటులు ఊచకోత కోసారు[3] .
ఇప్పుడు మనదేశం విషయానికి వద్దాం. అమెరికా, దక్షిణాఫ్రికా లాగా మనదేశంలో బానిసత్వం లేదు, కానీ వృత్తులను ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ఉన్న వివక్ష బానిసత్వానికి తక్కువేం కాదు. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆర్ధికంగా, సామాజికంగా అగ్రవర్ణాలు, అట్టడుగు వర్ణాలు మధ్య అంతరం అచ్చం టూట్సి, హుటుల వ్యత్యాసాలలాగానే ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణ భాద్యతను చేపట్టిన అంబేత్కర్ తన బాల్యంలో స్వయానా వివక్షని ఎదుర్కొన్నవారు కావడంతో దీనిని రూపుమాపడానికి రెండు పరిష్కారాలు చూపారు. ఒకటి రిజర్వేషన్లు, రెండు దళితులకు ప్రత్యేక ఎలెక్టోరేట్ అంటే వారి సొంత ప్రతినిధులు. అంబేత్కర్ దళితులకు ప్రత్యేక దేశం కావాలని పట్టుబట్టినట్లు కొంతమంది రాజకీయనాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు లేవు. అంబేత్కర్ రిజర్వేషన్లను కూడా స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించారు. చదువులో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లో రిజర్వేషన్లు. అందరూ అనుకునేట్లు అంబేత్కర్ కేవలం పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు అమలుపరచాలని కోరుకున్నారనేది కూడా అపోహ మాత్రమే [4] . పదేళ్ల రిజర్వేషన్లు నిబంధన కేవలం రాజకీయాల్లో మాత్రమే పెట్టబడింది. అది కూడా రాజ్యాంగ సభ నిర్ణయం వల్ల అంబేత్కర్కి ఇష్టం లేకపోయినప్పటికీ, ఒకవేళ పదేళ్ల తర్వాత దళితులు రాజకీయాలలో అగ్రవర్ణాల స్థాయికి రాకపోతే పొడిగించుకునేలా వెసులుబాటు ఇచ్చి రిజర్వేషన్లు అమలుపరిచారు.
ఒకవేళ ఆ రోజు అంబేత్కర్ రిజర్వేషన్లకోసం పట్టుపట్టి అమలుపరచకపోయుంటే మనదేశంలో అంతర్యుద్ధం వచ్చిఉండేది. దానిలో అనుమానపడాల్సిన అవసరం లేదు. మనిషి చరిత్రే దానికి సాక్ష్యం. పలుగులు, పారలు పట్టిన చేతులు కత్తులు, తుపాకులు పడితే ఏమవుతుందో రువాండా మారణహోమం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. నేనేమి ఒక వర్గాన్ని హింసాత్మకంగా చూపించే ప్రయత్నం చెయ్యట్లేదు. ఈ తిరుగుబాటు మనిషి నైజం. అనివార్యం అనే ఆలోచన నుండి పుట్టే హింస అది. అంతర్యుద్ధమే వచ్చుంటే ఇండియా మరొక రువాండా అయ్యేది. వర్గాల ఆధారంగా ముక్కలయ్యి ఆకలితో పక్కదేశాలవైపు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి మన పుణ్యభూమి పుణ్యభూమిలాగానే ఉంది అంటే దానికి కారణం అంబేత్కర్ ముందు చూపుతో అమలుపరిచిన రిజర్వేషన్లు. అటువంటి అంబేత్కర్ని ఒక వర్గానికి మాత్రమే పరిమితం చెయ్యడం చూసి నాకు బాధ కలుగుతుంది. ఎవరైనా అంబేత్కర్ని వాళ్ళ నాయకుడు/మా నాయకుడు అని అంటే వాళ్ళ ముక్కు పగలగొట్టి మన నాయకుడు అనాలనిపిస్తుంది.
