మీరు ఎప్పుడైనా ఆరంభశూరులు అనిపించుకొన్నారా?
కిషోర్ గారి సమాధానంతో ప్రేరేపింపబడి రాస్తున్న సమాధానం.
అది ఎముకలు కొరికే చలికాలం. మా అమ్మాయి పుట్టి పది రోజులయ్యింది. ప్రసూతి సెలవుల వల్ల (మగాళ్లకు ఇచ్చే సెలవులను ప్రసూతి సెలవు అనొచ్చా?) ఇంట్లోనే ఉన్నాను. అసలే చలికాలం, ఆపై చీకటి, సెలవులు. దానికి తోడు అత్తమామలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ దెబ్బకి బుర్ర తిరిగి కొంచెం పరిగెత్తి వస్తానని చెప్పి మంచిగా తయారయ్యాను.
"బయట -10 ఉంది. రోడ్డు కూడా గడ్డ కట్టేసింది", మా ఆవిడ ఆజ్ఞ లాంటి సలహా ఒకటిచ్చింది.
"నేనొక్కసారి డిసైడైతే.. "
"సర్లే వెళ్ళు. జారిపడ్డావంటే అప్పుడు చెబుతా." నా పంచ్ లైన్ పూర్తవ్వకుండానే సలహా కాస్తా హెచ్చరికగా మారింది.
"అల్లుడుగారు, బయట వాతావరణం బాలేదు కదా!", ఈ సారి మా అత్తగారి వంతు.
"అత్తయ్యగారు, మీకు కొత్త కాబట్టి అలాగే అనిపిస్తుంది, అసలు మీకు స్వీడిష్ లో ఒక సామెత చెప్పాలి.." అంటూ వారికి కొత్త సంస్కృతిని పరిచయం చేస్తుంటే ఈ విజ్ఞాన ప్రదర్శనలే వద్దు అన్నట్లు మా అమ్మాయి కూడా మొహం పెట్టింది.
ఇక అంతకుమించి మాట్లాడితే ఇంట్లో ఉన్న నలుగురు తాడేపల్లిగూడెమోళ్ళు ఒకటైపోతారేమోనని వాళ్ళను పట్టించుకోకుండా ఒక ఐదు నిముషాలు వార్మ్ అప్ చేశాను. "ఇంటికొచ్చినప్పుడు కనీసం చేతిలో సూట్ కేసు కూడా అందుకోలేదు, వీడికి రన్నింగ్, దానికి ముందు వార్మ్ అప్ ఒకటి" అన్నట్లు చూస్తున్నారు మావయ్యగారు.
ఇక నెమ్మదిగా పరుగందుకుని ఒక పదడుగులు వేసాను. చలి తెలుస్తుంది. ఇంకొంచెం పరిగెడితే ఒంట్లో వేడి పుట్టి చెమటలు పట్టేస్తాయిలే అనుకుని ముందుకెళ్లాను. ఈసారి ఆయాసం మొదలయ్యింది. పరిగెత్తి చాలా రోజులయ్యింది కదా అనుకుని మళ్ళీ కొనసాగించాను. కార్ పార్కింగ్ దగ్గరికొచ్చేసరికి ఊపిరితిత్తుల్లో కిరసనాయిలు పోసి నిప్పెట్టేసినట్లు మంట మొదలయ్యింది. అక్కడితో ఆపేసి నెమ్మదిగా రెండు నిమిషాల్లో ఇంటికి నడుచుకుంటూ వచ్చి కాలింగ్ బెల్ కొట్టాను.
"అప్పుడే వచ్చేసారేంటి అల్లుడుగారు?" అంటూ తలుపు దగ్గరే అత్తగారు కుసలమడిగారు.
"వాటర్ బాటిల్ మర్చిపోయాను" అని చెప్పి సోఫాలో కూలబడ్డాను. కాసేపటికి వేడి వేడి టీ తీసుకొచ్చి తాగేసాక వెళ్లి పడుకోమని చెప్పారు.
Comments
Post a Comment