మీ నాన్నగారితో మీకున్న అనుభవాల్లో ఎప్పుడూ గుర్తుచేసుకునే అనుభవం ఏమిటి?

 "ఒరేయ్! ఒకవేళ నువ్వుంటున్న దేశానికీ, మనదేశానికీ యుద్ధం జరిగితే నువ్వు ఎవరికి మద్దతిస్తావు?" నా దేశభక్తికి కఠినపరీక్ష పెడదామని పోసుపోలు కబుర్ల మధ్య నా స్నేహితుడు నన్నడిగిన ప్రశ్న. సమాధానం గురించి మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చిన్నప్పుడే ఒక సందర్భంలో మా నాన్న చెప్పిన మాటొకటి గుర్తొచ్చింది.

నైట్ డ్యూటీ చేసి ఎప్పుడూ తర్వాతి రోజు మధ్యాహ్నం ఇంటికొచ్చే నాన్న ఆ రోజు తెల్లారగట్లే వచ్చేసారు. మాకు వినిపించకుండా అమ్మతో ఎదో దిగాలుగా మాట్లాడుతుంటే అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఏం జరిగిందని అడిగితే "ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉందని వచ్చేసాను" అని నాన్న సమాధానం చెప్పారు. మరోపక్క అమ్మ కళ్ళలో మరోసారి కన్నీళ్లు. "పూలమ్మిన చోట కట్టెలమ్మలేక ఇంత దూరం వస్తే ఇక్కడ ఇంత అవమానం జరిగింది" అని తిట్టుకుంటుంది. "ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు" అని అమ్మని అడిగితే "ఓనర్గారి మేనల్లుడికి నాన్నకి గొడవ జరిగిందంట. తోపులాటలో నాన్న కిందపడిపోయారు." అని సమాధానం చెప్పింది.

ఆ అబ్బాయి నాకంటే ఒక ఐదారేళ్లు పెద్దోడేమో! నేను బళ్ళో చదివే సమయానికే ఏడు ఫెయిలయ్యి గాలి తిరుగుళ్ళు తిరిగేవాడు. ఓనర్ గారి పెద్దమ్మాయిని పెళ్లి చేస్తామని మాట ఇవ్వడంతో అక్కడ తిరుగుతూ వర్కర్ల మీద పెత్తనం మొదలెట్టాడు. అమ్మ చెప్పిన సమాధానం వినగానే నేనూ ఏడుపు మొదలెట్టాను. ఆ కోపంలో నా నోటినుండి మొదటిసారి బూతులు వచ్చేసాయి. సరాసరి ఓనర్గారినే తిట్టేసాను, ఆ పనికిమాలినోడికి పెత్తనం ఇచ్చినందుకు. అప్పుడే నాన్న నావైపు కోపంగా చూసారు. బూతులు మాట్లాడినందుకేమోనని నేనూ నిదానించి వాళ్లతోపాటే కూర్చుండిపోయాను. ఆ తర్వాత నన్ను దగ్గరికి తీసుకుని "నాన్నా! గొడవ పెట్టుకుంది నేనూ, ఓనరుగారి మేనల్లుడూ! దీనిలో ఓనరుగారికి సంబంధం లేదు. కానీ ఒకవేళ నిజంగానే నేను ఓనరుగారూ గొడవ పడినా కూడా నువ్వు ఆ మాట అనడానికి సరిపోవు. మన కుటుంబానికి ఐదేళ్లు తిండి పెట్టాడాయన." అన్నారు.

సవాలక్ష ఆలోచనల మధ్య ఆ జ్ఞాపకం కళ్ళ ముందు కదలడంతో నేను చెప్పాల్సిన సమాధానం అర్ధమయ్యింది. ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే మా అమ్మ భారతదేశానికీ, నా కూతురు తన దేశానికీ మద్దతు పలకాలి. వాళ్లిద్దరి మధ్య నేను మౌనంగా తిట్లు తింటూ తటస్థ వైఖరి తీసుకోవాలి.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?