ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఎదురయ్యే మోసాలు ఏమిటి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 "జాబుకి నోటంటే అది మన జేబుకి చేటు." అనే ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలా మోసాలనుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గత పదేళ్లలో నాకు తెలిసి నా పరిచయస్తులు ఎదుర్కొన్న మోసాలివి.

  • డేటా ఎంట్రీ ఉద్యోగం: "పది/ఇంటరుతోనే ఇంటి దగ్గరే ఉంటూ నెలకు ముప్పై వేలు సంపాదించే అవకాశం" అంటూ ఒకప్పుడు ఆర్టీసీ బస్సు సీట్ల వెనక, ఇప్పుడు స్పామ్ ఇమెయిళ్లలో, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నూరుశాతం నకిలీవే. వాడిచ్చిన ఫొటోలోని సమాచారం టైపు చేసిస్తే డబ్బులిస్తామని చెప్పి, సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంటారు. మీరు అక్షరం పొల్లుపోకుండా టైపు చేసినా మీకు పైసా కూడా రాదు. ఒక నెలరోజుల తర్వాత విషయం అర్ధమౌతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ మరీ పెద్దది కాదు కాబట్టి చేసేదేం లేక వదిలేస్తారు.
  • ఫ్రీ లాన్సింగ్ మోసాలు:
    • ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్లలో ప్రాజెక్ట్ మనకి అప్పగించాలంటే ముందుగా 10% సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలి అని అడుగుతారు. కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్ కనిపించదు.
    • మన పని సామర్ధ్యం తెలియడానికి ముందుగా ఫ్రీ డెమో చెయ్యమని అడుగుతారు. ఆ విధంగా వారికీ అవసరమైన పని ఉచితంగా చేయించుకుని ఆ తర్వాత మన పని నచ్చలేదని చెప్తారు.
  • విదేశాల్లో ఉద్యోగాలు:
    • రష్యాలో డ్రైవర్ ఉద్యోగాలు, దుబాయిలో మేనేజర్ ఉద్యోగాలు, కెనడా వీసాలు అని ప్రకటనలు వస్తుంటాయి. ఆ జీతాల ఉచ్చులో పడ్డారో మీ జేబుకు చిల్లు పడ్డట్లే. ఒక్కసారి మన పాసుపోర్టు వాళ్ళ చేతిలోకెళ్ళిందంటే ఇక విడిపించుకోవడం కష్టం. ఇలాంటి ఏజెన్సీలకు దూరంగా ఉండండి.
    • విదేశాల్లో పనిచేసే అపరిచితుల దగ్గర "ఎంత ఖర్చైనా మా వాడిని మీ దేశం తీస్కెళ్ళిపో బాబూ" అని చెప్పి వాళ్ళకి లేనిపోని ఐడియాలివ్వొద్దు.
  • బ్యాక్ డోర్ ఉద్యోగాలు: ఇటువంటి ఉద్యోగాలు పొందడం ప్రస్తుత పరిస్థితులలో అసాధ్యం. ఒకవేళ వచ్చినా ఉద్యోగం చేసినంతకాలం ఎప్పుడు దొరికిపోతామో అనే ఆందోళనతో బతుకుతుండాలి. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?