అసలు రిజర్వేషన్లు పెట్టకపోయుంటే ఏమయ్యేదో మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తే ఏమవుతుందో మాట్లాడుకుందాం. ఒక దశాబ్దంన్నర క్రితం నేను చుసిన ఒక సంఘటన గురించి చెబుతాను. పదో తరగతిలో స్నేహితులందరూ కలిసి పక్కఊరిలో జరుగుతున్న తిరునాళ్ళకు వెళదామని అనుకున్నాం. వెళ్లేదారిలో శ్రీరాంపురం అనే చిన్న గ్రామంలో మా స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేసి అక్కడినుండి తిరునాళ్ళకు వెళ్లాలనేది మేము వేసుకున్న ప్రణాళిక. వాడింటికి చేరుకున్నాం. సైకిళ్ళు స్టాండ్ వేసి లోపలి వెళ్తుంటే నా స్నేహితుడు మమ్మల్ని తన ఇంట్లోవాళ్ళకి పరిచయం చేసాడు. నన్నెప్పుడూ వాళ్ళు చూడకపోవడంతో నన్ను వివరాలు అడిగారు. మా నాన్నగారి పేరు, ఆయన ఏం చేస్తుంటారని. మా నాన్న హోటల్లో పనిచేస్తారని చెప్పాను. అదే ఊరినుండి మా బడికొచ్చే ఇంకో స్నేహితుడిని "లోపల ఖాళీ లేదు, నువ్వు బయటే ఉందమ్మా!" అని చెప్పారు. మా నాన్న కూలి రోజుకి వంద రూపాయలు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారి జీతం ఒక ఏడెనిమిది వేలు ఉండొచ్చు. ఒక కూలీ కొడుకుని ఇంట్లోకి తీసుకెళ్లి నీళ్లిచ్చిన వాళ్లు, చదువుకుని ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కొడుకుని బయట నిలబెట్టారు. దానికి కారణం ఇంట్లో ఖాళీ లేకపోవడం కాదు, బుర్రలో గుంజు లేకపోవడం అని అప్పుడు ఆ వయసులో అర్ధం కాలేదు. స్వాతంత్యం వచ్చి అరవైఏళ్ళయినా దళితుల పరిస్థితి ఇంకా మారలేదు అనడానికి నేను చూసిన సంఘటన ఒక సాక్ష్యం. గత పదేళ్లలో ఈ పరిస్థితి ఏమైనా మారిందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే రిజర్వేషన్లు ఉంచాలో తియ్యాలో అర్ధం అవుతుంది.
రిజర్వేషన్లు కొనసాగించడం వల్ల నష్టాలే లేవా అని అడిగితే లేవని అబద్దం చెప్పను. కానీ రిజర్వేషన్లు తీసివేయడం వల్ల కలిగే నష్టాలతో పోలిస్తే రిజర్వేషన్లు కొనసాగించడం వల్ల కలిగే నష్టాలు చాలా తక్కువ. రిజర్వేషన్ల వల్ల ఐఐటీ బాంబేలో సీటు కోల్పోయిన అగ్రకుల విద్యార్థికి ఆ తరువాతి స్థానంలో ఉన్న మంచి విశ్వవిద్యాలయంలో సీటు వస్తుంది అంతేగాని అప్పుడే పెట్టిన సి-గ్రేడ్ కళాశాలలోకి గెంటివేయబడడు కదా. ఐఐటీ బాంబేలో సీటు కోల్పోయి ఐఐటీ హైద్రాబాద్లో చదువుతున్న ఓపెన్ కేటగిరీ విద్యార్థి కంటే అసలు ఎంసెట్లో చుక్కలు పెట్టి క్వాలిఫై అయి అప్పుడే పెట్టిన ఇంటిపక్క కళాశాలలో సీటు రాని వారు ఎక్కువగా బాధపడిపోయి రిజర్వేషన్లు తమ జీవితాలను నాశనం చేశాయని తిట్టుకుంటున్నారు. మన దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రిజర్వేషన్లు లేవు కానీ మొత్తం ఉపాధిలో 5% కూడాలేని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మన ఆర్ధికవ్యవస్థని కుప్పకూలుస్తున్నాయని నేననుకోవడంలేదు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందడం లేదు అనే వాదనతో నేనూ ఏకీభవిస్తాను. కానీ దానికి పరిష్కారం రిజర్వేషన్లు తీసెయ్యడం కాదు. ఇప్పటికే క్రీమీ లేయర్ నిబంధన వెనకబడిన వర్గాల రిజర్వేషన్లలో అమలుపరుస్తున్నారు [5] . దీనిని అణగారిన వర్గాల రిజర్వేషన్లలో అమలుపరచడం అసాధ్యం అని సుప్రీమ్ కోర్ట్ తేల్చిచెప్పింది ( సవరణ: 2018 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రీమీలేయర్ అన్ని వర్గాల రిజర్వేషన్లకు అమలు చెయ్యబడతాయి). కాబట్టి ప్రత్యామ్యాయ పరిష్కారాలపై ద్రుష్టి పెట్టేలా రాజకీయనాయకులను ప్రేరేపించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వివక్ష, అంటరానితనం లాంటివాటిని ముందు అగ్రవర్ణాలు అని పిలవబడుతున్నవారు విడిచిపెట్టాలి. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు కాబట్టి రిజర్వేషన్లు ఉంచాలా తియ్యాలా అనేది ఒక రెండు మూడు దశాబ్దాల తర్వాత మాట్లాడుకుందాం.
లేదూ, రిజర్వేషన్లు నిజంగానే మనదేశ ఆర్ధికవ్యవస్థకి నష్టం కలిగిస్తున్నాయి అని వాటిని తీసేస్తే రాజకీయపార్టీలకు జరిగే నష్టం కంటే దేశానికే జరిగే నష్టమే ఎక్కువ. ఎందుకంటే చరిత్ర పునరావృత్తం అవుతుంది. అమెరికా, దక్షిణాఫ్రికా, రువాండా, ఆ తర్వాత ఇండియా.
Comments
Post a Comment