హిందూ దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుండి ఎందుకు విముక్తి కలిగించాలి?
లౌకిక రాజ్యంలో ప్రభుత్వం మీద మత పెత్తనం, మతం మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదనేది నా అభిప్రాయం. అందుకే దేవాలయాల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదనే వారిలో నేను కూడా ఉన్నాను. .దీనివల్ల హిందూ మతానికి కలిగే ప్రయోజనం ఇప్పటికే చాలా చోట్ల చదివేఉంటారు కానీ అటువంటివారు ప్రస్తావించిన సమర్ధింపులో నాకున్న కొద్దిపాటి అభ్యంతరాలకు సమాధానం దొరకలేదు. ఈ సమాధానంలో వాటిని ప్రస్తావించాలనుకుంటున్నాను. వాటిగురించి తెలిసినవారెవరైనా వ్యాఖ్యల్లో తమ వివరణను ఇవ్వగలరు.
ఆదాయ అసమానతలు:
రాజమండ్రి జాంపేటలో ఒక పెద్ద మసీదు ఉంది. ఆక్రమణలో చాలా వరకూ తుడిచిపెట్టుకుపోయినప్పటికీ మిగిలిన కొద్దిపాటి వక్ఫ్ భూములు, అద్దె షాపులతో వచ్చే ఆదాయం మసీదు విర్వహణకంటే ఎక్కువే ఉండొచ్చు. రాజమండ్రికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామంలో చిన్న మసీదు ఉంది. దీనికి కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులుండవు. అయినప్పటికీ పెద్ద మసీదునుండి చిన్న మసీదుకు సాయమేమీ అందదు.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని దేవాలయాలున్నాయో కచ్చితమైన సమాచారం దొరకలేదు. చిన్నవీ, పెద్దవీ కలుపుకుని ఎనిమిది నుండి పది వేల దేవాలయాలు ఉండొచ్చని అనుకుంటున్నాను. మరి వీటిలో ఎన్ని దేవాలయాలకు ఆర్ధికంగా స్వీయ నిర్వహణ చేసుకునే ఆదాయం ఉంది? బహుశా ఒక పదిశాతం దేవాలయాలకు ఉండొచ్చేమో. ఒకవేళ ప్రయివేట్ పరం అయితే అధిక ఆదాయం వచ్చే దేవాలయాలు రాష్ట్రంలోని మిగిలిన గుళ్ళకు నిర్వహణ ఖర్చులిస్తాయా? లేక వాటి నిర్వహణ అవే చూసుకోవాలా?
అవినీతి:
పై ముగ్గురు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళు చేసేదీ ప్రైవేటుగా దైవ సేవే. కానీ దానిలో కొంత(ఎక్కువ) స్వయంపోషణే కనిపిస్తుంది. ఒకవేళ అధిక ఆదాయమున్న దేవాలయాల్లో నియంత్రణ లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు చేసే దుర్వినియోగం కంటే తక్కువ దుర్వినియోగం అవుతుంది అని ఏ ఆధారంగా చెప్పగలరు?
మా గ్రామంలో రోడ్డుకి ఒకవైపు వినాయకుని గుడి, మరోపక్క చర్చి ఉన్నాయి. గుడి ప్రభుత్వ ఆధీనంలో ఉంటే చర్చి ప్రయివేటుది. ప్రస్తుతం ఆ చర్చికి చెందిన ఖాళీ స్థలంలో అద్దె షాపులు కట్టి ఆ ఆదాయం ఆ పాస్టరు తీసుకుంటున్నారు. గుడిని కూడా ప్రైవేటుపరం చేస్తే గుడి కమిటి అలా చెయ్యకుండా ఎవరాపుతారు?
ముదునూరుపాడు అనే వూళ్ళో ఒక పెద్ద క్రైస్తవకూటమి, వారి చర్చి ఉన్నాయి. అక్కడ సభ జరిగినప్పుడల్లా లక్షల్లో విరాళాలు వస్తాయి. వాటిని ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి నేను సహ చట్టాన్ని వాడుకోలేను. మరి దేవాలయాలు ప్రైవేట్ పరం అయితే వాటికి సహ చట్టం వర్తిస్తుందా?
మానవ హక్కుల ఉల్లంఘన:
మా నాన్నగారి ముస్లిం స్నేహితుడికి హిందూమతంపై నమ్మకం ఉండేది. మా నాన్నగారితోపాటూ భవానీమాల వేసుకునేవారు. కానీ దశాబ్దం క్రితం ఆయన చనిపోయినప్పుడు ఆయన శవాన్ని మసీదు దగ్గరున్న స్మశానంలో పూడ్చడానికి ఆ మతపెద్దలు ఒప్పుకోలేదు. చివరికి సర్పంచి వచ్చి అడిగినా మా సొంత స్మశానం మా ఇష్టమని సమాధానము చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల/సంఘాలలోని నియమాలు పూర్తిగా వారి వ్యక్తిగతం. నేనుంటున్న దేశంలో నల్లరంగులో ఉన్నాను కాబట్టి నాకు ఇల్లు అద్దెకు ఇవ్వనని చెబితే నేను చెయ్యగలిగిందేం లేదు. ఎవరిల్లు వాళ్ళిష్టం అనుకోవడం తప్ప. అలాగే ప్రైవేటు ఆధీనంలోని కొన్ని దేవాలయాల్లో కేవలం ఒక కులం/కొన్ని కులాల వారిని మాత్రమే అనుమతించే దుస్సాంప్రదాయం ఉంది. [1] ఒకవేళ అన్ని దేవాలయాలూ ప్రైవేట్ పరం అయితే ఇటువంటి సంప్రదాయాలు మరిన్ని దేవాలయాల్లో రావని గ్యారెంటీ ఏమిటి?
వారసత్వం:
మనదేశంలోని ప్రముఖ దేవాలయాలన్నీ రాజులు, మహారాజుల పరిపాలనలో ప్రజలమీద వేసిన పన్నులతో కట్టించినవే కదా. వాటిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నా పూర్వీకుల పాత్ర అణువంతైనా ఉంటుంది. ప్రస్తుతం కూడా నా సంపాదనలో కొంత భాగం నా కుటుంబం ద్వారా దేవాలయాలకు వెళుతుంది. అటువంటి వారసత్వ సంపద ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కంటే మంచిగా నిర్వహింపబడతాయని నేను ఏ విధంగా నమ్మాలి?
Comments
Post a Comment