మీరు ఇంజినీరింగ్ చదవాలి అని ఎందుకు అనుకున్నారు? మీ కోర్సును ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటి?
ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చదవాలని నేనుగాని, నా తల్లిద్రండ్రులుగాని ఏమి నిర్ణయించుకోలేదు. చుట్టాల ప్రోద్బలంతో నన్ను ఇంటర్లో చేర్చిన తర్వాత ఇంటర్ కూడా ఒక మోస్తరు మార్కులతో పూర్తి చేశాను. ఎంసెట్ పరీక్ష రాసాను, ఎలా రాశావని ఇంట్లో అడగలేదు, చుట్టాలు అడిగితే బీరాలు పలికేసాను. పరీక్ష ఫలితాలు రాకముందే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీకి అప్లికేషన్లు ఇస్తున్నారని తెలిసి ఒకటి తెచ్చుకుని నింపేసి ఎప్పటిలాగానే మా నాన్నగారి సంతకం నేనే పెట్టేసుకున్నాను.
ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. అనుకున్నదానికంటే మంచి ఫలితమే వచ్చింది కానీ మరీ గొప్ప ర్యాంకేమి కాదు. కానీ ఊళ్ళో మిగిలినవాళ్లతో పోల్చుకుంటే ఆ అంకె మంచిగా కనిపించేటప్పటికి చుట్టాలూ, మా నాన్నగారి స్నేహితులు పాల అర్జునరావుగారు నన్ను ఇంజనీరింగ్ చదివించమని బలవంతపెట్టారు. ఆ విధంగా నేను ఖచ్చితంగా ఇంటినుండే కాలేజీకి వెళ్ళాలి అనే ఒక నియమంతో ఇంజనీరింగ్లో చేర్చడానికి ఒప్పుకున్నారు.
బ్రాంచ్ ఎంచుకోవడంలో మా ఇంట్లోవాళ్ల ప్రమేయం ఏం లేదు. సివిల్, మెకానికల్ లాంటివి సినిమాల్లో ఎక్కువగా వచ్చేవే కాబట్టి వాటిమీద కొంచెం అవగాహన ఉంది తప్ప ఇక మిగిలిన బ్రాంచ్ల గురించి అసలేమీ తెలియదు. అర్జునరావుగారి అబ్బాయిని అడిగితే ఆ సమయానికి ఈసీఈ మంచిది అని చెప్పాడు. కానీ ఈసీఈలో ఎలక్ట్రానిక్స్ అనే పదం విని భయమేసి దాని తరువాతది సిఎస్సిలో ప్రోగ్రామింగ్ లెక్కలాగానే ఉంటుందని చెప్పడంతో అది మంచిదని నిర్ణయించుకున్నాను. ఆవిధంగా కాలేజ్, బ్రాంచ్ నిర్ణయింపబడ్డాయి. కౌన్సిలింగ్లో నాకు కావాల్సిన కాలేజీ, బ్రాంచ్ చెప్పి సీట్ కంఫర్మ్ చేసుకుని మారు మాట్లాడకుండా ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చాక కొంతమంది మళ్ళీ కౌన్సిలింగ్ కి వెళ్లి ఈసీఈ తీసుకొమ్మని బలవంతపెట్టారుగాని నేను ఇష్టపడలేదు.
సిఎస్సిలో కంప్యూటర్ అవసరం ఉంటుందని తెలిసి కూడా కొనలేక ఇబ్బంది పడుతుంటే కొంతమంది చుట్టాలు నాకు కంప్యూటర్ కొనిపెట్టారు. నా స్నేహితుడి అన్నయ్య Mani Kumar Akasapu సీ ప్రోగ్రామ్మింగ్స్లో నా మొట్టమొదటి గురువు. వాళ్లకు ఫోటో స్టూడియో ఉండేది. దానికోసమే వాళ్ళు సీ లైబ్రరీలో stdio.h రాసారనుకుని నేను ఇంటికొచ్చి నా ప్రోగ్రాంలో home.h అని రాసుకుని కంపైల్ అవ్వట్లేదని బుర్ర బద్దలుకొట్టుకోవడంతో నా ప్రోగ్రామింగ్ ప్రయాణం మొదలయ్యింది.
Comments
Post a Comment