కులాల ప్రకారం జనగణన చేయడం మంచిదా కాదా?

 జనాభా లెక్కల్లో కులగణన మంచిదో కాదో చెప్పేంత సామాజిక జ్ఞానం నాకు లేదు. ప్రస్తుతం పదేళ్లకొకసారి జరిగే జనాభా లెక్కల్లో జనాభా, కుటుంబ ఆర్థికాంశాలు, విద్య, భాష, మతం, వలసలు లాంటివాటితో పాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గణాంకాలు లెక్కిస్తారు. కానీ తరువాతి జనగణనలో ఈ క్రింది కారణాల వల్ల సంపూర్ణ కులగణన కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను.

  • రిజర్వేషన్లు:

ప్రస్తుతం మనదేశంలో అత్యంత వివాదాస్పదమైన అంశం రిజర్వేషన్లు. వాటికి మద్దతిచ్చేవాళ్ళు "రిజర్వేషన్లు అందుతున్నప్పటికీ అణగారిన వర్గాలు ఇంకా సామాజికంగా ఆర్ధికంగా మిగిలిన వర్గాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నారు" అంటున్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించేవాళ్ళు "రిజర్వేషన్లు పొందేవాళ్ళు ఈ డబ్భై ఏళ్లలో మిగిలినవాళ్లను దాటేశారని, అవి దుర్వినియోగం అవుతున్నాయి" అని అంటున్నారు. ఈ రెండు వర్గాలు చెప్పే మాటలకు ఆధారం ఎప్పుడో స్వాతంత్రం రాకముందు చేసిన కులగణన, లేదా శాంపిల్ డేటా ద్వారా ప్రాజెక్ట్ చేసిన రిపోర్టులు, అవి కూడా కాకపోతే వాళ్ళ స్నేహితులు, ఎదురింట్లో, పక్కింట్లో ఉండే పేద, ధనిక ఎస్సీ, ఎస్టీలు. అసలు ఎవరి మాటల్లో నిజాలున్నాయో తెలియాలంటే కేవలం ఒక వర్గం స్థాయిలో కాక కులం, ఉపకులం స్థాయిలో గణన జరగాలి. వీటి ప్రకారం క్రీమి లేయర్ లో సవరణలు చేసుకుని రిజర్వేషన్లు దుర్వినియోగం అవ్వకుండా అరికట్టవచ్చు.

  • లింగ నిష్పత్తి:

ప్రస్తుతం ఉన్న లింగ నిష్పత్తి గణాంకాలు మతం, రాష్ట్రము స్థాయిలో ఉన్న లెక్కలు. కానీ మనదేశంలో దాదాపు ప్రతీ అంశం కులం, ప్రాంతంతో ముడిపడి ఉంటున్నాయి. 2018లో లక్ష అరవై వేలమంది మంది మీద జరిగిన ఒక సర్వేలో 93 శాతం మంది తమ పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకున్నారని చెప్పారు [1]. వాటిలో దాదాపు అన్నీ తమ కులంలో కుదుర్చుకున్న సంబంధాలే అయ్యుండొచ్చు. అలాంటప్పుడు లింగ నిష్పత్తి వివరాలు కూడా కులం ఆధారంగా అందిస్తే అసలు పరిస్థితి ఎలా ఉందొ తెలుసుకునే అవకాశం ఉంటుంది.

  • నిరాధార ప్రచారాలు:

గత ఐదేళ్ళలో ఎక్కువగా వింటున్న ప్రచారం లవ్ జిహాద్. 2001 లో జనగణన ప్రకారం 0-6 ఏళ్ళ వయసు(అంటే ప్రస్తుతం పెళ్లి వయసుకు వచ్చినవారు)లో లింగ నిష్పత్తి హిందువులలో 925, ముస్లిములలో 950 ఉంది[2] . అంటే సంభావ్యత పరంగా చూస్తే హిందూ అబ్బాయిలే ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే అసలు నిజానిజాలు ఎంతున్నాయో తెలియదుగాని ఈ ప్రచారాల ఆధారంగా ఏకంగా కొత్త చట్టాలు కూడా వచ్చేసాయి. చట్టాలే వచ్చినప్పుడు జనాభా లెక్కల్లో ఈ వివరాలు కూడా సేకరిస్తే అసలు దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది.

  • వర్గీకరణ అపోహలు:

రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలలో కూడా వర్గీకరణ ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని కొన్ని కులాలవారు అడగడం హేతుబద్దంగా ఉంది. పైగా వర్గీకరణ చేస్తే జాతి మధ్య విభేదాలు వస్తాయంటూ మరో వర్గం చెబుతున్న మాటలు హేతుబద్దంగా లేవు. ఎందుకంటే అటువంటి భావ వైరుధ్యాలు వర్గీకరణ ఉన్న వెనకబడిన కులాలలో కనిపించడంలేదు కదా. వర్గీకరణ జరగాలంటే కులాల, ఉపకులాల ప్రకారం జనగణన జరిగితేనే సాధ్యమని నా అభిప్రాయం.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?