మీ పరువు పోయినా ఆనందంగా నవ్వుకున్న సందర్భము పంచుకోండి?

 మళ్ళీ బడి రోజుల కధే!

బడి నుండి సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఇంటి గుమ్మానికి గొళ్ళెం పెట్టి ఉంది. గొళ్ళెం తీసుకుని లోపలికి వెళ్తుంటే ఒక స్నేహితుడొచ్చి "సాదూపేటలో హోలీ చేసుకుంటున్నారంట! వస్తారా?" అని అరిచాడు. సినిమాల్లో చూడడం తప్ప జీవితంలో ఎప్పుడూ హోలీ ఆడని మాకు ఆత్రుత ఎక్కువైపోయి సంచులు గుమ్మం దగ్గరే పడేసి యూనిఫామ్ కూడా మార్చకుండానే పరిగెత్తాము.

అక్కడికెళ్లి చూస్తే సినిమాల్లో చూపించినట్లు ఎవరూ స్లో మోషన్లో పరిగెత్తడంలేదు. నాలుగు పక్కలనుండీ రంగుల బాంబులు పేలి మధ్యలో హీరో అరంగేట్రం కూడా జరగలేదు. మరీ ముఖ్యంగా ఒకే ఒక రంగు నీళ్లు ఉన్నాయి. మేమెళ్లి వాళ్ళ మధ్యలో దూరేలోపే అవి కూడా అయిపోయాయి.

సరదాను ఆపడం ఇష్టంలేని ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళింటిదగ్గర ఇంకా రంగుందని చెప్పి రెండు బకెట్లు పట్టుకొచ్చారు. ముందు కలిపిన నీళ్ళకంటే ఇది చిక్కగా ఉంది. ఒకటే రంగైతే మోనాటనీ వస్తుందని మరొకడు వాడింటికెళ్లి ఇంకోటేదో తెచ్చాడు. అక్కడున్న పిల్లలందరూ తడిచి పావనమైపోయారు.

మరోపక్క ఇంటిదగ్గర సంచులు మాత్రమే చూసి "ఆడుకోవడానికి వెళ్లుంటారు లే!" అనుకున్న అమ్మకు మేమెంతసేపటికీ రాకపోయేటప్పటికి చిరాకు కాస్తా అసహనం స్థాయికి చేరుకుంది. సరిగ్గా అప్పుడే బొగ్గుగనిలో పని పూర్తి చేసుకున్న ఇద్దరు బాల కార్మికులు ఆవిడ ముందుకొచ్చి "అమ్మా!" అని పిలిచారు.

తేరుకుని మమ్మల్ని గుర్తుపట్టిన మా అమ్మగారు యూనిఫామ్ మాసిపోతే పిల్లలు ఇబ్బందిపడతారని గ్రహించి అప్పటికప్పుడు ఉతకడం ప్రారంభించారు. ఆ కంగారులో వాటిలో మేమున్నామన్న సంగతి కూడా మర్చిపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఆ దెబ్బకి మళ్ళీ హోలీ ఆడడానికి 15 ఏళ్ళు పట్టింది.

ఇదంతా టికెట్ లేకుండా చూస్తున్న మా ఇంటి ఓనర్గారి పిల్లలు కూడా మా దరిద్రం కొద్దీ ప్రపంచంలో ఇంకెక్కడా బడులే లేవన్నట్లు మా బడిలోనే చదివేవాళ్ళు. ఆ రోజు నుండి మమ్మల్ని చూసి వాళ్లో వెకిలినవ్వు, అది చూసి మేమొక సిగ్గులేని నవ్వు నవ్వుతుండేవాళ్ళం. చాలా రోజుల తర్వాత ఎప్పటికో మళ్ళీ కలిస్తే "రంగు పోయినట్లుందేంటి?" అని అడిగింది. నవ్వాపుకోడానికి అరగంట పట్టింది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?