మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అధ్వానమైన ప్రయాణ అనుభవాలు ఏమిటి?

 సంక్రాంతికి అమ్మమూరు వెళితే అర్జెంటు పని ఉందని మా అమ్మ నన్ను అక్కడే వదిలేసి నాన్న వచ్చి తీసుకొస్తారని చెప్పి రాజమండ్రి వెళ్లారు.

పండగ అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లడానికి మా నాన్నగారు వచ్చారు. తర్వాతి రోజు ప్రయాణం, మధ్యాహ్నం బీవారం నుండి రాజమండ్రికి రైలు. రైలుకి రెండు గంటలు ముందే ఉండాలన్నది మా తాతగారి పాలసీ. కొడుకైనా, అల్లుడైనా, మనవడైనా రూలంటే రూలే కాబట్టి పొద్దునే బయల్దేరిపోయాము. కర్ణాటకలో తుక్కులాగా అమ్మబడి, మళ్ళీ ఆంధ్రలో రిజిస్ట్రేషన్ చేయబడి బీవరం, కాళీపట్నం మధ్యలో వయ్యారంగా తిరిగేసే డొక్కుబస్సులో గంటన్నరలో పదిహేడు కిలోమీటర్లు జెట్ స్పీడుతో ప్రయాణించేసాక బీవరం వచ్చేసాం. బండికి ఇంకా మూడు గంటలుంది. వేరే ఎవరితో వచ్చినా స్టేషను వరకు నడుచుకుంటూ వచ్చేసి బండి బయల్దేరేవరకు అక్కడే స్టేషన్ మాస్టారుకి కంపెనీ ఇచ్చేవాడ్ని. కానీ నా పక్కనుంది ఒకప్పటి సినిమాహాలు ఓనర్.

"మార్నింగ్ షో చూసి వెళ్దామా నాన్నా? రైలుకి ఇంకా చాలా టైముంది కదా!!" మా నాన్నగారు ఆ మాటనగానే ఎక్కడలేని సంతోషంతో సరేనని తలూపాను. మావుళ్ళమ్మగుడి నుండి కుడి వైపుకి తిరిగి స్టేషన్కి వెళ్లాల్సిన వాళ్ళం తిన్నగా సినిమాహాలుకి వెళ్లిపోయాం. మార్నింగ్ షో జూనియర్ ఎన్టీఆర్ సుబ్బు సినిమా. ఇంకో రెండు నిమిషాల్లో షో పడుతుందన్నా టిక్కెట్లు దొరికేసాయి. కారణం సినిమా మొదలైన కాసేపటికే అర్ధం అయ్యింది కానీ బయటకొచ్చి చేసేదేం లేదు కాబట్టి అక్కడే ఉండిపోయాం. సినిమా తర్వాత స్టేషన్కి వెళ్తే రైలెళ్ళిపోయిందన్నారు. తర్వాతి రైలు ఎన్నింటికో కనుక్కుని మళ్ళీ రోడ్లపై పడ్డాము. హోటల్లో భోంచేసేసి మాట్నీకి "టక్కరి దొంగ" కి చెక్కేసాం. మాట్నీ అవగొట్టుకుని బయటకొచ్చి సినిమా బాగుందని చెప్పినందుకు ఆ నాన్న "ఇక నా దగ్గర ఎం నేర్చుకున్నావు రా?" అన్నట్టు ఒక చూపు చూసి స్టేషన్కి వెళదామని టైం చూసుకున్నారు. ఇక స్టేషన్కి వెళ్ళక్కర్లేదనే విషయం అర్ధమయ్యాక బయటున్న హోటల్లో తీరిగ్గా అయన టీ, నేను పాలు తాగేసి ఈసారి ఫస్ట్ షోకి టెండర్ పెట్టాం. టిక్కెట్లు తీసుకునేటప్పుడు "మనం రెండుగంటల తర్వాత స్టేషన్కి వెళ్ళిపోవాలి గుర్తు పెట్టుకో బిజిలూ, లేకపోతే తర్వాతి రైలు కూడా" అని నిబంధన పెట్టి లోపలోకి తీసుకెళ్లారు. సినిమా చివర్లో శ్రీహరిగారు ఆ తెల్లోడిమీద గెలుస్తాడో లేదోనన్న ధ్యాసలో ఉండి రైలు సంగతి మర్చిపోయాను.

