మీరు చదువుకునేటప్పుడు మంచి మార్కులతో ఎప్పుడూ మొదటిస్థానంలో నిలిచిన విద్యార్ధి, తరువాతి దశలో చిన్న ఉద్యోగంలో స్థిరపడినవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు అలా అవ్వడానికి కారణం ఏమిటి అని మీ ఉద్ధేశ్యం?
ఒక్కరు కాదు, ముగ్గురున్నారు. ముగ్గురికీ ఒకే కారణం, కుటుంబ పరిస్థితులు.
ఆ ముగ్గురు నాతోపాటు పదోతరగతి వరకు చదువుకున్నారు. ముగ్గురికీ చాలా మంచి మార్కులొచ్చాయి. తర్వాత ఇంటర్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అప్పటికే కార్పొరేట్ కళాశాల ప్రతినిధులు ప్రతీ విద్యార్థి ఇంటికి తిరిగి పిల్లల్ని వారి కొట్టాంలో కట్టెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చిన వాటిలో అధిక ఫీజు కారణం చేత మొదటి రెండూ వద్దనుకుని మూడో దానిలో చేరాను. మిగిలిన వాళ్ళు కూడా ఎదో ఒక కళాశాలలో చేరుంటారని అనుకున్నాను. కానీ…
పరీక్ష ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఆ ముగ్గురిలో ఒకరికి పెళ్ళైపోయింది. బడిలో రెండేళ్లు విరామం తీసుకుని మళ్ళీ చేరినప్పటికీ పెళ్లయ్యే సమయానికి తనకి 18 ఏళ్ళు లోపే ఉంటాయి. కానీ నలుగురు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దమ్మాయి అవడం చేత ఇంట్లోవాళ్ళు కంగారుపడి పెళ్లి చేశేసారు. వచ్చిన భర్త అర్ధం చేసుకునేవాడవడంచేత పెళ్లి తర్వాత చదివించారు. కానీ ఇంటర్ తర్వాత ఆరోగ్యకేంద్రంలో ఉద్యోగం అవకాశం వస్తే పైచదువులకి వెళ్లకుండా ఆ ఉద్యోగంలో చేరిపోయింది.
ఇంకొకరిది కూడా అటువంటి కధే. ఇంట్లో నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి. ఇంకో ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చెయ్యాలి, చదివించలేమని చెప్పేసారు. అక్కడితో స్వస్తి చెప్పి చిన్న ఉద్యోగంలో చేరిపోయాడు. ఈ మధ్య పడిన పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసినట్లున్నాడు. వస్తుందనే నమ్మకం నాకుంది. మా ఊళ్ళో ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వాళ్లందరిలోనూ వీడికే ఎక్కువ మార్కులు.
మూడోవాడు మా అందరితో పోలిస్తే మంచి స్థితిలోనే ఉండేవాడు. వాడికి వచ్చిన మార్కులకి ఉచితంగానే సీటు వచ్చుండాలి. కానీ వాళ్ళింటికి దగ్గర్లో ఉన్న కళాశాలలో చేరాడు. ఆ తరువాత డిగ్రీ కూడా అక్కడే. ఉద్యోగం కూడా వాళ్ళింటికి దగ్గర్లోనే ఉన్న ఒక ఫ్యాక్టరీలో చేస్తున్నాడు. ప్రయత్నించిఉంటే గ్రూప్స్ ఖచ్చితంగా కొట్టేవాడు. కానీ ఎందుకో తెలీదు, ప్రయత్నించలేదు. దూరం పంపడం ఇష్టం లేక ఇంట్లోవాళ్లు వెళ్లనివ్వలేదేమో. ఇప్పుడు కూడా ఎవ్వరితో కలవడు. బడి వాట్సాప్ గ్రూపులో కూడా చేరలేదు.
అప్పట్లో పరిస్థితులకు తలొగ్గి తీసుకున్న నిర్ణయాలకు మొదటి ఇద్దరు ఎప్పుడూ బాధపడలేదు. మూడోవాడు కూడా సంతోషంగానే ఉన్నాడని అనుకుంటున్నాను.
Comments
Post a Comment