మీ వృత్తి జీవితంలో మీరు చూసిన అత్యంత హాస్యాస్పదమైన ఈమెయిల్ ఏమిటి?
చూసినది కాదు. సగం తగలబెట్టినది.
ట్రైనింగ్ పూర్తయ్యి కొత్తగా ప్రాజెక్టులో చేరిన రోజులు. అసలు నా పని జీవితంలో ఏం జరగకూడదని బలంగా కోరుకుంటానో అదే నాకు మొదటిరోజు తగిలేసింది. నాలుగేళ్లు కాలేజీలో, మూడు నెలలు ట్రైనింగ్లో రాక్షస బల్లుల్లాగా కొట్టుకుచచ్చిన నా సహవిద్యార్థి అదే ప్రాజెక్టులో రెండు వారాల నుండి పనిచేస్తుంది. నా దరిద్రానికి నాకు ప్రాజెక్ట్ వివరించాల్సిన పని కూడా తనకే అప్పజెప్పారు. అవసరం నాది కాబట్టి అహాన్ని పక్కనపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాను. పాత పగలన్నీ మర్చిపోయి తాను కూడా బాగానే వివరించేది.
ఒకసారి నేను తన పక్కన కూర్చుని ఒక తెరలో ప్రోజెక్టు నేర్చుకుంటుంటే తన రెండో తెర మీద సెలవు కోసం లైన్ మేనేజర్కి మెయిల్ రాస్తుంది.
సబ్జెక్టు: leave
Hello Mariappan,
Hope you are doing fine.
సరిగ్గా అదే సమయానికి రన్ అవుతున్న ప్రోగ్రాం మాకు కావాల్సిన స్థానానికి రావడంతో తను మొదటి తెర వైపు చూసింది. ఆ ప్రోగ్రాం ని ఎంచుకుందేమోనని నేను తన కీబోర్డ్ మీద కంట్రోల్ బటన్ నొక్కి పట్టుకున్నాను. తను ఇంకా మెయిల్ లోనే ఉండి తర్వాతి లైన్ కోసం ఎంటర్ నొక్కింది. అంతే, సగంలో ఉన్న ఆ మెయిల్ సెండ్ అయిపోయింది.
కంటిచూపుతో చంపేసేటట్లు ఒక చూపు చూసి వెంటనే లైన్ మేనేజర్ క్యూబికల్ కి పరిగెత్తింది. ఏం జరిగిందో అర్ధంకాక నేను కూడా క్యూబికల్ వైపే చూస్తున్నా. అక్కడికెళ్లి ఎదో మాట్లాడి అద్దంలోనుండి నన్ను చూపిస్తుంది. ఒక్క క్షణం నాకు భయమేసింది. సెంట్రల్ ఏసీలో అరచేతులు చెమటతో తడిచిపోయాయి. నేనేం చేసానే తల్లి అని తిట్టుకుని "నేనేం చెయ్యలేదు, నాకే పాపం తెలీదు" ని ఇంగ్లీషులో ఏమనాలో మనసులో ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు ఉపశమనం కలిగిస్తూ కాసేపటికి లైన్ మేనేజర్ పగలబడి నవ్వాడు.
తిరిగొచ్చిన తర్వాత ఆ అమ్మాయి జరిగింది చెప్పి అదంతా నేను కావాలనే చేసినట్లు నన్ను తిట్టడం మొదలెట్టింది. పిల్లీ కుక్కల పోరాటం మళ్ళీ మొదలయ్యిందనుకుని కిమ్మనకుండా నా క్యూబికల్ నేను వెళ్ళిపోయాను.
Comments
Post a Comment