మిమ్మల్ని జడ్జ్ చెయ్యము అని మాటిస్తే, ఈ వేదికలో మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు ?
"వీడు ప్రతిసారీ ఇలాగే చేస్తాడేమో"నని మీరనుకోరని ఆశిస్తూ నేను చేసిన ఘనకార్యం ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
కాలేజీలో చదివేరోజుల్లో రోజూ కాలేజీకి వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి రోజుకి పది రూపాయలు ఇచ్చేవారు. తెలిసినవాళ్ళు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఆ డబ్బులు నా సొంత అవసరాలకి పనికొచ్చేవి, లేకపోతే ఆటో ఛార్జీలుగా కొట్టుకుపోయేవి. అందుకే స్నేహితులతో ఎప్పుడైనా కాంటీన్కి, రెస్టారెంట్కి వెళితే అక్కడ నా వాటా తియ్యమని ఎవరూ అడిగేవారు కాదు, నేను కూడా ఇచ్చేవాడిని కాదులేండి.
కానీ ఉద్యోగమొచ్చాక చేతిలో విచ్చలవిడిగా డబ్బులాడడంతో అలవాట్లు మార్చుకున్నాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో మా కంపెనీవాడు గంపగుత్తగా ఏరుకుని తెచ్చుకోవడంతో చాలామంది స్నేహితులకు మళ్ళీ ఉద్యోగజీవితంలో కూడా తుమ్మబంకలాగా తగులుకున్నాను. ఆ మిత్రబృందంలోని ఒకమ్మాయి చాలా రోజుల తర్వాత ఇంటికెళ్తున్నానని, లగేజ్ ఎక్కువ ఉంది కోయంబేడు వెళ్ళడానికి సాయం చెయ్యమని అడిగింది. ప్రాజెక్ట్ లేకపోవడంచేత గదిలో కూర్చుని సినిమాలు చూడడం తప్ప ఇంకేం పనిలేదు కదా అని సరేనన్నాను.
రెండే బ్యాగ్గులని చెప్పిందిగాని వెళ్లి చూస్తే ఒక చిన్న కుటుంబం ఇల్లు మారేటప్పుడు ఉన్నంత లగేజీ ఉంది. వాటిని మోసుకెళ్లి కోయంబేడులో పడేసేటప్పటికి సాయంత్రం ఆరయ్యింది. బస్సుకి ఇంకా గంటపైగా ఉండడంతో పక్కనే ఉన్న రెస్టారెంట్లో తినేద్దామని వెళ్లి కూర్చున్నాం. ప్రయాణంలో ఇబ్బందవుతుందని తానేమి పెద్దగా తినలేదు. నేను మాత్రం రెండ్రోజులకి సరిపడా తినేసి బిల్లు పట్రమ్మని చెప్పాను. వెయిటర్ బిల్లు తీసుకొచ్చి బల్లపై పెట్టి వెళ్ళిపోయాడు. మూడొందల చిల్లర అయ్యింది. అంతే కదా అనుకుని నా పర్సు తెరిచి చూస్తే...... యాభైయేడు రూపాయలున్నాయి. కార్డు కూడా కనిపించలేదు. ఇప్పుడుగాని తనని బిల్లు కట్టమంటే "వీడు మారడు" అనుకుంటుందేమోనని భయమేసింది.అప్పుడే చిన్నపుడు చదువుకున్న "రంగస్థలంపై సమయస్ఫూర్తి" గుర్తొచ్చి బిల్లు నేను కడతానన్నాను.
"నా పని కోసం కదా పిలిచింది, నేనే కడతా" అని పుస్తకం తను లాక్కుంది.
"ఇదేమీ కాలేజ్ కాదు, ఇటివ్వు" అని మరోవైపు నేను పట్టుకున్నాను.
"లేదు! నేను"
"కాదు! నాది"
"ఓవరాక్షన్ చెయ్యొద్దు"
"ఇస్తావా ఇవ్వవా?"
"ఇవ్వను"
"సరే, కట్టేయ్ ఐతే!" అని పుస్తకం వదిలేసి నాలో నేనే మురిసిపోయాను.
తనని బస్సెక్కించి తిరిగి నేను గదికొచ్చేసిన తర్వాత నా తెలివితేటలకి మెచ్చుకుంటాడేమోనని మరో స్నేహితుడికి జరిగింది చెప్పాను. వాడు నాకు వెన్నుపోటు పొడిచి మిగతావారికి జరిగింది చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడు బయటకెళ్లినా బిల్లు కడతానని ఎవ్వడూ ముందుకొచ్చేవాళ్ళు కాదు.
Comments
Post a Comment