బయటకి వచ్చాక పరిస్థితి అర్ధమయ్యి తిరిగి అమ్మమూరు వెల్దామనుకుంటే ఇప్పుడు ఆ జెట్ స్పీడు బస్సు ఉంటుందో ఉండదో అని అనుమానమొచ్చి ఆ ఆలోచన విరమించేసుకుని రాజమండ్రికి బస్సెక్కేద్దామని నిర్ణయించుకుని బస్టాండుకి వెళ్ళాము. కాసేపట్లో ఒక బస్సూ, తెల్లారగట్ల ఇంకో బస్సు ఉన్నాయి. ఒక పక్కన ఆకలేసేస్తుంది. అప్పుడు బస్సెక్కినా దిగే టైముకి రాజమండ్రినుండి ఇంటికి వెళ్లలేమని తర్కించుకుని, వెంటనే వెళ్లి ఒక హోటల్లో తలో ప్లేటు ఇడ్లీ లాగించేసి తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచించుకుంటుంటే!

అయినా అన్ని షోలు చూసి సెకండ్ షో వదిలేస్తే అది బాధపడదూ! వెంటనే సమన్యాయం చెయ్యడానికి రంగంలోకి దూకి కమల్హాసన్ గారి బ్రహ్మచారి సినిమాకి వెళ్లిపోయాం. అది కూడా అవగొట్టుకుని బస్టాండుకి నడుచుకుంటూ వెళ్తుంటే శీతాకాలం దాని ప్రతాపం చూపించింది. బస్సొచ్చేవరకు అక్కడ కూర్చుంటే చలిలో చస్తామని బస్టాండు బయటకొచ్చి రావులపాలెం వరకు వెళ్తున్న లారీ ఎక్కేసాం. వెనక డ్రైవరుగారి బెడ్డు ఖాళీగా ఉంటే నన్ను అక్కడ పడుకోబెట్టేసి మా నాన్న ముందు కూర్చున్నారు. అర్ధరాత్రి మూడింటికి రావులపాలెంలో దిగాక కడుపులో డైనోసార్లు తిరగడం మొదలు పెట్టాయి. నా వల్ల కాదు బాబోయ్ అని ఏడుస్తుంటే నన్ను ఎత్తుకుని తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తుంటే దూరంగా రోడ్డు పక్కన ఒక లైటు, దానికింద ఒక మంట కనిపించాయి. ఆ టైములో వాడు మాకు ఎడారిలో ఒయాసిస్సులా కనిపించాడు. వెళ్లి నాకు దోశ, మా నాన్నగారికి ఒక హాఫ్ బాయిల్ చెప్పారు. కాసేపటికి వాడు రెండు హాఫ్ బాయిల్ ఆమ్లెట్లతో వచ్చాడు. చెప్పింది ఏంటి తెచ్చింది ఏంటి అని అడిగితే అదే ఉందని సమాధానం చెప్పాడు. నేను తినను కాబట్టి నన్ను ఆ పరిస్థితిలో చూసి మా నాన్నగారు కూడా తినలేదు. రెండు ప్లేట్లు అక్కడే వదిలేసి మళ్ళీ లారీలు ఆపడంకోసం రోడెక్కి నిలబడ్డాం. కాసేపటికి రాజమండ్రి వెళ్లే లారీ దొరకడంతో తెల్లారేసమయానికి ఇంటిదగ్గర దిగబడ్డాం. తలుపు తెరుచుకున్న వెంటనే ఆ సంవత్సరం మాకు విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండానే దుర్గ దర్శనం అయిపొయింది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?