మీరు చదువుకున్న రోజుల్లో ఏ మాస్టారు అయినా ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులు వేసేవారా? అప్పుడు మీరేం చేశారు?

 ఒకసారి జరిగింది. అది కూడా ఒకే ఒక్క మార్కు. ఒక్క మార్కే కదా అని నేను కూడా సర్దుకుపోవాల్సింది కానీ అడిగి మరీ తిట్లు తిని, ఆ లెక్చరర్కి నామీద ఉన్న కాస్తోకూస్తో మంచి అభిప్రాయాన్ని చెడగొట్టుకున్నాను.

ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రాబబిలిటీ పాఠ్యాంశం ఉండేది. ఇంటర్ చదివేరోజులనుండే నాకు ఆ సబ్జెక్టు అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్లో కూడా ఉన్నందుకు సంతోషపడ్డాను. మా లెక్చరర్ కూడా చాలా అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. ప్రణాళిక ప్రకారం క్లాసులు తీసుకునే చాలా తక్కువ మంది లెక్చరర్లలో అయన కూడా ఒకరు. నలభై ఏళ్ల అనుభవముండొచ్చు ఆయనకి. కోపం కూడా కొంచెం ఎక్కువే.

ఆ సెమిస్టర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రాబబిలిటీ పరీక్షలో మూడు ఏడు మార్కుల ప్రశ్నలు ఇచ్చి రెండింటికి సమాధానం రాయమన్నారు. రెండు ఆరు మార్కుల ప్రశ్నలిచ్చి ఒకదానికి సమాధానం రాయమన్నారు. నేను రెండు ఏడు మార్కుల ప్రశ్నలకు, రెండు ఆరు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసాను.

ఒక వారం తర్వాత దిద్ది సరిచూసుకోమని మా పేపర్లను మాకు ఇచ్చారు. నాకు ఇరవైకి పంతొమ్మిది మార్కులొచ్చాయి. ముందు సంతోషపడ్డాను. కానీ పేపర్లో రెండు ఏడు మార్కుల సమాధానాలకు ఏడేసి మార్కులు, ఒక ఆరు మార్కుల సమాధానానికి ఆరు మార్కులు, ఇంకో ఆరు మార్కుల సమాధానానికి ఐదు మార్కులు పడ్డాయి. ఒక ఆరు మార్కుల సమాధానం ఆప్షనల్ కి తీసేస్తే నాకు మొత్తంగా ఇరవై రావాలి. కూడికలో పొరపాటు జరిగిందేమోనని లెక్చరర్కి పేపర్ చూపించాను. ఆయన పరిశీలించి "నువ్వు రాసిన సమాధానాల్లో నాకు నచ్చిన దానిని తీసుకుంటాను. ఇక మార్కులు మార్చడం కుదరదు." అని పేపర్ చేతిలో పట్టుకుని సమాధానం చెప్పారు. నాకు కోపమొచ్చి చేతిలోని పేపర్ మళ్ళీ అడిగి తీసుకోకుండా, ఇక తిరిగి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వచ్చి కూర్చున్నా. వచ్చి పేపర్ తీసుకెళ్ళి నా నెంబర్ పిలిచినప్పుడు ఇమ్మని హెచ్చరికతో కూడిన స్వరంతో చెప్పారు. వెంటనే మళ్ళీ లేచివెళ్లి అయన చేతిలోని పేపర్ని విసురుగా లాగి తిరిగొచ్చి కూర్చున్నాను.

దాంతో అయన దృష్టిలో నేనొక పొగరుబోతనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత అయన క్లాసులో నవ్వానని రెండు సార్లు బయటకి పంపేశారు. తరువాతి ఇంటర్నల్ లో పదిహేను దాటలేదు. ఒకసారి మాటల్లో అదే కాలేజీలో MCA చదువుతున్న నా స్నేహితుడితో ఈ విషయం చెబితే ఆయన పూర్తి మార్కులు ఇవ్వరని ఇటువంటిదే వాళ్ళ తరగతిలోను జరిగాయని తెలిసింది.

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?